పార్వతీపురం: జిల్లాలో మే 21నుంచి ప్రారంభం కానున్న ఇంటర్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలను ప్రశాంతంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి అయ్యాయని జిల్లా రెవెన్యూ అధికారి కె.హేమలత అన్నారు. ఈ మేరకు బుధవారం కలెక్టరేట్‌లోని సమావేశమందిరంలో ఆమె అధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో మాట్లాడుతూ జిల్లాలో మొత్తం 16 పరీక్షా కేంద్రాల్లో పోలీస్ బందోబస్తు, 144 సెక్షన్ అమలు చేయనున్నట్లు తెలిపారు. పరీక్షా కేంద్రాల సమీపంలోని జిరాక్స్ సెంటర్లు తప్పనిసరిగా మూసివేయాలని ఆదేశించారు. ప్రశ్నపత్రాలను 13 పోలీస్ స్టేషన్‌లలో భద్రపరిచి, సమాధాన పత్రాలను స్పీడ్ పోస్ట్‌ద్వారా తరలించాలన్నారు. విద్యార్థుల రాకపోకలకు ప్రత్యేక ఆర్టీసీ బస్సులను నడపాలని అధికారులను ఆదేశించారు. ప్రతి కేంద్రంలో సీసీ కెమెరాలు, తాగునీరు, ఓఆర్‌ఎస్ ప్యాకెట్లు, విద్యుత్ సరఫరా, ఆరోగ్య సిబ్బంది అందుబాటులో ఉండాలని పేర్కొన్నారు. జిల్లాలో 4,731 మంది విద్యార్ధులు ఈ పరీక్షలకు హాజరుకానున్నారని, పరీక్షలు జూన్ 4వరకు జరుగుతాయని తెలిపారు. సమీక్షలో డీఐఈఓ నాగేశ్వరరావు, డీఈఓ పి.బ్రహ్మజీరావు, డీపీఓ ఎస్.రవీంద్ర తదితరులు ఉన్నారు.


