చిన్నపత్రిక ఎడిటర్‌పై దాడి | - | Sakshi
Sakshi News home page

చిన్నపత్రిక ఎడిటర్‌పై దాడి

May 7 2026 10:02 AM | Updated on May 7 2026 10:02 AM

తెగబడిన జనసేన నాయకులు

దెబ్బలు తిన్న ఎడిటర్‌పైనే కేసు నమోదు

సాక్షి ప్రతినిధి, విజయనగరం: నిష్పక్షపాతంగా వార్తలు రాసినందుకు గాను చిన్నపత్రిక ఎడిటర్‌ కాళ్ల శ్రీనివాసరావుపై జనసేన నాయకులు దాడికి తెగబడ్డారు. నెల్లిమర్ల నియోజకవర్గంలో అధికారపార్టీ అగడాలపై కేవలం వార్తలు రాశారనే అక్కసుతోనే ఎడిటర్‌పై దాడికి పాల్పడ్డారు. ప్రజాస్వామ్యంలో మీడియా గొంతు నొక్కాలని చూడడం హేయమని పలువురు సామాజిక వేత్తలు మండిపడుతున్నారు. జరజాపుపేట గ్రామంలో తన ఇంటికి వెళ్తున్న ఎడిటర్‌ శ్రీనివాసరావుపై ఉద్దేశపూర్వకంగా దాడి చేయడంతో జర్నలిజానికి చీకటి రోజులు వచ్చినట్లు పలువురు అభివర్ణించారు. శ్రీనివాసరావుపై దాడి చేయడం ప్రజాస్వామ్యంలో ఫోర్త్‌ఎస్టేట్‌పై దాడి చేయడమేనన్నారు. నెల్లిమర్ల నియోజకవర్గం కీలకనేత తప్పిదాలపై పత్రికలో వరుస కథనాలు రాయడంతోనే జనసేన నాయకులు దాడికి తెగబడినట్లు పలువురు తెలియజేశారు. ఎడిటర్‌పై దాడికి పాల్పడిన అధికార పార్టీ నాయకులపై కేసులు నమోదు చేయాలని పలువురు మీడియా ప్రతినిధులు డిమాండ్‌ చేస్తున్నారు.

తక్షణమే అరెస్టు చేయాలి

జర్నలిస్టు శ్రీనివాసరావుపై దాడికి తెగబడిన అధికారపార్టీ నేతలపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలి. శ్రీనివాసరావుపై దాడి జరగడం ముమ్మాటికీ పత్రికలపై దాడి జరిగినట్లే అని నిందితులను తక్షణమే అరెస్ట్‌ చేయాలంటూ నెల్లిమర్ల తహసీల్దార్‌ శ్రీకాంత్‌కు, నెల్లిమర్ల పోలీస్‌స్టేషన్‌లోను జర్నలిస్టు యూనియన్‌ ప్రతిధులు ఫిర్యాదు చేశారు. కార్యక్రమంలో జర్నలిస్టు యూనియన్‌ ప్రతినిధులు ఆరిపాక శ్రీనివాసరావు, పతివాడ రమణ, మద్దిల శ్రీనివాస రావు, పి.సురేష్‌, శనపతి శ్రీనువాసరావు తదితరులు ఉన్నారు.

దాడి దుర్మార్గం..

జర్నలిస్టు శ్రీనివాసరావుపై జనసేన నాయకులు దాడిచేయడం దుర్మార్గమని వైఎస్సార్‌సీపీ నగర పంచాయతీ అధ్యక్షుడు చిక్కాల సాంబశివరావు అన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement