ప్లైవుడ్‌, ఆక్వా కంపెనీల్లో ’టాస్క్‌ ఫోర్స్‌’ తనిఖీలు | - | Sakshi
Sakshi News home page

ప్లైవుడ్‌, ఆక్వా కంపెనీల్లో ’టాస్క్‌ ఫోర్స్‌’ తనిఖీలు

May 7 2026 10:02 AM | Updated on May 7 2026 10:02 AM

సబ్సిడీ యూరియా పక్కదారి పడితే చర్యలు

జిల్లా యంత్రాంగం హెచ్చరిక

పూసపాటిరేగ: సబ్సిడీ యూరియా పారిశ్రామిక అవసరాలకు అక్రమంగా మళ్లింపు అవుతుందన్న అనుమానంతో రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు, పూసపాటిరేగ, భోగాపురం మండలాల్లోని పలు పరిశ్రమల్లో టాస్క్‌ఫోర్స్‌ బృందం బుధవారం విస్తృత తనిఖీలు చేపట్టింది. జిల్లా వ్యవసాయ అధికారి వి.టి. రామారావు నేతృత్వంలోని ఈ బృందం వివిధ ప్లాంట్లలో రికార్డులను క్షుణ్ణంగా పరిశీలించింది. తనిఖీల్లో భాగంగా సవరవిల్లిలోని కృష్ణ ప్లైవుడ్‌, కొవ్వాడ అగ్రహారంలోని సిఫా ప్లైవుడ్‌, గైతుల చోడవరంలోని ిసీపీఎఫ్‌ ఆక్వా కంపెనీలను అధికారులు సందర్శించారు. సీపీఎఫ్‌ ఆక్వా కంపెనీలో రొయ్యల మేత తయారీలో యూరియా వినియోగం అవసరం లేదని ప్రాథమికంగా నిర్ధారించారు. ప్లాంట్‌లోని ముడి పదార్థాలు, ఫార్ములా రికార్డులను అధికారులు తనిఖీ చేశారు.

సిఫా ప్లైవుడ్‌ కర్మాగారంలో ప్లైవుడ్‌ తయారీకి అవసరమైన ’మెలనిన్‌ రీజనింగ్‌’ కోసం టెక్నికల్‌ గ్రేడ్‌ యూరియా వాడుతున్నట్లు గుర్తించారు. గత ఏడాది ఆ కంపెనీ ఉత్పత్తి రికార్డులు, దానికి సరిపడా కొనుగోలు చేసిన టెక్నికల్‌ గ్రేడ్‌ యూరియా ఇన్వాయిస్‌లను అధికారులు సరిపోల్చారు. ప్రస్తుతం ఉన్న స్టాక్‌ రిపోర్టులను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ ఆకస్మిక తనిఖీల్లో జిల్లా వ్యవసాయ అధికారి వి.టి. రామారావుతో పాటు, డిప్యూటీ కలెక్టర్‌ (విజిలెన్స్‌–సివిల్‌ సప్లైస్‌) ఎం. అరుణ కుమారి, విజయనగరం డీఎస్పీ ఎం.వీర కుమార్‌, అసిస్టెంట్‌ కమిషనర్‌ ఆఫ్‌ లేబర్‌ జి.ఎల్లాజీ, ఇండస్ట్రీస్‌ జనరల్‌ మేనేజర్‌ ఎం.వి. కరుణాకర్‌ పాల్గొన్నారు. అలాగే విజయనగరం సబ్‌ డివిజన్‌ ఇన్‌చార్జి ఏడీఏ సంగీత, పూసపాటిరేగ మండలం ఇన్‌చార్జి వ్యవసాయ అధికారి ఎ.శ్రీనివాస్‌, వ్యవసాయ విస్తరణాధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement