విజయనగరం టౌన్: మేడే వారోత్సవాల్లో భాగంగా సాహితీ స్రవంతి, సీఐటీయూ జిల్లాశాఖల ఆధ్వర్యంలో కొత్తూరి శ్రీనివాస్ అధ్యక్ష్యతన స్థానిక గురజాడ స్వగృహంలో బుధవారం సాయంత్రం నిర్వహించిన కవి,గాయక సమ్మేళనం ఆకట్టుకుంది. ప్రముఖ రచయిత అట్టాడ అప్పలనాయుడు ముఖ్య అతిథిగా కార్యక్రమంలో పాల్గొని ప్రసంగించారు. సుమారు 80 ఏళ్ల తర్వాత మళ్లీ ఎనిమిది గంటల పనిదినాల కోసం పోరాడాల్సిన సమయం వచ్చిందన్నారు. ప్రభుత్వ, ప్రైవేట్ రంగాల్లో మనిషి ఎనిమిది గంటలు మాత్రమే పనిచేయగలుగుతాడని, అదనపు పనిగంటలు వేతనం లేకుండా చేయిస్తున్నారన్నారు. ఇది మానవహక్కుల ఉల్లంఘన కిందకు వస్తుందన్నారు. పాయల మురళీకృష్ణ, జమ్ము బంగారం నిర్వహించిన కవిగాయక సమ్మేళనంలో మానాపురం రాజా చంద్రశేఖర్, బాలకృష్ణ, చంద్రమౌళి, జయపాలరావు, రెడ్డి శంకరరావు, తదితరులు కవితాగానంతో అలరించారు. డప్పు శ్రీను, చీకటి చంద్రికారాణి, రాములు గానంతో సభికులను ఆకట్టుకున్నారు.


