దస్తూరి..తిలకం చక్కటి కార్యక్రమం
● కలెక్టర్ కితాబు
● జిల్లా వ్యాప్తంగా అమలుకు ఆదేశాలు
పాలకొండ రూరల్: పదో తరగతి పబ్లిక్ పరీక్షల్లో ప్రశ్నలకు విద్యార్థులు సరైన సమాధానాలకు చక్కటి దస్తూరి తోడైతే మంచి మార్కులు సాధించొచ్చని పాలకొండ ఎంఈఓ కురిటి సోంబాబు సూచించారు. ఈ క్రమంలో మండల వ్యాప్తంగా అన్ని ఉన్నత పాఠశాల్లో దస్తూరీకి సంబంధించి ప్రత్యేక తర్ఫీదు అందిస్తున్నామని పేర్కొన్నారు. ఎం.సింగుపురం జెడ్పీ ఉన్నత పాఠశాలలో అమలవుతున్న ఈ కార్యక్రమంపై ఆదివారం సాక్షిలో ప్రచురితమైన ‘దస్తూరి..తిలకం’ కథనంపై కలెక్టర్ డాక్టర్ ఎన్.ప్రభాకరెడ్డి స్పందించారు. విద్యార్థులు చక్కటి మార్కులు సాధించేందుకు ఎంఈఓ నేతృత్వంలో అందిస్తున్న తర్ఫీదుపై కితాబు అందించడంతోపాటు సదరు పాఠశాల విద్యార్థులు, హెచ్‌ఎం సంఘం నాయుడును అభినందించారు. ఈ ప్రక్రియను జిల్లాలోని అన్ని పాఠశాల్లోనూ అమలుకు చర్యలు చేపట్టాలని డీఈఓ పి.బ్రహ్మాజీరావుకు సూచినట్లు ఎంఈఓ తెలిపారు. ఈ మేరకు నేడు ఎం.సింగుపురం పాఠశాలలో అమలవుత్ను దస్తూరీ తర్ఫీదుపై పూర్తి నివేదికను లఘుచిత్రం రూపంలో సిద్ధం చేయిస్తామన్నారు.


