రేపల్లె: సామాజిక భ్రదత పింఛన్‌ల పంపిణీ కార్యక్రమంలో భాగంగా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అక్టోబర్ 1వ తేదిన రేపల్లె పట్టణానికి విచ్చేయనున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పర్యటన నేపథ్యంలో హెలీప్యాడ్, ప్రజావేదికకు స్థలాలను జిల్లా కలెక్టర్ వినోద్‌కుమార్, ఎస్పీ బి.ఉమామహేశ్వర్‌లు శనివారం సాయంత్రం పరిశీలించారు. పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల గ్రౌండ్, పెనుమూడి రోడ్డు, నిజాంపట్నం రోడ్డులో హెలీప్యాడ్ లాండింగ్, ప్రజావేదికల ఏర్పాటుకు స్థల పరిశీలన చేశారు. ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో ఏర్పాట్లు పూర్తి చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ వినోద్‌కుమార్ పేర్కొన్నారు. కార్యక్రమంలో ఆర్డీవో శ్రీదేవి, తహసీల్దార్ శ్రీనివాసరావు, కమిషనర్ సాంబశివరావు, టీడీపీ నాయకులు అనగాని శివప్రసాద్, తదితరులు పాల్గొన్నారు.
గుంటూరు రూరల్: ఆచార్య ఎన్.జి.రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం ప్రతిష్ఠాత్మక స్కోచ్ గోల్డ్ అవార్డును కై వసం చేసుకుంది. ఇటీవల న్యూఢిల్లీలో జరిగిన స్కోచ్ సమ్మిట్ కార్యక్రమంలో అవార్డును విశ్వవిద్యాలయ ఉపకులపతి డాక్టర్ పి.వి.సత్యనారాయణ, డీన్ డాక్టర్ సీహెచ్ శ్రీనివాసరావులు అందుకున్నారు. 2022లో స్కోచ్ గోల్డ్ అందుకున్న విశ్వవిద్యాలయం మరలా 2026లో సాధించడం విశ్వవిద్యాలయ ప్రస్థానంలో ఒక ముఖ్యమైన మైలురాయిగా నిలిచింది. వ్యవసాయ విద్య, పరిశోధన, విస్తరణ రంగాల్లో విశ్వవిద్యాలయం చేపడుతున్న వినూత్న కార్యక్రమాలు, వాటి ద్వారా రైతులకు అందుతున్న ప్రయోజనాలు, కార్యక్రమాల ప్రభావం సమాజంపై చూపుతున్న సానుకూల ఫలితాలను గుర్తిస్తూ ఈ జాతీయ స్థాయి పురస్కారం లభించింది. వీసీ మాట్లాడుతూ అవార్డును పొందటం విశ్వవిద్యాలయానికి గర్వకారణమన్నారు. ఇది ఒక అవార్డు మాత్రమే కాదని, శాస్త్రవేత్తలు, అధ్యాపకులు, అధికారులు, సిబ్బంది, విద్యార్థులు రైతులతో కలిసి చేపడుతున్న కార్యక్రమాలకు లభించిన జాతీయ స్థాయి గుర్తింపు అని చెప్పారు. డీన్ డాక్టర్ శ్రీనివాసరావు మాట్లాడుతూ విశ్వవిద్యాలయంలో విద్యార్థులు, అధ్యాపకులు శాస్త్రవేత్తల సమష్టి కృషితో వ్యవసాయ విద్యను మరింత ఆధునికంగా, పరిశోధనలను మరింత ప్రయోజనకరంగా చేపడుతున్న నిరంతర కృషికి గుర్తింపుగా అవార్డు లభించటం ఆనందదాయకమన్నారు.
కాణిపాకం: కాణిపాకం స్వయంభూ శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారికి శనివారం పలువురు భక్తులు భారీ విరాళాలు సమర్పించారు. బాపట్ల జిల్లా కారంచేడుకు చెందిన మల్లయ్య, రాజ్యలక్ష్మి దంపతులు స్వామివారికి రూ. 2.50 లక్షల విలువైన, సుమారు కిలో బరువు కలిగిన వెండి పుష్పమాలను బహుకరించారు. దీనితోపాటు స్వామివారి నిత్య అన్నదాన ట్రస్టుకు రూ.లక్ష విరాళంగా అందజేశారు. అలాగే గుంటూరు జిల్లా తాడేపల్లికి చెందిన సోమసత్య శ్రీనివాసరావు తమ కుటుంబ సభ్యులతో కలసి స్వామివారి నిత్య అన్నదాన పథకానికి రూ.లక్ష నగదు విరాళాన్ని ఆలయ అధికారులకు అందించారు. విరాళాలు అందించిన దాతలకు ఆలయ అధికారులు దగ్గరుండి స్వామివారి దర్శన ఏర్పాట్లు కల్పించి, తీర్థప్రసాదాలు అందజేసి వేదాశీర్వచనంతో సత్కరించారు.
దుగ్గిరాల: ప్రకాశం బ్యారేజ్ నుంచి పశ్చిమ డెల్టాకు శనివారం 5,009 క్యూసెక్కులు విడుదల చేసినట్లు నీటిపారుదల శాఖ అధికారులు తెలిపారు. బ్యారేజీ వద్ద 12 అడుగుల నీటి మ ట్టం స్థిరంగా ఉన్నట్లు తెలిపారు. బ్యాంక్ కెనాల్‌కు 802 క్యూసెక్కులు, తూర్పు కాలు వకు 380, పశ్చిమ కాలువకు 181, నిజాంపట్నం కాలువకు 270, కొమ్మమూరు కాలువకు 1,020 క్యూసెక్కులు విడుదల చేశామన్నారు.


