● రసాయనాలతో మగ్గిస్తున్న పండ్లు
● విచ్చలవిడిగా విక్రయాలు
● నిరుపయోగంగా మ్యాంగో రైపినింగ్ సెంటర్
రాజాం: పట్టణంలో మామిడిపండ్ల వ్యాపారం జోరుగా సాగుతోంది. ప్రమాదకర కార్బన్ రసాయనాలు వినియోగించి మామిడిపండ్లను మగ్గపెడుతున్నారు. పక్వానికి రాకముందే మామిడికాయలు కొనుగోలుచేసి, వాటిని నిబంధనలు అతిక్రమించి మగ్గబెట్టడంతో మామిడికాయలు రంగుమారి పక్వానికి వస్తున్నాయి. వాటిని రాజాంలో తోపుడు బండ్లపై కిలో రూ. 50 నుంచి రూ. 80లు చొప్పున విక్రయిస్తున్నారు. వాటిని కొనుగోలుచేసి తింటున్న ప్రజలు వ్యాధులుబారిన పడుతున్నారు.
రైపినింగ్ సదుపాయం ఉన్నా..
రాజాం వ్యవసాయ మార్కెట్ యార్డులో మామిడి రైతులకోసం ఏర్పాటుచేసిన మ్యాంగో రైపినింగ్ సెంటర్ నిరుపయోగంగా మారింది. రసాయనాలతో మామిడిపండ్లను మగ్గపెట్టకుండా, రైపినింగ్ సెంటర్ ద్వారా మామిడిపండ్లు మగ్గపెట్టి, రైతులు మార్కెట్‌లో విక్రయించుకునేందుకు వీలుగా 2013లో ఇక్కడ మిషన్‌తో పాటు కేంద్రాన్ని ఏర్పాటుచేశారు. ఈ కేంద్రంపై రైతులకు అవగాహన కల్పించడంలో మార్కెట్ యార్డు అధికారులు విఫలంకావడంతో ఈ కేంద్రం నిరుపయోగంగా దర్శనమిస్తోంది. ఈ కేంద్రంలో మామిడిని మగ్గబెడితే అద్దె చెల్లించడంతో పాటు మూడురోజుల కనీస వ్యవధి పడుతోంది. ఈ కాలయాపన, అద్దెలతో పనిలేకుండా ఒక్కరోజులో మగ్గే విధంగా కొంతమంది వ్యాపారులు రాజాంలో మామిడిపండ్ల వ్యాపారాలు చేస్తున్నారు. దీనిపై అధికారులు దృష్టిసారించి, రసాయనాల వినియోగాన్ని నియంత్రించాల్సి ఉంది.


