● పింఛన్ రీ వెరిఫికేషన్
పూర్తయినప్పటికీ..
● రీ అసెస్‌మెంట్ కోసం సర్వజన
ఆస్పత్రికి రప్పించిన పరిస్థితి
విజయనగరం ఫోర్ట్: తమ పట్ల చంద్రబాబు సర్కార్ కక్షపూరితంగా వ్యవహరిస్తోందని దివ్యాంగులు ఆరోపిస్తున్నారు. రాజకీయ కక్షతో దివ్యాంగులను పదేపదే వేధిస్తున్నారని తీవ్ర ఆవేదన చెందుతున్నారు. రీవెరిఫికేషన్, రీ అసెస్‌మెంట్ పేరుతో వారిని ఆస్పత్రుల చుట్టూ తిప్పుతుండడంతో తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. రాష్ట్ర సెర్ప్ ఎన్‌ఆర్‌ఐ వ్యవహారాల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ఇలాకాలో దివ్యాంగులు వేధింపులకు గురికావడం గమనార్హం. గంట్యాడ మండలం పెదవేమలి గ్రామానికి చెందిన 11 మంది దివ్యాంగులను రీ అసెస్‌మెంట్ కోసం ప్రభుత్వ ఆస్పత్రి సర్వజన ఆస్పత్రికి వెళ్లాలని సచివాలయం సిబ్బంది లెటర్‌లు అందించారు. దీంతో చేసేది లేక దివ్యాంగులు సోమవారం ప్రభుత్వ సర్వజన ఆస్పత్రికి వచ్చారు. వారికి ఇదివరకే పింఛన్ రీ వెరిఫికేషన్ పూర్తయింది. ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా పింఛను రీ వెరిఫికేషన్ చేసినప్పుడు ఈ11 మంది కూడా రీ వెరిఫికేషన్‌కు హాజర య్యారు. అయితే రాష్ట్రంలో గాని జిల్లాలో గాని ఏ ఒక్కగ్రామంలోని దివ్యాంగులకు రీ అసెస్‌మెంట్ చేయించిన దాఖలాలు లేవు. కానీ పెదవేమలి గ్రామానికి చెందిన దివ్యాంగులనే రీఅసెస్‌మెంట్‌కు పిలవడం పట్ల సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి. దివ్యాంగులపై అధికార టీడీపీకి చెందిన నేతలు రీ అసెస్‌మెంట్ చేసేలా ఫిర్యాదు చేశారు. అంతటితో ఆగకుండా రీ అసెస్‌మెంట్ చేసేలా అధికారులపై టీడీపీ నేతలు ఒత్తిడి తెచ్చినట్లు ఆరోపణులు వినిపిస్తున్నాయి. ఫించన్‌పై అధారపడి జీవిస్తున్న తమను వివక్షకు గురి చేయడం ఎంతవరకు సమంజసమని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఎంపీడీఓ మెయిల్ పెట్టారు
11 మందిని ప్రభుత్వ సర్వజన ఆస్పత్రికి రీ అసెస్‌మెంట్ కోసం పంపించాలని ఎంపీడీఓ మెయిల్ పెట్టారు. అందుకే పంపించాం.
– ఆర్.వెంకటేశ్వరావు,
కార్యదర్శి, పెదవేమలి పంచాయితీ


