రాజాం: రాజాం పట్టణంలోని శ్రీ మల్లిఖార్జున వీవర్సు సొసైటీలో దొంగలు పడ్డారు. రికార్డులు గల్లంతు చేసి రూ.12లక్షల సరుకును మాయం చేశారు. ఇది ఇంటిదొంగల పనేనన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. సొసైటీ పరిధిలో చేనేత వస్త్రాల వ్యాపారం ఏటా రూ.లక్షల్లో సాగుతోంది. గత జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం అందజేసిన ఆర్థిక ఊతంతో సొసైటీలో మగ్గాల సంఖ్య పెరిగింది. ముడిసరుకులు విక్రయాలు జోరుగా సాగడంతో లాభాలు ఆర్జించింది. ప్రస్తుతం పాలకమండలి లేకపోవడంతో సొసైటీలో పనిచేసే సిబ్బంది, అధికారులే సొసైటీ నిర్వహణ బాధ్యత తీసుకున్నారు. ఈ సొసైటీకి రాజాం, తెర్లాం, సంతకవిటి, రేగిడి మండలాల్లోని పలు గ్రామాల్లోని చేనేత కార్మికులు సభ్యులుగా ఉన్నారు. వీరందరూ ఇక్కడి నుంచి ముడిసరుకును తీసుకెళ్లి చీరలు, పంచెలు, తువ్వా ళ్లు, దుప్పట్లు తయారుచేసి సొసైటీకి ఇచ్చేవారు. ఇలా వచ్చిన సరుకు ఇప్పుడు గల్లంతైంది. దీనివిలువ రూ.12 లక్షలు ఉంటుందని చేనేత కార్మికులు చెబుతున్నారు. చేనేత కార్మికుల పేరున ఆంధ్రప్రదేశ్ కోపరేటివ్ బ్యాంకు నుంచి వచ్చిన రుణాలను సైతం కొంతమంది బినామీలు కాజేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఇవి కాకుండా సొసైటీ నిర్వహణ పేరుతో ఆప్కో నిధుల్లో రూ.1.50 లక్షల నిధులు దిర్వినియోగం చేసినట్టు సభ్యులు ఆరోపిస్తున్నారు. వీటి వెనుక సొసైటీలో కొందరు అధికారులతో పాటు అధికార పార్టీ నేతల హస్తం ఉందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. అక్రమాల పర్వంతో సొసైటీ పనితీరు మరుగున పడిందని సభ్యులు వాపోతున్నారు. ఇక్కడ గతంలో డవలప్‌మెంట్ ఆఫీసర్‌గా పనిచేసిన వ్యక్తి తీరువల్లే సొసైటీలో సరుకు, నిధులు దుర్వినియోగం అయ్యాయన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.
మౌనం ఎందుకో?
ఇటీవల ఇక్కడ పనిచేసిన డీఓకు బదిలీ కావడం, కొత్తగా డీఓ ఇక్కడకు రాకపోవడం సొసైటీలో నిధుల దుర్వినియోగం, సరుకు మాయం వివాదం మరింత జఠిలంగా మారింది. 400 మంది సభ్యులు ఉండే సొసైటీ ఇప్పుడు మూలకు చేరడంతో పాటు ఇందులో నిధులు గోల్‌మాల్ వెనుక ప్రభుత్వ పాలకులు మౌనంగా ఉండడం, ఇంకో వైపు జౌళిశాఖ ఉన్నతాధికారులు సైతం ఏమీ పట్టనట్లు వ్యవహరించడం విమర్శలకు తావిస్తోంది. అధికార పార్టీకి చెందిన కొంతమంది కార్యకర్తల హస్తం ఉండడంతో సరుకు గల్లంతు విషయాన్ని సద్దుమణిగించే ప్రయత్నాలు సాగుతున్నట్టు సమాచారం. ఉన్నతాధికారులు స్పందించి వీవర్స్ సొసైటీలోని అక్రమాలను వెలుగులోకి తీయాలని పలువురు కోరుతున్నారు.
ఎక్కడ ఉన్నాయో తెలియదు..
ఈ విషయాన్ని జౌళిశాఖ రాజాం డీఓ ముఖర్జీ వద్ద ‘సాక్షి’ ప్రస్తావించగా, ఇటీవల తాను బదిలీ అయ్యానన్నారు. తన సమయంలో రికార్డులు నిర్వహణ చేశామని, ఆ రికార్డులు ప్రస్తుతం ఎక్కడ ఉన్నాయో తెలియదని సమాధానం ఇచ్చారు. మాయమైన యార్న్ (సరుకు) వివరాలు వెల్లడించేందుకు, రూ.1.50 లక్షల ఖర్చుల వివరాలు తెలిపేందుకు నిరాకరించారు.
మల్లిఖార్జున వీవర్స్ సొసైటీలో రికార్డులు గల్లంతు
లెక్కతేలని రూ.12 లక్షల సరుకు
పాలకమండలి లేక చక్రం తిప్పిన
అధికారులు


