బదిలీలపై ఎస్పీకి సిబ్బంది మొర
విజయనగరం క్రైమ్: తాము పని చేస్తున్న దగ్గర ఎదరవుతున్న ఇబ్బందులను, అలాగే బదిలీల గురించి ఎస్పీకి హెచ్‌సీలు, కానిస్టేబుల్స్ మొర పెట్టుకున్నారు. ఈ మేరకు జిల్లా పోలీస్ కార్యాలయంలోని తన చాంబర్‌లో ఎస్పీ వకుల్ జిందల్ శుక్రవారం పోలీస్ వెల్ఫేర్ డే నిర్వహించారు. ఈ సందర్భంగా వృత్తిపరమైన, శాఖాపరమైన అంశాలను సిబ్బంది నుంచి తెలుసుకున్నారు. కార్యక్రమంలో శాఖ పరంగా దాదాపు ఎనిమిది మంది సిబ్బంది తమకు బదిలీలు చేయాలని విన్నవించుకున్నారు. భార్యాపిల్లలు వేరే చోట తాము వేరే చోట పని చేస్తున్నామని, కుటుంబానికి దగ్గరగా ఉండేలా బదిలీ కావాలని కోరారు. సిబ్బంది చెప్పిన విషయాలను ఎస్పీ స్వయంగా విని పుస్తకంలో రాసుకున్నారు. వెంటనే మినిస్టీరియల్ సూపరెంటెండెంట్‌ను పిలిచి సిబ్బంది అడిగిన అంశాలలో సాధ్యా సాధ్యాల గురించి తెలుసుకున్నారు. వీలైనంత త్వరలో శాఖ పరంగా పరిశీలించి అవసరమైన తగు చర్యలు చేపడతానని సిబ్బందికి ఎస్పీ వకుల్ జిందల్ సిబ్బందికి హామీ ఇచ్చారు.


