సాక్షి, పార్వతీపురం మన్యం: ఒక రోజు కాదు.. రెండు రోజులు కాదు.. మూడు వారాలుగా అక్కడ ‘నో గ్యాస్’! గ్యాస్ బండ లేకపోతే.. పొయ్యి వెలగని ఈ రోజుల్లో అన్ని వారాలు సిలిండర్ ఇచ్చే ఏజెన్సీ లేకపోవడంతో స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎప్పుడు చూసినా సంబంధిత ఏజెన్సీ కార్యాలయం మూతపడే ఉంటోంది. ఫోన్లు చేసినా తీసేవారు కరువు. దీంతో ఎవరికి చెప్పుకోవాలో తెలియక.. సదరు లబ్ధిదారులు బుధవారం ఏజెన్సీ కార్యాలయంతో పాటు.. పార్వతీపురం తహసీల్దార్ కార్యాలయం వద్ద ఖాళీ గ్యాస్ సిలిండర్లతో నిరసన వ్యక్తం చేశారు. అంతటికీ కారణం అధికార పార్టీ రాజకీయాల కింద సంబంధిత గ్యాస్ ఏజెన్సీ నలిగిపోవడమే అన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.
పార్వతీపురం పట్టణం సారికవీధిలో ఉన్న భారత్‌గ్యాస్ కార్యాలయం మూడు వారాలుగా తెరచుకోవడం లేదు. గ్యాస్ కోసం సదరు ఏజెన్సీ ఖాతాదారులు ఎన్నిసార్లు ప్రయత్నించినా ఫలితం ఉండటం లేదు. చాలా రోజులుగా ఇంట్లో గ్యాస్ నిండుకోవడంతో కొంతమంది తెలిసిన వారి దగ్గర తెచ్చుకుని వాడుకున్నారు. ఇరుగుపొరుగు వారిని బతిమలాడుకుని, కొద్దిరోజులు వాళ్ల దగ్గరే వండుకున్నారు. ఆ ప్రయత్నాలు కూడా అయిపోవడంతో ఎక్కడికి వెళ్లాలో తెలియక, మరో దారి దొరక్క చివరికి.. బుధవారం సీఐటీయూ, పట్టణ పౌర సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఏజెన్సీ కార్యాలయం వద్ద ఖాళీ సిలిండర్లతో నిరసనకు దిగారు. పార్వతీపురం పట్టణం, చుట్టుపక్కల గ్రామాలకు చెందిన సుమారు 800 మంది వరకు ఖాతాదారులు మూడు వారాలుగా గ్యాస్‌లేక ఇబ్బందులు పడుతున్నారని సీఐటీయూ జిల్లా కోశాధికారి గొర్లి వెంకటరమణ, పట్టణ పౌర సంక్షేమ సంఘం కార్యదర్శి పాకల సన్యాసిరావు, అధ్యక్షుడు సంచాన ఉమ, నాయకులు బంకురు సూరిబాబు తదితరులు తెలిపారు. తహసీల్దార్ జయలక్ష్మితో పాటు, సీఎస్‌డీటీకి సమస్యను వివరించారు. రెండు రోజుల్లో సమస్య పరిష్కారం చేస్తామని వారు హామీ ఇచ్చారు. లబ్ధిదారులందరికీ రెండు రోజుల్లో గ్యాస్ రాకపోతే పెద్ద ఎత్తున ఉద్యమం చేపడతామని ప్రజా సంఘాల నాయకులు హెచ్చరించారు.
రాజకీయాలే కారణమా..
పట్టణంలోని 23వ వార్డుకు చెందిన ఓ టీడీపీ నాయకుని పేరిట ఏజెన్సీ ఉందని తెలుస్తోంది. ఏజెన్సీని స్వాధీనం చేసుకుని, తన కుటుంబ సభ్యుల పేరిట నడిపేందుకు ఓ ప్రజాప్రతినిధి తీవ్ర ప్రయత్నాలు సాగిస్తున్నట్లు సమాచారం. దీంతో ఇది కాస్త వివాదాలకు దారి తీయడంతో ఏజెన్సీని కొన్నాళ్లుగా మూసివేసినట్లు స్థానికులు చెబుతున్నారు. రాజకీయ కారణాలతో ఇలా ప్రజలను ఇబ్బంది పెట్టడమేమిటని ప్రశ్నిస్తున్నారు. ప్రతి ఇంటా నిత్యావసర వస్తువైన గ్యాస్ లేకపోతే ఎన్నాళ్లు ఉండగలమని అంటున్నారు.
మూడు వారాలుగా నో సిలిండర్
రాజకీయాలతో నలిగిపోతున్న ఏజెన్సీ?