పాలకొండ రూరల్: భౌతికంగా ఇంటి పెద్ద మరణించినా వేరొకరిలో అతడు జీవించేలా ఆ కుటుంబం ముందుకు వచ్చింది. ఆరోగ్య సమస్యలతో తమ తండ్రి వారి మధ్య లేకున్నా ఆయన ఆవయవాలను దానం చేయటం ద్వారా మరో వందేళ్లు సదరు అవయవాలు పొందిన వారిలో జీవించే ఉంటారని పిల్లలు తలచారు. బ్రైన్ డెడ్‌తో తుదిశ్వాస విడిచిన ఇంటి పెద్ద అవయవాలను దానం చేయడానికి ముందుకు వచ్చి ఆదర్శంగా నిలిచారు. వివరాల్లోకి వెళితే.. పాలకొండ పట్టణం వడమలో నివాసం ఉంటున్న వైశ్యరాజు దుర్గారావు(62) కొద్ది రోజులుగా ఆరోగ్య సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారు. ఈ క్రమంలో ఆయనను విశాఖ అపోలో ఆసుపత్రిలో చేర్పించి వైద్య సేవలు అందించారు. ఈ క్రమంలో గురువారం రాత్రి బ్రైన్ డెడ్ కావటంతో వైద్యులు ఆయన కుటుంబ సభ్యులకు తెలిపారు. కట్టుకున్న భర్తను కోల్పోనున్నట్టు తెలిసినా దుర్గారావు భార్య క్రిష్ణవేణి, కన్న తండ్రి ఇకపై తమ మధ్య ఉండరని తెలిసి పిల్లలు ఆదిత్యరాజు, స్వాతి తట్టుకోలేకపోయారు. తీరని ఆవేదన, గుండె భారాన్ని పంటి దిగువ బిగబట్టారు. భౌతికంగా ఆయన మరణించినా అవయవ దానం ద్వారా వేరొకరిలో తమ తండ్రిని బతికించవచ్చని భావించారు. తమ తల్లి, కుటుంబ సభ్యుల అంగీకారంతో కళ్లు, కాలేయం దానమిచ్చారు.
జిల్లా పోలీస్ కార్యాలయంలో ‘వెల్ఫేర్ డే’
పార్వతీపురం రూరల్: అహర్నిశలు ప్రజాసేవలో అంకితమయ్యే పోలీస్ సిబ్బంది వ్యక్తిగత, వృత్తిపరమైన ఇబ్బందులను తొలగించడమే తమ మొదటి ప్రాధాన్యమని పార్వతీపురం మన్యం జిల్లా ఎస్పీ శ్రీ ఎస్.వి.మాధవ్ రెడ్డి స్పష్టం చేశారు. ఈ మేరకు శుక్రవారం జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన ‘పోలీస్ వెల్ఫేర్ డే’ (గ్రీవెన్స్ డే) వేదికగా ఆయన సిబ్బందితో ముఖాముఖి భేటీ అయ్యారు. విధుల్లో ఎదురయ్యే సవాళ్లతో పాటు, సిబ్బంది ఆరోగ్యం, కుటుంబ సమస్యలను నేరుగా అడిగి తెలుసుకున్నారు. శాంతిభద్రతల పరిరక్షణలో అలసట ఎరుగక శ్రమించే సిబ్బందికి అండగా నిలవడమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశమని ఎస్పీ పేర్కొన్నారు. ఈ సందర్భంగా జిల్లా నలుమూలల నుంచి వచ్చిన పోలీసుల నుంచి ఆయన వినతులను స్వీకరించారు. ప్రధానంగా అనారోగ్య సమస్యలు, బదిలీలకు సంబంధించిన విన్నపాలు ఎస్పీ దృష్టికి వచ్చాయి. ప్రతి అర్జీని క్షుణ్ణంగా పరిశీలించిన ఆయన, సమస్యల పూర్వాపరాలను ఆరా తీసి, వాటి పరిష్కారానికి త్వరితగతిన చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో జిల్లా పోలీస్ కార్యాలయం సీసీ సంతోష్ కుమార్, ఇతర సిబ్బంది పాల్గొన్నారు.
మోపెడ్ అదుపుతప్పి
యువకుడికి గాయాలు
బలిజిపేట: మండలంలోని బలిజిపేట–పెదపెంకి రోడ్డులో ద్విచక్రవాహనం అదుపుతప్పడంతో వెంగాపురం గ్రామానికి చెందిన బండి వెంకటేష్ గాయాల పాలయ్యాడు. బలిజిపేట–పెదపెంకి మార్గంలో రోడ్డుపక్కన పడిఉన్న వెంకటేష్‌ను అటువైపుగా వెళ్తున్న వారు చూసి బలిజిపేట పీహెచ్‌సీకి తరలించారు. మోపెడ్‌పై వెళ్తున్న వెంకటేష్ దానిని అదుపుచేయలేకపోవడంతో గాయాల పాలై పడిపోయి ఉంటాడని స్థానికులు చర్చించుకుంటున్నారు. వెంకటేష్‌కు పీహెచ్‌సీలో వైద్యసేవలు అందించి మెరుగైన వైద్యం నిమిత్తం పార్వతీపురం పీహెచ్‌సీకి తరలించారు.
గాయపడిన వ్యక్తి మృతి
తెర్లాం: రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వ్యక్తి శుక్రవారం మృతి చెందాడు. దీనికి సంబంధించి తెర్లాం ఎస్సై సాగర్‌బాబు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. బాడంగి మండలం వాడాడకు చెందిన గొట్టాపు శ్రీనివాసరావు(47)ద్విచక్ర వాహనాన్ని మండలంలోని కూనాయవలస జంక్షన్ వద్ద ఈనెల 11న లారీ ఢీకొనడంతో తీవ్రంగా గాయపడ్డాడు. ఆయనను చికిత్స కోసం విజయనగరంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్చగా చికిత్స పొందుతూ శుక్రవారం మృతి చెందాడు. హెచ్‌సీ నాగేశ్వరరావు మృతదేహానికి శవపంచనామా నిర్వహించి పోస్టుమార్టం కోసం తరలించారు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు.


