హత్యా రాజకీయాలు
రెడ్ బుక్
అండతోనే
పార్వతీపురం రూరల్: ‘రాష్ట్రంలో చట్టం చుట్టంగా మారింది.. శాంతిభద్రతలు అధికార పార్టీ నేతల కనుసన్నల్లో బందీ అయ్యాయి... ‘రెడ్ బుక్’ రాజ్యాంగాన్ని అమలు చేస్తూ.. దళితులను, ప్రతిపక్ష నేతలను బలి తీసుకోవడమే కూటమి ప్రభుత్వ లక్ష్యంగా కనిపిస్తోంది..’ అని పార్వతీపురం మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్‌సీపీ నియోజకవర్గ సమన్వయకర్త అలజంగి జోగారావు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. పల్నాడు జిల్లా గురజాల నియోజకవర్గం పిన్నెల్లిలో వైఎస్సార్‌సీపీ దళిత కార్యకర్త మందా సాల్మన్ దారుణ హత్యకు నిరసనగా పార్వతీపురం ఇందిరా కాలనీలోని అంబేడ్కర్ విగ్రహం వద్ద పార్టీ ఎస్సీ సెల్ ఆధ్వర్యంలో శనివారం నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా జోగారావు మాట్లాడుతూ.. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక హత్యా రాజకీయాలు పేట్రేగిపోతున్నాయని మండిపడ్డారు. దళితుడు, వైఎస్సార్‌సీపీ కార్యకర్త అయిన సాల్మన్‌ను టీడీపీ గూండాలు కిరాతకంగా అంతమొందించడం రాక్షస క్రీడకు నిదర్శనమన్నారు. హత్య జరిగి 24 గంటలు దాటుతున్నా నిందితులను అరెస్టు చేయకపోవడం పోలీసుల పనితీరుపై అనుమానాలకు తావిస్తోందన్నారు. రక్షణ కల్పించాల్సిన పోలీసులే అధికార పార్టీకి తొత్తులుగా మారి, బాధితులపైనే తిరిగి సెక్షన్‌న్ 305 కింద తప్పుడు కేసులు బనాయించడం హేయమైన చర్య అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
భవిష్యత్తులో మూల్యం చెల్లించుకోక తప్పదు
అధికారం శాశ్వతం కాదని, నేడు సాగిస్తున్న అరాచకాలకు భవిష్యత్తులో రెట్టింపు మూల్యం చెల్లించుకోక తప్పదని జోగారావు ప్రభుత్వాన్ని హెచ్చరించారు. కక్ష సాధింపు చర్యలు మానుకోకపోతే ప్రజాక్షేత్రంలోనే తగిన బుద్ధి చెబుతామన్నారు. మృతుడు సాల్మన్ కుటుంబానికి వైఎస్సార్‌సీపీ అండగా ఉంటుందని, అధినేత జగన్‌న్‌మోహన్‌న్‌రెడ్డి ఆదేశాల మేరకు న్యాయ పోరాటం చేస్తామని భరోసా ఇచ్చారు. బాధిత కుటుంబానికి ప్రభుత్వం తక్షణమే రూ.కోటి పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో జిల్లా పార్టీ ఎస్సీ సెల్ అధ్యక్షుడు సరవిశెట్టి శ్రీనివాసరావు, జిల్లా పార్టీ ప్రధాన కార్యదర్శి పోల సత్యనారాయణ, జడ్పీటీసీ మామిడి బాబ్జీ, రాష్ట్ర అనుబంధ విభాగాల ప్రతినిధులు కాగాన ప్రకాష్, దేవుపల్లి నాగరాజు, భూతల వెంకటరమణ, బీసీ సెల్ అధ్యక్షులు గొర్లి మాధవరావు, కౌన్సిలర్ సభ్యులు వండాన నేతాజీ, ప్రజాప్రతినిదులు, వివిధ అనుబంధ విభాగాల అధ్యక్షులు, సీనియర్ నాయకులు సిద్దా జగన్నాధం, చెరుకుబిల్లి గంగరాజు, ఎస్‌విఎస్‌ఎన్.రెడ్డి, ఎస్.సందీప్, అలజంగి జితేంద్ర, శనపతి చంద్రశేఖరరావు, పెద్ద పౌల్, బత్తుల శ్రీనివాసరావు, ఎస్.అనిల్, పీరయ్య, కోల చిరంజీవి, హరియాల ఆనంద్, గోపి, నాయకులు, కార్యకర్తలు తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
కూటమి పాలనలో దళితులపై దాడులు దారుణం
శాంతిభద్రతలు గాలికి..
సాల్మన్ కుటుంబానికి రూ.కోటి పరిహారం ఇవ్వాలి
మాజీ ఎమ్మెల్యే అలజంగి జోగారావు
జిల్లా కేంద్రంలో అంబేడ్కర్ సాక్షిగా వైఎస్సార్‌సీపీ ఆందోళన


