
పార్వతీపురం: జాతీయ పర్యాటక పోటీలకు దరఖాస్తులను ఆహ్వనిస్తున్నట్టు పర్యాటక అధికారి ఎన్.నారాయణరావు ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. భారత పర్యాటక మంత్రిత్వ శాఖ, గ్రామీణ పర్యాటకం, గ్రామీణ ప్రాంతాలలో బస విభాగం నోడల్ ఏజెన్సీగా వ్యవహరిస్తుందన్నారు. సంబంధిత రంగాలలో అనుభవం, ఆసక్తి గల సంస్థలు డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ.రూరల్.టూరిజం.జిఓవి.ఇన్ వెబ్‌సైట్‌ను సంప్రదించవచ్చని పేర్కొన్నారు. ఉత్తమ గ్రామీణ హోమ్ స్టే పోటీ 2024గా పోటీలను నిర్వహిస్తుందన్నారు. ఈ పోటీ దశ భారతదేశ గ్రామాల మధ్య పోటీతత్వం, గర్వాన్ని మరింతగా పెంచడానికి ప్రయత్నిస్తుందన్నారు. గ్రామాల గుర్తింపు, ఇతర గ్రామాల మధ్య ఉత్తమ పద్ధతులను పంచుకోవడానికి ఒక ఆదర్శప్రాయమైన నమూనాగా ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. తక్కువ జన సాంద్రత, ప్రసిద్ధ ప్రదేశాలు, పర్యాటక ప్రదేశాలు, ప్రకృతి దృశ్యాలకు నిలయంగా ఉండాలని తెలిపారు. ఆన్‌లైన్‌లో పూరించి సమర్పించిన దరఖాస్తులు మాత్రమే మూల్యాంకనం కోసం పరిగణించబడతాయన్నారు. దర ఖాస్తులు ఆంగ్ల భాషలో మాత్రమే ఆమోదించడం జరుగుతుందని తెలిపారు. జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయిలో పోటీ ఉంటుందని తెలిపారు. ప్రతీ విభాగంలో మూడు కేటగిరిల్లో మాత్రమే నామినేట్ చేయాలని స్పఫ్టం చేశారు. అర్హత, ఆసక్తి గల సంస్థలు సద్వినియోగం చేసుకొని పర్యాటక రంగాన్ని బలోపేతం చేయాలని కోరారు.
జిల్లాకు కీమోఽథెరపీ కేంద్రం
● జిల్లా ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ వాగ్దేవి
పార్వతీపురం టౌన్: పార్వతీపురం మన్యం జిల్లా ఆస్పత్రికి కీమోథెరపీ కేంద్రం మంజూరైందని సూపరింటెండెంట్ డాక్టర్ బి.వాగ్దేవి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. త్వరలో సేవలు అందుబాటులోకి రానున్నాయని పేర్కొన్నారు. దీనిలో భాగంగా ఆస్పత్రిలో జనరల్ మెడిసిన్ వైద్యురాలు అపర్ణ, ఫార్మాసిస్టు వెంకటరమణ, ఇద్దరు స్టాఫ్ నర్సులు, ఒక ల్యాబ్ టెక్నీషియన్‌కు కేజీహెచ్‌లో శిక్షణ ఇస్తున్నారని తెలిపారు. సేవలకు ఇబ్బందులు లేకుండా మిగిలిన సిబ్బంది త్వరలో విధుల్లో చేరనున్నారని తెలిపారు. ఎంఎం వార్డులో నాలుగు పడకలతో సేవలు అందుబాటులోకి తీసుకొస్తామని తెలిపారు. రోగుల అవసరాలకు అనుగుణంగా మందులు సిద్ధం చేస్తామని, సంబంధిత వైద్యులు, సిబ్బంది ప్రస్తుతం శిక్షణలో ఉన్నారని పేర్కొన్నారు. జిల్లాలో ఏటా వందల సంఖ్యలో క్యాన్సర్ కేసులు బయట పడుతున్నాయని, బాధితులు విశాఖ కేజీహెచ్‌లో చికిత్స పొందుతున్నారని, విశాఖలో మూడు క్యాన్సర్ ఆస్పత్రులుండగా జిల్లా నుంచి ఏటా వెయ్యి నుంచి 1500 మంది వరకు ఓపీకి వెళ్తున్నట్టు వైద్యులు చెబుతున్నారని తెలిపారు. వీరిలో ఎక్కువ మంది కీమోథెరపీ కోసం వారం, నెలకు ఒకసారి వెళ్తున్నారన్నారు. బాధితులు ఒక్కోసారి రెండు, మూడు రోజులు అక్కడే ఉంటున్నారని, వీటన్నింటిని దృష్టిలో ఉంచుకొని పార్వతీపురం జిల్లా ఆస్పత్రి కేంద్రంలో రోగికి భోజనం, ఇతర సౌకర్యాలు కల్పించేలా ఏర్పాట్లు చేయనున్నామని తెలిపారు. కీమోథెరపీ సేవలకు అవసరమైన వైద్యులు, సిబ్బందిని వైద్య శాఖ సిద్ధం చేస్తోందని తెలిపారు.
27 నుంచి రిజిస్ట్రేషన్ ప్రక్రియ
● జిల్లా క్రీడల చీఫ్ కోచ్ వెంకటేశ్వరరావు
పార్వతీపురం టౌన్: గ్రామ సచివాలయం నుంచి రాష్ట్ర స్థాయి వరకు డిసెంబర్ 15 నుంచి జనవరి 26 వరకు జరగనున్న ఆడుదాం – ఆంధ్రా పోటీలకు సంబంధించి ఈ నెల 27 నుంచి రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభం కానుందని జిల్లా క్రీడల చీఫ్ కోచ్ ఎస్.వెంకటేశ్వరరావు ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. యువతలో క్రీడా స్ఫూర్తి, ఐకమత్యం పెంపొందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న మెగా టోర్నమెంట్‌ను విజయవంతం చేయాలని కోరారు. క్రికెట్, బ్యాడ్మింటన్, వాలీబాల్, కబడ్డీ, ఖో–ఖో మొత్తం ఐదు క్రీడాంశాల్లో పోటీలు నిర్వహించాలన్నారు. 15 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కరూ పోటీల్లో పాల్గొనవచ్చన్నారు. గ్రామ సచివాలయం స్థాయిలో పోటీలు డిసెంబర్ 15 నుంచి 20 వరకు, మండల స్థాయిలో డిసెంబర్ 21 నుంచి జనవరి 4 వరకు, నియోజకవర్గ స్థాయిలో జనవరి 5 నుంచి 10వరకు, జిల్లా స్థాయిలో జనవరి 11 నుంచి 21 వరకు నిర్వహించాలని పేర్కొన్నారు. 44 రోజుల పాటు నిరంతరం క్రీడా మహోత్సవం నిర్వహించాలని తెలిపారు. వలంటీర్లు ద్వారా రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభమవుతుందన్నారు. పోటీలకు సంబంధించిన క్రీడా స్థలాలు, వసతి, మౌలిక సదుపాయాలు, అంపైర్లు, ఇలా ప్రతి ఒక్క అంశంలోనూ బృందాలు ఏర్పాట్లు చేసేందుకు చర్యలు చేపట్టామన్నారు. బహుమతులు కూడా లక్షల రూపాయల్లో ఉంటాయని వివరించారు.
