పండగ పూట.. రైతు కంట కన్నీరు..!
పార్వతీపురం రూరల్: ఏళ్లుగా ఆ ప్రాంతాన్ని పట్టి పీడిస్తున్న గజ గండం మళ్లీ దాపురించింది. సంక్రాంతి సిరులు ఇంటికి వస్తాయనుకుంటే.. ఆరుగాలం కష్టపడి పండించిన పంట సిరులను గజరాజులు నేలమట్టం చేశాయి. అందివచ్చిన పంట.. ఏనుగుల పాలవడంతో రైతులు ఆవేదన చెందుతున్నారు. గత సోమవారమే పార్వతీపురం మండలంలోకి చొరబడిన ఎనిమిది ఏనుగుల గుంపు, గురువారం వేకువజామున తమ ప్రతాపాన్ని చూపాయి. సంగంవలస, సీతంపేట సమీపంలోని చీకటి సత్యనారాయణ అనే రైతు తోటలో బీభత్సం సృష్టించాయి. చేతికి అందొచ్చిన రెండు ఎకరాల పామాయిల్, అరటి తోటలను తొక్కి ధ్వంసం చేశాయి. వీటితో పాటు మరో 20 కొబ్బరి మొక్కలను పీకి పారేశాయి. కంటికి రెప్పలా కాపాడుకున్న పంట.. కళ్ల ముందే నేల రాలడంతో సదరు రైతు లబోదిబోమంటున్నాడు.
మెట్టపైనే మకాం.. జరభద్రం!
శుక్రవారం నాటికి సీతంపేట గ్రామం సమీపంలోని మెట్టపైనే ఏనుగుల గుంపు తిష్ట వేసినట్టు అటవీ శాఖ అధికారులు గుర్తించారు. ప్రస్తుతం సంక్రాంతి పండగ వాతావరణం నెలకొనడంతో, గ్రామీణులెవరూ అత్యుత్సాహంతో ఏనుగుల సమీపానికి వెళ్లొద్దని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. ముఖ్యంగా సెల్ఫీల మోజులోగానీ, ఏనుగులను చూడాలనే కుతూహలంతోగానీ ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దని సూచించారు. రైతులు కూడా అప్రమత్తంగా ఉండాలని, తగిన జాగ్రత్తలు పాటించాలని విజ్ఞప్తి చేశారు. ఏనుగుల గుంపు ఆ ప్రాంతాన్ని వీడి వెళ్లిన వెంటనే పంట నష్టాన్ని అంచనా వేస్తామని అటవీ శాఖ అధికారులు తెలిపారు. అప్పటి వరకు రైతులు సంయమనం పాటించాలని కోరారు.
మండలంలో గజరాజుల బీభత్సం
రెండు ఎకరాల్లో పామాయిల్, అరటి తోటలు ధ్వంసం
సీతంపేట మెట్టపైనే తిష్టవేసిన ఏనుగుల గుంపు
అత్యుత్సాహం వద్దంటూ అటవీశాఖ హెచ్చరిక
పండగ పూట.. రైతు కంట కన్నీరు..!


