కనుమరుగవుతున్న కూర్మసాగరం
పాలకొండ: రెండు వైపులా కొండలతో సువిశాలంగా 113 ఎకరాల విస్తీర్ణంలో వేసవిలో సైతం ఈ ప్రాంతంలో నిండు కుండలా కనిపించేది. పాలకొండ మండలం మొత్తంలో కరువు ప్రబలిన సమయంలో కూడా ఈ ఆయకట్టు పరిధిలో ప్రతి ఏటా వరి రెండు పంటలు పండించే పరిస్థితి ఉండేది.
అదే పాలకొండ రెవెన్యూ డివిజన్ పరిధిలోని అత్యంత పెద్దదైన కూర్మసాగరం. మండలంలోని ఎన్‌కేరాజపురం గ్రామ పరిధిలో ఉన్న కూర్మసాగరం మినీ బ్యారేజీని తలపిస్తుంది. అయితే ప్రస్తుతం కూర్మసాగరం పరిస్థితులు మారిపోతున్నాయి. ఒకరిని చూసి మరొకరు కొండల పక్కనుంచి ఆక్రమణలు మొదలుపెట్టారు. ఎగువ ప్రాంతంలో ఉన్న రైతులు ఆక్రమణలు చేపట్టడంతో ఆయకట్టు రైతులు ఆందోళన చెందుతున్నారు.
ఇది సాగరం చరిత్ర..
నగరపంచాయతీకి సమీపంలో ఈ కూర్మసాగరాన్ని బ్రిటిష్ కాలంలో 113 ఎకరాల్లో ఏర్పాటు చేశారు. నాగావళి ఎడమ కాలువ శివారున ఈ సాగరం ఉంది. కాలువ ద్వారా నీరు విడుల చేసి ఒకసారి సాగరం నిండితే ఏడాది పాటు పుష్కలంగా సాగునీరు ఆయకట్టుకు అందించేందుకు చర్యలు తీసుకున్నారు. ఈ సాగరం కింద 1000 ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందించేవారు. సమీపంలో ఉన్న కొండల నుంచి వర్షాకాలంలో వచ్చే నీరు కూడా ఈ సాగరంలో చేరుతుంది. అప్పటి నుంచి సాగరం పరిధిలోని ఆయకట్టు రైతులు ప్రతి ఏటా రెండుసార్లు వరిపంట పండించేవారు. తీవ్రమైన వర్షాభావ పరిస్థితుల్లో కూడా ఇక్కడ పచ్చదనంతో పంటలు కనిపించేవి.
ఆక్రమణలతో బక్కచిక్కి..
ప్రస్తుతం కూర్మసాగరం ఆక్రమణలతో బక్కచిక్కుతోంది. ఎగువ ప్రాంతంలో ఉన్న రైతులు సాగరాన్ని పంటపొలంగా మార్చుకుంటున్నారు. వేసవిలో నీరు తగ్గిన సమయంలో పొలంగా మార్చుకుని పంటలు సాగుచేస్తున్నారు. చెరువులో నీరు పుష్కలంగా ఉంటే ఆక్రమణ చేసిన పొలంలో నీరు ముంచేస్తుంది. దిగువ భాగంలో ఉన్న తూములను శిథిలం చేసి నీరు సాగరంలో ఉండకుండా ఉండకుండా ధ్వంసం చేస్తున్నారు.
సాగరంలో నీరు ఉంటే వేసవిలో కూడా పంటలు పండించుకునే వాళ్లం. ప్రస్తుతం ఎగువ ప్రాంతంలో ఆక్రమణలు చేయడంతో సాగరంలో నీరు ఉండడం లేదు. మార్చి నెల నాటికి నీరు అడుగంటుతోంది. రబీ పంటలకు సాగునీరు లేక పంటలు వేయడం మానేస్తున్నాం. ఆక్రమణలు తొలగించేందుకు అధికారులు చర్యలు తీసుకోవాలి.
కాయల వేణు,
ఆయకట్టు రైతు
సాగరానికి రెండు తూములు ఉన్నాయి. నీరు ఎక్కువ అయితే వెళ్లిపోవడానికి పొర్లు కట్ట ఉంది. కొన్నేళ్లుగా పొర్లు కట్ట మాట పక్కన పెడితే వేసవిలో ప్రారంభంలోనే నీరు ఉండడంలేదు. తూములు పూర్తిగా శిథిలం చేశారు. సాగునీరు ప్రస్తుతం వృథాగా పొతోంది. ఆయకట్టు రైతుల సమస్యను గుర్తించి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి.
కిమిడి రామూర్తినాయుడు, ఆయకట్టు రైతు,
రైతుసంఘం నాయకుడు
113 ఎకరాల సాగరంలో మిగిలింది కొంతే
ఆగని ఆక్రమణలు
పూర్తిగా శిథిలమైన తూములు
ఆయకట్టుకు నీరు అందక రైతుల ఆవేదన
కనుమరుగవుతున్న కూర్మసాగరం
కనుమరుగవుతున్న కూర్మసాగరం
కనుమరుగవుతున్న కూర్మసాగరం


