నేటి నుంచే పది పరీక్షల సమరం | - | Sakshi
Sakshi News home page

నేటి నుంచే పది పరీక్షల సమరం

Mar 16 2026 7:40 AM | Updated on Mar 16 2026 7:40 AM

న్యూస్‌రీల్‌

సోమవారం శ్రీ 16 శ్రీ మార్చి శ్రీ 2026
పది పరీక్షలకు పోలీస్‌ పహారా

పార్వతీపురం/పార్వతీపురం రూరల్‌ : వరుస విజయాల వెలుగులో, హ్యాట్రిక్‌ ఘనతను సొంతం చేసుకున్న పార్వతీపురం మన్యం జిల్లా మరో కీలక విద్యా పరీక్షకు సిద్ధమైంది. జిల్లా వ్యాప్తంగా మార్చి 16 నుంచి ఏప్రిల్‌ 1 వరకు జరగనున్న పదవ తరగతి పబ్లిక్‌ పరీక్షల నిర్వహణకు అధికార యంత్రాంగం సర్వం సిద్ధం చేసింది. ఈ పరీక్షలను అత్యంత ప్రశాంత వాతావరణంలో, ఎటువంటి చిన్న పొరపాటుకు తావులేకుండా నిర్వహించాలని కలెక్టర్‌ డా. ఎన్‌.ప్రభాకర రెడ్డి అధికారులను ఆదేశించారు. ఆదివారం ఆయన వివిధ శాఖల సమన్వయ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సమీక్ష నిర్వహించి, పరీక్షల నిర్వహణపై దిశా నిర్దేశం చేశారు.

నిబంధనలు కఠినం.. నిఘా నిరంతరం

ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.45 గంటల వరకు పరీక్షలు జరగనున్నాయి. అయితే, విద్యార్థులు ఉదయం 9 గంటలకే పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలని కలెక్టర్‌ స్పష్టం చేశారు. కేంద్రాల్లోకి సెల్‌ఫోన్లు, ఎలక్ట్రానిక్‌ వస్తువుల ప్రవేశంపై కఠిన నిషేధం విధించారు. పరీక్ష సమయాల్లో కేంద్రాల పరిసరాల్లో 144 సెక్షన్‌ అమలులో ఉంటుందని, సమీపంలోని జిరాక్స్‌ కేంద్రాలను తప్పనిసరిగా మూసివేయాలని ఆదేశించారు. ప్రశ్నపత్రాల భద్రత విషయంలో రాజీ పడకూడదని, స్ట్రాంగ్‌ రూముల నుంచి కేంద్రాల వరకు పోలీసు బందోబస్తు మధ్య పంపిణీ జరగాలని సూచించారు.

విద్యార్థుల సౌకర్యార్థం ప్రత్యేక చర్యలు

మండు వేసవిని దృష్టిలో ఉంచుకుని విద్యార్థుల ఆరోగ్యానికి పెద్దపీట వేశారు. ప్రతి పరీక్ష కేంద్రం వద్ద తాగునీరు, ఫ్యాన్లు, వెలుతురు వంటి కనీస వసతులతో పాటు ఓఆర్‌ఎస్‌ ప్యాకెట్లు, ప్రాథమిక చికిత్స పరికరాలను అందుబాటులో ఉంచాలని కలెక్టర్‌ ఆదేశించారు. విద్యార్థులు సకాలంలో కేంద్రాలకు చేరుకునేలా ఆర్టీసీ ప్రత్యేక బస్సులను నడపనుంది. ఈ బస్సులలో సైతం విద్యార్థుల కోసం ఓఆర్‌ఎస్‌ ప్యాకెట్లను ఉంచనున్నారు. పరీక్ష కేంద్రాల వద్ద ఏఎన్‌ఎంలు, ఆశా కార్యకర్తలు నిరంతరం అందుబాటులో ఉంటారు. పరీక్షలు ముగిసిన వెంటనే సమాధాన పత్రాలను సురక్షితంగా పోస్ట్‌ ఆఫీసులకు చేరవేయాలని కలెక్టర్‌ సూచించారు.

మరోసారి అగ్రస్థానమే లక్ష్యం

జిల్లా ఏర్పడిన నాటి నుంచి విద్యా రంగంలో పార్వతీపురం మన్యం జిల్లా తనదైన ముద్ర వేస్తోంది. 2023లో 87.47 శాతం, 2024లో 96.37 శాతం, గత ఏడాది 2025లో 93.90 శాతం ఉత్తీర్ణతతో వరుసగా మూడుసార్లు రాష్ట్రంలోనే ప్రథమ స్థానాన్ని కై వసం చేసుకుని హ్యాట్రిక్‌ సాధించింది. గిరిజన ప్రాంతాలు అధికంగా ఉన్నప్పటికీ, ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు ప్రైవేటుకు ధీటుగా రాణిస్తుండటం గమనార్హం. ఈ ఏడాది కూడా అదే విజయపరంపరను కొనసాగించి, రాష్ట్ర స్థాయిలో జిల్లా కీర్తి పతాకాన్ని ఎగురవేయాలన్న సంకల్పంతో అటు ఉపాధ్యాయులు, ఇటు విద్యార్థులు కఠినంగా శ్రమించారు. సమీక్ష సమావేశంలో ఎస్పీ ఎస్‌.వి.మాధవ్‌ రెడ్డి, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

ప్రాధమిక అక్షరాస్యత పరీక్ష సక్సెస్‌

వయోజన విద్యాశాఖ ఆధ్వర్యంలో ఆదివారం జిల్లా వ్యాప్తంగా ప్రాధమిక అక్షరాస్యత పరీక్ష(ఎఫ్‌ఎల్‌ఎన్‌ఏటీ) విజయవంతమైందని కలెక్టర్‌ డా. ఎన్‌.ప్రభాకరరెడ్డి తెలిపారు. జిల్లాలో 1415 కేంద్రాల్లో 67,686మంది అభ్యాసకులు పరీక్షలు రాయాల్సి ఉండగా 66,467మంది పరీక్షలకు హాజరయ్యారని తెలిపారు.

ఎస్పీ ఎస్వీ మాధవ్‌ రెడ్డి

222 కేంద్రాల వద్ద 144 సెక్షన్‌ అమలు

నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు : ఎస్పీ

హ్యాట్రిక్‌ ఉత్సాహంతో సిద్ధమైన మన్యం జిల్లా

పొరపాటుకు తావు లేకుండా పకడ్బందీ ఏర్పాట్లు

పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్‌ అమలు

పార్వతీపురం రూరల్‌: జిల్లాలో సోమవారం నుంచి ప్రారంభం కానున్న పదో తరగతి పరీక్షల కోసం పోలీస్‌ శాఖ పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసింది. జిల్లా వ్యాప్తంగా ఉన్న 222 పరీక్ష కేంద్రాల వద్ద ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా నిరంతర నిఘా ఉంచనున్నట్టు ఎస్పీ ఎస్‌.వి.మాధవ్‌ రెడ్డి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. పరీక్షలు ముగిసే వరకు కేంద్రాల సమీపంలో 144 సెక్షన్‌ అమలులో ఉంటుందని, డ్రోన్‌ కెమెరాలు, మొబైల్‌ పెట్రోలింగ్‌ బృందాలతో నిరంతరం పర్యవేక్షిస్తామని పేర్కొన్నారు. పరీక్ష కేంద్రాల్లోకి మొబైల్‌ ఫోన్లు, స్మార్ట్‌ వాచ్‌లు వంటి ఎలక్ట్రానిక్‌ పరికరాలను అనుమతించబోమని, ప్రతి ఒక్కరినీ క్షుణ్ణంగా తనిఖీ చేసిన తర్వాతే లోపలికి పంపిస్తామని స్పష్టం చేశారు. పరీక్షలు జరిగే సమయంలో పరిసర ప్రాంతాల్లోని జిరాక్స్‌, ఇంటర్నెట్‌ సెంటర్లు మూసి వేయాలని ఆదేశించారు. ప్రశ్న పత్రాలు, సమాధాన పత్రాల తరలింపునకు పటిష్ట ఎస్కార్ట్‌ ఏర్పాటు చేశామని తెలిపారు. మాస్‌ కాపీయింగ్‌, మాల్‌ ప్రాక్టీస్‌ వంటి చర్యలకు పాల్పడినా.. సహకరించినా చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ హెచ్చరించారు. విద్యార్థులు ఒత్తిడికి లోనుకాకుండా ప్రశాంతంగా పరీక్షలు రాసి ఉజ్వల భవిష్యత్తును తీర్చిదిద్దుకోవాలని ఆయన ఆకాంక్షించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement