కొండవెలగాడలో ముగిసిన కేపీఎల్ టోర్నీ
నెల్లిమర్ల రూరల్: మండలంలోని కొండవెలగాడ గ్రామంలో గడిచిన మూడు రోజులగా ఉత్సాహంగా కొనసాగిన కేపీఎల్ క్రికెట్ టోర్నీ గురువారం ఘనంగా ముగిసింది. సంక్రాంతి సందర్భంగా ఐపీఎల్ తరహాలో నిర్వహించిన ఈ పోటీలు ఉత్కంఠ భరితంగా కొనసాగాయి. మొత్తం ఎనిమిది జట్లు ఈ పోటీల్లో పాల్గొనగా ఫైనల్స్‌లో రాజురాక్స్ జట్టు విజేతగా నిలిచి రూ.40వేలు ప్రైజ్ మనీతో పాటు ట్రోఫీని కై వసం చేసుకుంది. రెడ్డి రాయల్స్ జట్టు రన్నరప్‌గా నిలిచి రూ.25వేల ప్రైజ్ మనీ, ట్రోఫీని అందుకుంది. బ్రదర్స్ యునైటెడ్ జట్టుకు చెందిన అట్టాడ అనిల్ బెస్ట్ బౌలర్‌గా, భేరి సంతోష్ ఉత్తమ బ్యాట్స్‌మన్‌గా ఎంపికై ప్రత్యేక బహుమతులను సొంతం చేసుకున్నారు. జెడ్‌పీటీసీ సభ్యుడు గదల సన్యాసినాయుడు, విశిష్ట అతిథులు చెరుకూరి సాంబ, పెనుమత్స సంతోష్ బాబు ఆయా జట్లకు ట్రోఫీలను అందజేశారు. ఇటువంటి పోటీల నిర్వహణ యువతలో ఐక్యత, పోటీతత్వాన్ని పెంపొందిస్తాయని వారు తెలిపారు. కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ నాయకులు కర్రోతు వెంకటరమణ, వాళ్లె అప్పలనాయుడు, అక్కోజీ, యువత పాల్గొన్నారు.
విజేతగా నిలిచిన రాజురాక్స్ జట్టు


