కొత్తవలస: తిరుపతిలో జరగనున్న రాష్ట్ర స్థాయి వాలీబాల్ పోటీలకు జిల్లాకు చెందిన బాలికల జట్టు సోమవారం పయనమైంది. ఈ సందర్భంగా కోచ్, కంటకాపల్లి హైస్కూల్ పీడీ సీహెచ్ అమరావతి మాట్లాడుతూ.. హైస్కూల్ స్థాయికి సంబంధించి అండర్–17, జూనియర్ కళాశాలకు సంబంధించి అండర్–23 జట్లు బయలుదేరాయని చెప్పారు. రాష్ట్రస్థాయిలో రాణించి, జాతీయ స్థాయి పోటీలకు ఎంపికవ్వాలని ఆమె ఆకాంక్షించారు.
వన్నలిలో పట్టపగలే చోరీ
● నాలుగు తులాల బంగారం,
రూ. 60 వేల నగదు అపహరణ
రేగిడి: మండలంలోని వన్నలిలో ఆదివారం మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో చోరీ జరగడంతో గ్రామస్తులు అవాక్కయ్యారు. గ్రామానికి చెందిన బెవర నర్సింహులు, బెవర లక్ష్మి, బెవర సాయికుమార్ ఇంటకి తాళం వేసి, పక్కనే ఉన్న గజాలకు తాళం చెవి పెట్టి పొలం పనులకు వెళ్లిపోయారు. దీన్ని గమనించిన దొంగలు ఇంట్లోకి ప్రవేశించి, బీరువా తెరిచి రూ. 60 వేల నగదు, నాలుగు తులాల బంగారు ఆభరణాలు తీసి, ఎప్పటిలాగే తాళాలు వేసి వెళ్లిపోయారు. సాయంత్రానికి ఇంటికి వచ్చిన కుటుంబ సభ్యులు కూలీలకు డబ్బులు చెల్లించేందుకు బీరువా తెరవగా.. అందులో డబ్బులు, బంగారు వస్తువులు కనిపించకపోవడంతో ఆందోళన చెందారు. ఇంటికి ఎవరైనా వచ్చారా అంటూ వాకబు చేయగా.. ఎవరో ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు స్కూటీపై వచ్చి ఇంటి వద్ద ఆగారని.. అదే సమయంలో భోజనానికి వచ్చిన కొంతమంది రైతులు తెలిపారు. దీంతో బాధితుడు నర్సింహులు రేగిడి పోలీసులకు ఫిర్యాదు చేయగా.. ఎస్సై పి. బాలకృష్ణ, సిబ్బందితో గ్రామానికి వచ్చి ఇంటిని పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై చెప్పారు.


