టంగుటూరికి ఘన నివాళులు | - | Sakshi
Sakshi News home page

టంగుటూరికి ఘన నివాళులు

Aug 24 2026 1:07 AM | Updated on Aug 24 2026 1:07 AM

పార్వతీపురం రూరల్‌: ‘ఆంధ్ర కేసరి’ టంగుటూరి ప్రకాశం పంతులు జయంతిని స్థానిక జిల్లా పోలీస్‌ కార్యాలయంలో ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పోలీస్‌ అధికారులు ప్రకాశం పంతులు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. స్వాతంత్య్ర సమరయోధుడిగా, న్యాయ కోవిదుడిగా, రాజకీయవేత్తగా, పదునైన రచయితగా, సంపాదకుడిగా ఆయన అందించిన బహుముఖ సేవలను ఈ సందర్భంగా ప్రస్తావించారు. త్యాగనిరతి, అకుంఠిత దీక్షతో జాతీయ స్థాయిలో తెలుగు నేల ఖ్యాతిని నలుదిశలా చాటిచెప్పిన రాజనీతిజ్ఞుడని కొనియాడారు. కార్యక్రమంలో పలువురు పోలీసు అధికారులు, కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.

మృదంగంలో చిన్నారి ప్రతిభ

విజయనగరం టౌన్‌: విజయనగరం రోటరీ దశిగి పేర్రాజు మ్యూజిక్‌ అకాడమీ విద్యార్థి మరువాడ శ్రీధామ మృదంగంలో ప్రతిభ కనబరుస్తున్నాడు. కాకినాడ జేఎన్‌టీయూలో అఖిలం అనే సంస్థ ఆదివారం నిర్వహించిన రాష్ట్రస్థాయి బాలల ప్రతిభా ఉత్సవంలో జూనియర్‌ విభాగంలో ప్రథమ స్థానం కై వసం చేసుకున్నాడు. ఈ మేరకు అకాడమీ డైరెక్టర్‌ డాక్టర్‌ మండపాక రవి, అకాడమీ సభ్యులు, రొటేరియన్లు, అధ్యాపకులు చిన్నారిని అభినందించారు.

చరిత్ర తిరగరాసేది మహిళలే..

విజయనగరం టౌన్‌: ఆధునిక మహిళలు భారతదేశ చరిత్రను తిరగరాస్తారని, భగవంతుని దృష్టిలో ఉత్కృష్టమైన వస్తువు సీ్త్ర రత్నమేనని ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఆంధ్రోపన్యాసకులు డాక్టర్‌ ఎం.రమాగీతాదేవి అన్నారు. జిల్లా కేంద్రంలోని గురజాడ గ్రంథాలయంలో విజయభావన సాహితీ మిత్ర సమాఖ్య ఆధ్వర్యంలో ఆధునిక సాహిత్యం–మహిళాభ్యుదయం అనే అంశంపై ఆదివారం సదస్సు నిర్వహించారు. ఆధునిక సాహిత్యం అంతా కందుకూరి, గురజాడ వంటి వారి బాటలో గొప్పగా నడిచిందన్నారు. చాలావరకు పితృస్వామ్య కరుణతో సీ్త్రలను రక్షించాలన్న భావన ప్రధానంగా ఉందని, అది దాటి తన సమస్యకు తానే సమాధానం చెప్పగలిగే స్థితికి మహిళ రావడానికి శతాబ్దం పట్టిందన్నారు. నేటి సమాజంలో ప్రముఖ స్థానాల్లో సీ్త్రలు ఉన్నప్పటికీ రెట్టింపు శ్రమ దోపిడీకి గురవుతున్నారన్నారు. ఇంటి బయట ఉద్యోగం, ఇంటి లోపల పితృస్వామ్య బాధ్యతను ప్రస్తుతం సీ్త్రలు మోస్తున్నారన్నారు. మహిళ అభ్యుదయంలో బహుళ కోణాలున్నాయని, విమలగారి వంటిల్లు కవిత, అబ్బూరి చాయాదేవి బోన్సాయి కథనంలో బలంగా చూపించారు. అనంతరం రమాగీతాదేవిని సన్మానించారు. కార్యక్రమంలో డాక్టర్‌ జక్కు రామకృష్ణ, మహారాజ ప్రభుత్వ సంస్కృత కళాశాల అధ్యక్షుడు డాక్టర్‌ జి.జనార్దననాయుడు, ఇబ్రహీంఖాన్‌, ఎ.గోపాలరావు, సూర్యలక్ష్మి, ఇందిర, హరిప్రియ, అనూరాధ, శంకరం, నీలాద్రి, ప్రసాద్‌, సోమేశ్వరరావు, ఈశ్వర్‌ తదితరులు పాల్గొన్నారు.

వరద పోటెత్తింది..

రోడ్డుకు గండిపడింది

సీతంపేట: మండలంలోని పొల్ల గ్రామం సమీపంలో రోడ్డు కోతకు గురైంది. గత రెండు రోజులుగా కురిసిన వర్షాలకు వాగులు పొంగాయి. వరద ఉధృతికి రోడ్డుకు గండి పడింది. దీంతో గుమ్మలక్ష్మీపురం–పొల్ల మార్గంలో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. అధికారులు స్పందించి రోడ్డుకు మరమ్మతు పనులు చేపట్టాలని కోరుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement