● గత వైఎస్సార్‌సీపీ పాలనపై గిరిజనుల ప్రశంసలు
● అవాకై ్కన పీసీసీ చీఫ్ షర్మిల
పార్వతీపురం రూరల్/కొమరాడ : ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల చేపట్టిన ‘ఉపాధి హామీ బచావో సంగ్రామ్’ యాత్రలో ఊహించని పరిణామం చోటుచేసుకుంది. కాంగ్రెస్ వేదికపై గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన అభివృద్ధి పనుల గురించి గిరిజన మహిళలు ఎలుగెత్తి చాటడంతో అక్కడ ఒక్కసారిగా నిశ్శబ్దం ఆవరించింది. తన పర్యటనలో భాగంగా ఆదివారం మధ్యాహ్నం కొమరాడ మండలం డంగభద్ర గ్రామంలో ఏర్పా టు చేసిన రచ్చబండ కార్యక్రమంలో షర్మిల ప్రజల సమస్యలను అడిగి తెలుసుకుంటుండగా, పార్వతీపురం మండలం కొత్త ఊరు గిరిజన గ్రామానికి చెందిన గిరిజన మహిళ హిమరిక నూకమ్మ గళమెత్తి వినిపించిన వాస్తవాలు అందరినీ ఆశ్చర్యానికి గురి చేశాయి.
గత జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వంలో...
నూకమ్మ మాట్లాడుతూ.. గత జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వంలో తమ గ్రామానికి మహర్దశ పట్టిందని కొనియాడారు. అప్పటి ఎమ్మెల్యే అలజంగి జోగారావు కృషితో తమ గ్రామానికి రోడ్లు, ఇంటింటికీ మంచినీటి కుళాయిలు అందాయని, ‘గడప గడపకు’ పాలనలో తమ సమస్యలు తక్షణమే పరిష్కారమయ్యేవని గుర్తు చేసుకున్నారు. అయితే, ప్రస్తుత చంద్రబాబు ప్రభుత్వంలో పరిస్థితి తలకిందులైందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. పండుగ కాలం నుంచి ఉపాధి హామీ కూలి డబ్బులు అందక, తాగడానికి గుక్కెడు మంచి నీరు లేక అవస్థలు పడుతున్నామని సభలో ఆవేదన వ్యక్తం చేశారు.
అధికారుల నిర్లక్ష్యంపై అసహనం
స్థానిక సచివాలయం నుంచి కలెక్టర్ కార్యాలయం వరకు, ఐటీడీఏ పీఓ కార్యాలయం గడప తొక్కినా తమ గోడు పట్టించుకునే నాథుడే కరువయ్యారని నూకమ్మ కుండబద్దలు కొట్టారు. ప్రజా క్షేత్రంలో విమర్శలే ఆయుధంగా యాత్ర చేస్తున్న షర్మిలకు, జగన్‌మోహన్‌రెడ్డి హయాంలో జరిగిన మేలును సాక్షాత్తూ ఒక గిరిజన మహిళ ప్రశంసించడం ఆమెకు విస్మయం కలిగించింది. గత ప్రభుత్వ అభివృద్ధి ఫలాలను ప్రజలు ఇంకా నెమరువేసుకుంటున్న తీరు చూసి షర్మిలారెడ్డి సైతం కొద్దిసేపు మౌనంగా ఉండిపోయారు.


