దుర్గాదేవి నిజరూప దర్శనానికి పోటెత్తిన భక్తులు | - | Sakshi
Sakshi News home page

దుర్గాదేవి నిజరూప దర్శనానికి పోటెత్తిన భక్తులు

Mar 16 2026 7:40 AM | Updated on Mar 16 2026 7:40 AM

ప్రశాంతంగా ముగిసిన ‘ఉల్లాస్‌’ పరీక్ష ప్రభుత్వ హైస్కూల్‌ను కాదని.. ప్రైవేటుకు.. ● పది పరీక్ష కేంద్రం కేటాయింపుపై విమర్శలు

వీరఘట్టం: స్థానిక శ్రీకోటదుర్గ తల్లి ఆలయ తృతీయ వార్షికోత్సవం ఆదివారం కనులపండువగా నిర్వహించారు. యజ్ఞకర్త ఎస్‌.వి.ఎల్‌.ఎన్‌ శర్మయాజీ ఆధ్వర్యంలో విఘ్నేశ్వర పూజ, పుణ్యాహవచనం, పరిషత్‌ కృఛ్చత్రయం, పంచగవ్వ ఆరాధన, అఖండ దీపారాధన, ఋత్విక్‌ వరుణ ప్రధానం, యాగశాల ప్రవేశ ద్వారపూజ, ధ్వజ పతాకావిష్కరణ, మండల మండపారాధనతో ప్రత్యేక పూజలు చేశారు. ఉదయం 7 గంటల నుంచి 11 గంటల వరకు అమ్మవారి నిజరూప దర్శనాన్ని భక్తులు తిలకించారు. నిజరూపంలో ఉన్న దుర్గాదేవికి భక్తులు మట్టి కుండలతో తెచ్చిన పాలతో అర్చకులు దుర్గాదేవిరి క్షీరాభిషేకాలు చేశారు. సాయంత్రం దుర్గాదేవి భక్తులకు ప్రత్యేక అలంకరణలో దర్శనమిచ్చారు. భక్తులు పెద్ద ఎత్తున దుర్గాదేవిని దర్శించుకుని పూజలు చేశారు.

విజయనగరం అర్బన్‌: వయోజన విద్యా శాఖ ఆధ్వర్యంలో అమలవుతున్న ఉల్లాస్‌ అక్షరాంధ్ర కార్యక్రమంలో భాగంగా జిల్లా వ్యాప్తంగా ఉల్లాస్‌ ఎఫ్‌ఎల్‌ఎన్‌ఏటీ పరీక్ష ఆదివారం నిర్వహించారు. జిల్లాలోని 27 మండలాలు, 4 మున్సిపాలిటీల పరిధిలో మొత్తం 1,11,369 మంది అభ్యాసకులు 1,356 పరీక్ష కేంద్రాలలో పరీక్ష రాశారని వయోజన విద్య నోడల్‌ అధికారి ఎ.వేణుగోపాలకృష్ణ తెలిపారు. ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగలేదని తెలిపారు. కలెక్టర్‌ ఎస్‌.రాంసుందర్‌రెడ్డి స్థానిక ధర్మపురిలోని ఎల్‌డీజీ జూనియర్‌ కళాశాలలోని పరీక్ష కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. పరీక్షల పర్యవేక్షణ కోసం కేంద్ర ప్రభుత్వం నియమించిన వయోజన విద్యా విభాగానికి చెందిన ప్రదీప్‌ బి.హెదాపూ జిల్లాలో పర్యటించారు. అదే విధంగా జిల్లా సమన్వయ కమిటీతో పాటు మండల స్థాయి లో ఎంపీడీఓలు, ఏపీఎంలు, సీడీపీఓలు, మున్సిపల్‌ స్థాయిలో సీఎంఎంలు, వయోజన విద్యా శాఖ పర్యవేక్షకులు పరీక్షల నిర్వహణను క్షేత్ర స్థాయిలో పర్యవేక్షించారు.

గజపతినగరం రూరల్‌: స్థానిక ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాలకు పదో తరగతి పరీక్ష కేంద్రం కేటాయించకపోవడం వెనుక దాగి ఉన్న వాస్తవాలేంటని స్థానికులు చర్చించుకుంటున్నారు. 1959లో ఏర్పాటైన ఈ పాఠశాలలో పదో తరగతి పరీక్ష కేంద్రం కేటాయించకపోవడం ఇదే తొలిసారి కావడం స్థానికులను, పూర్వ విద్యార్థులను విస్మయానికి గురి చేసింది. ప్రతీసారి ఏదో ఒక పరీక్షకు కేంద్రంగా నిలిచే ఈ ప్రభుత్వ ఉన్నత పాఠశాలకు ఈ ఏడాది పది పరీక్షలకు కేంద్రం కేటాయించకపోవడం వెనుక గల కారణమేంటని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. కేంద్రం కేటాయించలేదని ఆల స్యంగా తెలుసుకున్న స్థానికులు ఒకింత ఆశ్చర్యానికి గురయ్యారు. సోమవారం నుంచి జరగనున్న పదో తరగతి పరీక్షలకు మండలంలోని ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాల, శ్రీకృష్ణ విద్యాపీఠ్‌, ఆర్‌సీఎం హైస్కూల్‌, మోడల్‌ హైస్కూల్‌ కేంద్రాలను ఎంపిక చేశారు. వీటిలో రెండు ప్రైవేటు పాఠశాలలు ఉన్నాయి. వీటిలో ఆర్‌సీఎం హైస్కూల్‌ గజపతినగరానికి చాలా దూరంగా ఉండడంతో విద్యార్థులకు కొంత ఇబ్బందులు తప్పవు. నగరం నడిబొడ్డున ఉన్న ప్రభుత్వ బాలుర పాఠశాలను కాదని దూరంగా ఉన్న పాఠశాలను ఎంపిక చేయడాన్ని విద్యార్థుల తల్లిదండ్రులు తప్పుపడుతున్నారు. దశాబ్దాల తరబడి ఈ ప్రాంత టెన్త్‌ విద్యార్థులకు పరీక్ష కేంద్రంగా ఉండే ప్రభుత్వ ఉన్నత పాఠశాలకు ఈసారి ఎందుకు ఇలా జరిగిందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ విషయమై పాఠశాల ప్రధానోపాధ్యాయుడు వెంకటేశ్వరరావు వద్ద సాక్షి ఆదివారం ప్రస్తావించగా.. కేంద్రం ఎంపిక విషయం తన పరిధిలోనిది కాదని, కారణం తనకు తెలియదని చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement