నేడు హెచ్‌సీఎల్‌ టెక్‌–బీ జాబ్‌ మేళా | Sakshi
Sakshi News home page

నేడు హెచ్‌సీఎల్‌ టెక్‌–బీ జాబ్‌ మేళా

Published Thu, May 30 2024 3:20 PM

-

● మ్యాథ్స్‌ సబ్జెక్టుతో ఇంటర్మీడియట్‌ ఉత్తీర్ణులైన విద్యార్థులకు సువర్ణావకాశం ● అర్హులైన విద్యార్థులు నేరుగా హాజరు కావచ్చు: ఆర్‌ఐఓ

విజయనగరం అర్బన్‌: ఇంటర్మీడియట్‌ ఉత్తీర్ణులైన విద్యార్థులకు శుభవార్త ఇది. మ్యాథ్స్‌ సబ్జెక్టుతో ఇంటర్మీడియట్‌ కోర్సులు పూర్తిచేసిన విద్యార్థులకు ఉద్యోగాలు కల్పించే జాబ్‌మేళాను ఈ నెల 30న స్థానిక మయూరి కూడలిలోని శ్రీసాయికాంప్లెక్స్‌లో హెచ్‌సీఎల్‌ టెక్‌–బి సంస్థ, ఇంటర్మీడియట్‌ బోర్డు సంయుక్తంగా నిర్వహిస్తుందని ఇంటర్మీడియట్‌ ప్రాంతీయ తనిఖీ అధికారి (ఆర్‌ఐఓ) ఎం.ఆదినారాయణ బుధవారం తెలిపారు. ఇంటర్మీడియట్‌ వార్షిక పరీక్షలో 750 మార్కుల పైబడి ఉత్తీర్ణులైన మాథ్స్‌ సబ్జెక్టు కలిగిన అన్ని గ్రూపుల విద్యార్థులకు ఇది సువర్ణావకాశంగా పేర్కొన్నారు. ఉమ్మడి విజయనగరం జిల్లాలోని 2022–23, 2023–24 విద్యా సంవత్సరంలో ఇంటర్మీడియట్‌ పూర్తిచేసిన వారు జాబ్‌మేళాకు అర్హులను తెలిపారు. ఇప్పటికే 400 మంది జాబ్‌మేళా కోసం రిజిస్ట్రేషన్‌ చేసుకున్నారని, రిజిస్ట్రేషన్‌ చేయనివారు కూడా నేరుగా జాబ్‌ మేళాకు హాజరుకావచ్చని చెప్పారు.

మూడు కేటగిరిలే కీలకం...

ఎంపిక ప్రక్రియలో భాగంగా తొలుత రాత పరీక్ష, ఇంటర్వ్యూ, ఇంగ్లిష్‌ భాష ప్రావీణ్యం పరీక్షిస్తారు. మూడింటిలో ప్రతిభ కనపరిచిన విద్యార్థులకు ఏడాది పాటు శిక్షణ ఇస్తారు. శిక్షణలోని ఏడో నెల నుంచి నెలకు రూ.10 వేలు చొప్పున స్టైఫండ్‌ ఇస్తారు. శిక్షణ అనంతరం ఏడాదికి రూ.1.70 లక్షల ప్రారంభ వార్షిక వేతనం పొందవచ్చు.

ఉద్యోగం చేస్తూ ఉన్నత విద్యాభ్యాసం

ఇంటర్మీడియట్‌ విద్యార్హతతో కొలువులో చేరిన విద్యార్థుల చదువు అక్కడితో ఆగిపోకూడదనే ఉద్దేశంతో హెచ్‌సీఎల్‌ టెక్‌ బీ కంపెనీ ఉన్నత విద్యను అభ్యసించేలా ప్రణాళికను రూపొందించింది. పలు యూనివర్సిటీలతో ఒప్పందం కుదుర్చుకుంది. దీనిలో ఉన్నత విద్యను అభ్యసించేందుకు ఫీజు కింద విద్యార్థులకు చెల్లించే జీతంలో కంపెనీ ఏడాదికి రూ.15 వేలు చెల్లిస్తుంది. రిజిస్ట్రేషన్‌ సందేహాల నివృత్తి కోసం సంస్థ ప్రతినిధి యోగేష్‌ ఫోన్‌:63003 78377 నంబర్‌ను సంప్రదించవచ్చు.

Advertisement
 
Advertisement
 
Advertisement