అడవిలో దాహం తీర్చే ఊటలు | - | Sakshi
Sakshi News home page

అడవిలో దాహం తీర్చే ఊటలు

May 16 2026 1:33 AM | Updated on May 16 2026 1:33 AM

అడవిలో దాహం తీర్చే ఊటలు

విజయనగరం గంటస్తంభం: ఒకప్పుడు వేసవి మొదలైందంటే చాలు..విజయనగరం జిల్లాలోని అభయారణ్య ప్రాంతాల్లో వన్యప్రాణుల పరిస్థితి దయనీయంగా మారేది. అడవుల్లో ఉన్న సహజ నీటి వనరులు ఒక్కొక్కటిగా ఎండిపోవడంతో జంతువులు దాహంతో అల్లాడేవి. నీటి కోసం అడవిని విడిచి గ్రామాల దారిపట్టేవి. ఆ సమయంలో వేటగాళ్ల ఉచ్చులు, విద్యుత్‌ కంచెలు, రహదారి ప్రమాదాలకు బలై ఎన్నో మూగజీవాలు ప్రాణాలు కోల్పోయేవి. అయితే ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. అటవీశాఖ తీసుకున్న ప్రత్యేక చర్యలతో విజయనగరం అభయారణ్యం ఇప్పుడు వన్యప్రాణులకు జీవనాధారంగా మారింది. అడవి మధ్యలోనే నీటికుంటలు, చెక్‌డ్యామ్‌లు, చెలమలు, రాతికట్టడాలు, సాసర్‌పిట్లు నిర్మించి వేసవిలో కూడా జంతువులకు నీటి కొరత లేకుండా చేస్తున్నారు. దీంతో అడవులు మరింత పచ్చగా మారడమే కాకుండా వన్యప్రాణుల సంఖ్య కూడా క్రమంగా పెరుగుతోంది.

అడవి గుండెలో నీటి జలధారలు

విజయనగరం జిల్లా పరిధిలో సుమారు 17,300 హెక్టార్లలో విస్తరించి ఉన్న అభయారణ్యం దాదాపు 173 కిలోమీటర్ల మేర వ్యాపించి ఉంది. కొండలు, లోయలు, గిరిజన గ్రామాలు, లోతట్టు అటవీ ప్రాంతాలతో ఈ ప్రాంతం ప్రకృతి సంపదకు నిలయంగా నిలుస్తోంది. గతంలో వేసవి రాగానే అడవిలోని చిన్నచిన్న వాగులు, చెలమలు పూర్తిగా ఎండిపోయేవి. దీంతో జంతువులు నీటి కోసం నదులు, గ్రామాలవైపు వెళ్లాల్సి వచ్చేది. ఇప్పుడు మాత్రం పరిస్థితి భిన్నంగా కనిపిస్తోంది. అడవి లోపలే నిర్మించిన నీటి వసతుల వల్ల జంతువులు బయటకు రావాల్సిన అవసరం లేకుండా పోయింది.

పచ్చదనంతో అభయారణ్యం:

అటవీశాఖ చేపట్టిన చర్యలతో అడవులు మళ్లీ పునర్జీవం పొందుతున్నాయి. గత తొమ్మిదేళ్లుగా సాగుతున్న వన సంరక్షణ చర్యల ఫలితంగా అభయారణ్యంలో పచ్చదనం పెరిగింది. అడవులు మరింత దట్టంగా మారాయి. ఇప్పుడు అడవిలో అడవి పందులు, ఎనుబోతులు, ఎలుగుబంట్లు, జింకలు, దున్నలు స్వేచ్ఛగా సంచరిస్తున్నాయి. కోతులు, కొంగలు, నెమళ్లు, అరుదైన పక్షులు కూడా పెద్ద సంఖ్యలో కనిపిస్తున్నాయి. పర్యావరణ సమతౌల్యం క్రమంగా మెరుగుపడుతోందని అధికారులు చెబుతున్నారు.

గ్రామాల్లో అవగాహన కార్యక్రమాలు:

అటవీ గ్రామాల ప్రజలకు వన్యప్రాణుల సంరక్షణపై ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. వన్యప్రాణుల సంరక్షణ చట్టం–1972 గురించి గ్రామస్తులకు వివరిస్తున్నారు. జంతువులకు హాని చేస్తే కఠిన శిక్షలు ఉంటాయని తెలియజేస్తున్నారు. అడవిలో జంతువులు కనిపించినప్పుడు వాటిని రెచ్చగొట్టకుండా ఉండాలని, వెంటనే అటవీశాఖకు సమాచారం ఇవ్వాలని సూచిస్తున్నారు.

అభయారణ్యంలో పుష్కలంగా నీటివసతులు

జంతువుల కోసం నీటికుంటలు, చెక్‌ డ్యామ్‌లు

తాగునీటి కోసం గ్రామాలకు రాకుండా అడవిలోనే ఏర్పాట్లు

వేటగాళ్లపై అటవీశాఖ ఉక్కుపాదం:

వన్యప్రాణులను రక్షించేందుకు అటవీశాఖ ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసింది. అటవీ ప్రాంతాల్లో నిరంతరం పెట్రోలింగ్‌ నిర్వహిస్తూ అనుమానాస్పద వ్యక్తుల కదలికలను గమనిస్తున్నారు. విద్యుత్‌ కంచెలు, ఉచ్చులు, అక్రమ వేటకు సంబంఽఽధించిన సమాచారం వచ్చిన వెంటనే కఠిన చర్యలు తీసుకుంటున్నారు. అడవుల్లో సీసీ కెమెరాలు, మొబైల్‌ పర్యవేక్షణ, స్ధానిక గిరిజనుల సహకారంతో వేటగాళ్ల కదలికలను గుర్తిస్తున్నారు.

జంతువుల దాహం తీరేలా ప్రత్యేక ప్రణాళిక

వేసవి తీవ్రతను దృష్టిలో పెట్టుకుని అటవీశాఖ ప్రత్యేక ప్రణాళిక అమలు చేస్తోంది. నీటి కొరత ఉన్న ప్రాంతాలను గుర్తించి అక్కడ కృత్రిమ నీటి వనరులు ఏర్పాటు చేస్తున్నారు. చెక్‌డ్యామ్‌లు, సాసర్‌ పిట్లు, మినీ వాటర్‌ పాయింట్లు, రాతి కట్టడాలు నిర్మించి వర్షపు నీటిని నిల్వ చేస్తున్నారు. కొన్ని ప్రాంతాల్లో ట్యాంకర్ల ద్వారా నీటిని నింపుతూ అడవిలోని నీటికుంటలను ఎప్పటికప్పుడు నిండుగా ఉంచుతున్నారు. అధికారులు, అటవీ సిబ్బంది ప్రతిరోజూ పర్యవేక్షణ చేస్తూ నీటి పరిస్ధితిని పరిశీలిస్తున్నారు.

వన్యప్రాణులను కాపాడడం అందరి బాధ్యత

వేసవిలో వన్యప్రాణులు ఇబ్బంది పడకుండా అడవిలోనే నీటి వసతులు కల్పిస్తున్నాం. చెక్‌డ్యామ్‌లు, నీటికుంటలు, చెలమల ద్వారా జంతువులకు తాగునీరు అందిస్తున్నాం. వేటగాళ్లపై కఠిన నిఘా కొనసాగుతోంది. ప్రజలు కూడా వన్యప్రాణుల సంరక్షణలో భాగస్వాములు కావాలి. అడవిలోని జీవ వైవిధ్యాన్ని కాపాడడం అందరి బాధ్యత.

– బిర్లంగి రామ్‌నరేష్‌,

అటవీ రేంజ్‌ అధికారి, విజయనగరం

Advertisement
 
Advertisement
Advertisement