కోటదుర్గ ఆలయంలో ప్రత్యేక పూజలు
వీరఘట్టం: మౌని అమావాస్య సందర్భంగా ఆదివారం స్థానిక కోటదుర్గ తల్లి ఆలయంలో యజ్ఞకర్త ఎస్‌వీఎల్‌ఎన్ శర్మయాజీ ఆధ్వర్యంలో భక్తులు ప్రత్యేక పూజలు చేశారు. అమ్మవారిని దర్శించుకున్న అనంతరం తీర్థప్రసాదాలు స్వీకరించి మొక్కులు తీర్చుకున్నారు.అంతకు ముందు కిమ్మి వద్ద నాగావళి నదిలో స్నానాలు ఆచరించి భక్తులు దైవదర్శనాలు చేసుకున్నారు.
నేటి నుంచి మండల స్థాయిలోనే ప్రత్యేక పీజీఆర్‌ఎస్
పార్వతీపురం: పీజీఆర్‌ఎస్‌కు వచ్చే వినతుల స్వీకరణను మరింత వేగవంతం చేసేందుకు ఇకపై మండల స్థాయిలోనే ప్రత్యేక పీజీఆర్‌ఎస్ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ డా.ఎన్.ప్రభాకర రెడ్డి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఇందులో భాగంగా ఈనెల 19 నుంచి 30 వరకు అన్ని మండల కేంద్రాలను స్వయంగా సందర్శించి ప్రజలనుంచి వినతులను స్వీకరించి, పరిష్కరించనున్నట్లు పేర్కొన్నారు. ఈ మేరకు ఈనెల 19న పార్వతీపురం మున్సిపల్ కార్యాలయంలో వినతులను స్వీకరించనున్నట్లు చెప్పారు. ఈనెల 20న పాలకొండ, 21న ఉదయం మక్కువ, మధ్యాహ్నం పాచిపెంట మండలాల్లో, 22న ఉదయం జీఎల్ పురం, మధ్యాహ్నం కురుపాంలో, 23న ఉదయం భామిని, మధ్యాహ్నం సీతంపేట మండలంలో, 24న ఉదయం సాలూరు, మధ్యాహ్నం బలిజిపేట, 28న ఉదయం కొమరాడ, మధ్యాహ్నం గరుగుబిల్లిలో, 29న ఉదయం జియ్యమ్మవలస, మధ్యాహ్నం వీరఘట్టం, ఈనెల 30న సీతానగరంలో ప్రత్యేక పీజీఆర్‌ఎస్ నిర్వహించనున్నామని ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
పోలమాంబ దర్శనానికి బారులు తీరిన భక్తులు
మక్కువ: ఉత్తరాంధ్రుల ఇలవేల్పు, శంబర పోలమాంబ అమ్మవారి దర్శనానికి ఆదివారం భక్తులు బారులు తీరారు. సంక్రాంతి పండుగకు సుదూర ప్రాంతాల నుంచి ఉమ్మడి విజయనగరం జిల్లాకు చేరుకున్న ప్రజలు, తిరిగి ఆయా పట్టణాలకు తిరుగు ప్రయాణం చేసేముందు అమ్మవారిని దర్శించుకోవడం ఆనవాయితీగా వస్తోంది. ఈ నేపథ్యంలో ఆదివారం తెల్లవారుజాము నుంచి భక్తులు శంబర గ్రామానికి చేరుకున్నారు. అధిక సంఖ్యలో అమ్మ దర్శనానికి భక్తులు చేరుకోవడంతో ఆలయంలోని క్యూ లన్నీ కిటకిటలాడాయి. గ్రామంలోని చదురుగుడిలో కొలువైన పోలమాంబ అమ్మవారిని భక్తులు దర్శించి అమ్మవారి ఘటాలకు పూజలు నిర్వహించి మొక్కుబడులు చెల్లించుకున్నారు. అనంతరం వనంగుడికి భక్తులు చేరుకుని పోలమాంబ అమ్మవారిని దర్శించుకుని వనంగుడి వెనుకున్న వేప చెట్టుకు మహిళలు ప్రత్యేక పూజలు చేశారు. గోముఖి నది తీరాన అమ్మవారికి కోళ్లు, చీరలు, మొక్కుబడి చెల్లించుకున్నారు. భక్తులకు ఇబ్బందులు కలగకుండా ఈవో బి. శ్రీనివాసరావు, ట్రస్టు బోర్డ్ సభ్యులు, ఏఎస్సై ఎం.శ్రీనివాసరావు ఆధ్వర్యంలో చర్యలు చేపట్టారు.
కోటదుర్గ ఆలయంలో ప్రత్యేక పూజలు
కోటదుర్గ ఆలయంలో ప్రత్యేక పూజలు


