శృంగవరపుకోట: గిరిజనుల కళ్లకు గంతలు కట్టకుండా ప్రభుత్వం నిజాలు చెప్పాలని ఏపీ గిరిజన
సంఘం సభ్యులు విజ్ఞప్తిచేశారు. గిరిజన బాలికల కోసం ఎస్.కోట పట్టణంలో బాలికల ఆశ్రమ పాఠశాల ఏర్పాటు చేయాలని వేడుకున్నారు. ఎస్.కోట మండలంలోని ధారపర్తి పంచాయతీ పరిధిలోని చిలకపాడు గ్రామంలో పలువురు గిరిజన విద్యార్థులు, చిన్నారులు, వారి తల్లిదండ్రులతో కలిసి సంఘ నాయకులు జె.గౌరీష్, జె.భీమయ్య, మంగళయ్యలు మంగళవారం వినూత్న రీతిలో నిరసన తెలిపారు. చిన్నా పెద్ద అంతా మోకాళ్లపై నిల్చొని కలెక్టర్, ప్రభుత్వ పెద్దలకు నమస్కారాలు చేస్తూ తమ గోడు వినిపించారు. జిల్లా కేంద్రమైన విజయనగరంలో 160 మందికి సరిపడే భవనంలో 260 మందికి అడ్మిషన్లు ఇచ్చారని, ఆపై చేరిన బాలికలను పార్వతీపురం, సాలూరులోని ఆశ్రమ పాఠశాలలకు పంపుతున్నారన్నారు. తమ పిల్లలు చదవాలని కొండలు, కోనలు దించి ఆడపిల్లలను పంపుతున్నారని, వారికి రోగమొచ్చినా, కష్టమొచ్చినా 50 నుంచి 70 కి.మీ మేర గిరిజన తల్లిదండ్రులు ప్రయాణాలు చేయాల్సి వస్తోందని చెప్పారు. మన్యానికి ముఖ ద్వారంగా ఉన్న ఎస్.కోటలో గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాల ఏర్పాటుచేసి బాలికా విద్యను ప్రోత్సహించాలని కోరారు. బాలికల చదువు సమస్యలను నిజాయితీగా అధ్యయనం చేయాలని డిమాండ్ చేశారు.
నిజాలు చెప్పాలని గిరిజన సంఘం వినతి
మోకాళ్లపై వేడుకోలు..
‘కోట’ బాలికల ఆశ్రమ పాఠశాల కోసం ఆందోళన


