సాలూరు రూరల్:
మండలంలోని కూర్మరాజుపేట పంచాయతీ పునికినవలస గ్రామ భూములు గత 80 ఏళ్లుగా సాగుచేస్తున్న గిరిజనులపై కొంతకాలంగా సాలూరుకు చెందిన చిట్లు శశికళ, మన్మథలు ఫిర్యాదు చేస్తున్నారు. ఆ భూములు పూర్వం తమవని గిరిజనులు, కూర్మరాజుపేటకు చెందిన బీసీ రైతులు ఆక్రమించుకున్నారని కేసులు పెడుతున్నారు. ఈ విషయంలో పలుమార్లు కలెక్టర్, ఆర్‌డీఓ కార్యాలయాలకు గిరిజన రైతులను తిప్పించారు. ఈ భూములపై పూర్తి హక్కులు సాగుచేస్తున్న రైతులవేనని అధికారులు ఒక వైపు చెబుతూనే మరోవైపు వారు చేస్తున్న ఫిర్యాదులపై రైతులకు నోటీసులు జారీచేసున్నారు. అందులో భాగంగా సోమవారం స్థానిక రెవెన్యూ అధికారులు 50 మందికి పైగా గిరిజన, బీసీ రైతులకు నోటీసులు జారీచేసి వారి భూములు చూపించాలని గ్రామంలో సర్వే చేసేందుకు డీఆర్‌ఓ కార్యాలయం నుంచి ఆదేశాలు వచ్చాయని చెబుతూ గ్రామంలోకి వచ్చిన సర్వే అధికారులను గిరిజన, బీసీ రైతులు అడ్డుకున్నారు. గత 80 ఏళ్లుగా తాము సాగుచేస్తున్నామని ఇప్పుడు వచ్చి ఎవడో పెట్టిన ఫిర్యాదుకు మాభూములు సర్వే చేస్తామనడం ఎంతవరకు సమంజసమని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫిర్యాదుదారులకు అధికారులు సహకరిస్తే రెవెన్యూ కార్యాలయం ఎదుట ధర్నా చేయాల్సి వస్తుందని గిరిజన రైతులు హెచ్చరించారు. అధికారులు ఇచ్చిన నివేదికలు సరిగా లేకపోవడంతో తమపై పదేపదే ఫిర్యాదులు చేసేందుకు ఆస్కారం ఏర్పడుతోందని రైతులు ఆవేదన వెళ్లగక్కారు.
80 ఏళ్లుగా సాగు చేస్తున్నాం
అధికారుల తప్పుడు నివేదికలతో ఫిర్యాదులు
రెవెన్యూ కార్యాలయం ఎదుట
ఆందోళన చేస్తాం