విజయనగరం టౌన్: ఉత్తరాంధ్రుల ఆరాధ్య దైవం, శ్రీ పైడితల్లి అమ్మవారు జన్మనక్షత్రమైన మూలా నక్షత్రాన్ని పురస్కరించుకుని స్థానిక రైల్వేస్టేషన్ వద్ద నున్న వనంగుడిలో భక్తిశ్రద్ధలతో అమ్మవారికి బుధవారం చండీయాగం నిర్వహించారు. వేదపండితులు సాయికిరణ్ శర్మ, వెలువలపల్లి నరసింహమూర్తిలు శాస్త్రోక్తంగా యాగప్రక్రియ చేశారు. యాగ విశిష్టతను భక్తులకు వివరించారు. అనంతరం యాగంలో పాల్గొన్న భక్తులకు అమ్మవారి శేషవస్త్రాలను, తీర్ధప్రసాదాలను అందజేశారు. కార్యక్రమంలో అర్చకులు నేతేటి ప్రశాంత్, తదితరులు పాల్గొన్నారు.
ఉచిత కంప్యూటర్ శిక్షణ
విజయనగరం రూరల్: బీటెక్, డిగ్రీ పూర్తి చేసిన, చదువుతున్న నిరుద్యోగ యువతీయువకులకు కంప్యూటర్ కోర్సుల్లో ఉచిత శిక్షణ అందించనున్నట్లు ఎన్‌ఆర్‌ఐ కుమార్ తెలిపారు. నగర పరిధిలోని రాజారావు మేడ సమీప కంచర్ల టవర్స్‌లోని కార్యాలయంలో జావా, నెట్, అడ్వాన్స్‌డ్, పైథాన్, ఏఐ బేసిక్స్, సీ ప్లస్, ప్లస్ కోర్సులపై శిక్షణ అందించనున్నామని ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఇతర వివరాలకు ఫోన్ 7187578586, 6281974895, 6303756314 నంబర్లను సంప్రదించాలని సూచించారు.
రెండవ రోజు కొనసాగిన తైక్వాండో పోటీలు
విజయనగరం: జిల్లా వేదికగా జరుగుతున్న రాష్ట్రస్థాయి తైక్వాండో చాంపియన్‌షిప్ పోటీలు రెండువ రోజు బుధవారం కొనసాగాయి. జిల్లా తైక్వాండో అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న 5వ ఏపీ కప్ పోటీల్లో భాగంగా 26 జిల్లాలకు చెందిన 800మందికి పైగా క్రీడాకారులు పోటీల్లో పాల్గొన్నారు. వారికి నగరంలోని రాజీ వ్ ఇండోర్ స్టేడియంలో నాకౌట్ పద్ధతిలో పోటీలు నిర్వహిస్తుండగా..క్రీడాకారులు పోటాపోటీగా తలపడుతున్నారు. పోటీల్లో విజేతలుగా నిలిచిన క్రీడాకారులకు గురువారం బహుమతి ప్రదానోత్సవం చేయనున్నట్లు అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు గురాన అయ్యలు, సీహెచ్ వేణుగోపాలరావులు తెలిపారు.
వ్యక్తి ఆత్మహత్య
విజయనగరం క్రైమ్: స్థానిక ప్రదీప్ నగర్‌కు చెందిన ప్రతాప్ బాల సిద్ధార్థ(39) తన నివాసంలో ఆత్మహత్యకు పాల్పడినట్లు వన్ టౌన్ పోలీసులకు బుధవారం ఫిర్యాదు అందింది. దీంతో సీఐ ఆర్వీఆర్‌కే చౌదరి ఆదేశాలతో హెచ్‌సీ అప్పలనాయుడు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. భార్య, పిల్లలు ఉన్న సిద్ధార్థ్‌కు విడాకులై ఒంటరిగానే ఉంటున్నాడని దర్యాప్తు అధికారి హెచ్‌సీ అప్పలనాయుడు తెలిపారు.
16 కేజీల గంజాయితో ఇద్దరి అరెస్ట్
విజయనగరం క్రైమ్: సుమారు రూ.8 లక్షలు విలువ చేసే 16 కేజీల గంజాయి అక్రమంగా రవాణా చేస్తున్న ఇద్దరు నిందితులను జీఆర్పీ సిబ్బంది బుధవారం అరెస్ట్ చేశారు. విజయనరంలోని రైల్వేస్టేషన్ ప్లాట్‌ఫామ్‌లపై జీఆర్పీ, ఆర్పీఎఫ్ సిబ్బంది తనిఖీలు నిర్వహిస్తుండగా కర్ణాటక రాష్ట్రంలోని శివమొగ్గకు చెందిన మహమ్మద్ ఇబ్రహీం ఖలీల్, మహంత్ డీఎన్‌ఎస్‌లు అనుమానాస్పదంగా తిరుగుతుండడాన్ని గుర్తించారు. వారిని విచారణ చేయగా అక్రమంగా గంజాయి రవాణా చేస్తున్నట్లు తేలడంతో ఇద్దరినీ అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసి ఇద్దరి వద్ద ఉన్న 16 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకుని కోర్టుకు తరలించినట్లు జీఆర్పీ ఎస్సై బాలాజీ రావు తెలిపారు.
కొనసాగుతున్న దర్యాప్తు
రాజాం సిటీ: మున్సిపాల్టీ పరిధిలో జరిగిన వివాహిత హత్యకేసుకు సంబంధించి ముమ్మరంగా దర్యాప్తు కొనసాగిస్తున్నామని ఇన్‌చార్జి టౌన్ సీఐ శ్రీనివాసరావు బుధవారం తెలిపారు. ఇప్పటికే ప్రత్యేక బృందాలతో శ్రీకాకుళం, పలాస, ఇచ్ఛాపురం, విశాఖపట్నం తదితర ప్రాంతాల్లో మృతురాలి కుమారుడు శశాంక్ ఆచూకీ కోసం గాలింపు చర్యలు చేపట్టామన్నారు. అన్ని కోణాల్లో డోలపేటలోని అతని స్నేహితుల వద్ద వివరాలు సేకరిస్తున్నామని పేర్కొన్నారు.


