రోడ్డు ప్రమాదంలో ఇద్దరికి గాయాలు | - | Sakshi
Sakshi News home page

రోడ్డు ప్రమాదంలో ఇద్దరికి గాయాలు

Sep 7 2026 2:50 AM | Updated on Sep 7 2026 2:50 AM

ముప్పాళ్ళ: ద్విచక్ర వాహనాన్ని వెనుక నుంచి గుర్తు తెలియని వాహనం ఢీకొనగా ఇద్దరు గాయపడిన సంఘటన శనివారం రాత్రి జరిగింది. సంఘటనకు సంబంధించి స్థానికులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. మండలంలోని బొల్లవరం గ్రామానికి చెందిన బద్దిగం వెంకటరెడ్డి, వి.శ్రీనివాసరెడ్డిలు సత్తెనపల్లిలో జరిగే వివాహానికి ద్విచక్రవాహనం పై బయలుదేరారు. మార్గమధ్యలో ఇరుకుపాలెం సమీపంలో నూతనంగా నిర్మిస్తున్న ఫ్‌లైఓవర్‌ వద్ద నరసరావుపేట వైపు నుంచి వస్తున్న కారు ద్విచక్రవాహనాన్ని వెనుక ఢీకొట్టింది. దీంతో ద్విచక్రవాహనం పై ఉన్న వెంకటరెడ్డి, శ్రీనివాసరెడ్డిలు ఎగిరి రోడ్డు మార్జిన్‌లో పడ్డారు. గమనించిన స్థానికులు క్షతగాత్రులను చికిత్స నిమిత్తం సత్తెనపల్లి ఏరియా వైద్యశాలకు తరలించారు. ప్రమాదానికి కారణమైన కారు ఆగకుండా వెళ్లిపోయింది. ఘటనపై బాధితులు ముప్పాళ్ళ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

రైల్లో నుంచి జారిపడి యువకుడికి తీవ్ర గాయాలు

సత్తెనపల్లి: రైల్లో నుంచి జారిపడి యువకుడికి తీవ్ర గాయాలైన సంఘటన సత్తెనపల్లి మండలం గుడిపూడి–లక్ష్మీపురం గ్రామాల మధ్య ఆదివారం తెల్లవారుజామున జరిగింది. వివరాలు ఇలా ఉన్నాయి.ఒడిశా రాష్ట్రం కలహందిజిల్లా తండిమండలం బలిజీ వాహన్‌ గ్రామానికి చెందిన బలిజివార్‌ శివ అనే యువకుడు హైదరాబాద్‌–భువనేశ్వర్‌ రైల్లో నుంచి జారిపడటంతో తీవ్ర గాయాలపాలయ్యాడు. సమాచారం అందుకున్న 108 బృందం ఘటన స్థలానికి చేరుకొని ప్రాథమిక చికిత్స అందించారు. ఘటనా స్థలం వద్దకు 108 వాహనం చేరే పరిస్థితి లేకపోవడంతో క్షతగాత్రుడు శివను సుమారు మూడు కిలోమీటర్లు పంట పొలాల గుండా మోసుకుంటూ 108 వాహనం వద్దకు చేర్చారు. అనంతరం క్షతగాత్రుడు శివను చికిత్స నిమిత్తం ప్రభుత్వ ప్రాంతీయ వైద్యశాలకు తరలించారు.

గంజాయి మత్తులో యువకుల వీరంగం

నడిరోడ్డుపై గొడవేందని ప్రశ్నించిన వారిపై దాడి

శావల్యాపురం: గంజాయి మత్తులో యువకులు వీరంగం సృష్టించిన సంఘటన మండల కేంద్రం శావల్యాపురలో ఆదివారం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల మేరకు వినుకొండ పట్టణానికి చెందిన కొందరు యువకులు నడిరోడ్డుపై బీరు సీసాలతో హాల్‌చల్‌ చేస్తూ మత్తులో బైకుపై వస్తున్నారు. ఈక్రమంలో గ్రామానికి చెందిన ఒక యువకుడుకి బైకు తగిలించారు. ఇదేమని ప్రశ్నించిన యువకుడుపై దాడికి పాల్పడ్డారు. ప్రశ్నించిన గ్రామస్తులపై మత్తులో ఉన్న యువకులు దౌర్జనంగా మాట్లాడుతూ ఇష్టానుసారంగా అసభ్య పదజాలంతో దూషణకు దిగారు. దీంతో వెంటనే స్థానిక పోలీసులకు సమాచారం ఇచ్చారు. హుటహుటిన సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు గంజాయి మత్తులో ఉన్న యువకులను పోలీసు స్టేషనుకు తరలించారు. పోలీసులు సకాలంలో స్పందించటంతో పెను ప్రమాదం తప్పిందని ఊపిరి పిల్చుకున్నారు. ఈవిషయం గురించి స్టేషను రైటరు సలీమ్‌బాషను వివరణ కోరగా.. గంజాయి మత్తులో శాంతి భద్రతలు విఘూతం కల్గించిన యువకులపై చట్టపరంగా కేసు నమోదు చేస్తామన్నారు.

యువకుడిపై కత్తితో దాడి

నాదెండ్ల: పాతకక్షల నేపథ్యంలో ఓ యువకుడు కత్తిపోట్లకు గురయ్యాడు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. యడ్లపాడు మండలం జాలాది గ్రామానికి చెందిన కాకుమాను వేణుగోపాల్‌ చిలకలూరిపేట అడ్డరోడ్డు సెంటర్లో కార్‌ ట్రావెల్స్‌ నిర్వహిస్తుంటాడు. యడ్లపాడు మండలం తిమ్మాపురం గ్రామానికి చెందిన పట్టపురాజు సాయికి, వేణుగోపాల్‌కు కొంతకాలంగా పాతకక్షలు ఉన్నాయి. కొద్ది రోజుల క్రితం వేణుగోపాల్‌ భార్య సుకన్యను సాయి ఫోన్‌లో అసభ్యంగా మాట్లాడిన విషయాన్ని ప్రశ్నించగా ఇద్దరి మధ్య వివాదం నెలకొంది. ఈ నేపథ్యంలో ఆదివారం సాయంత్రం సుమారు 7.30 గంటల సమయంలో జాతీయ రహదారి సమీపంలోని టీ దుకాణం వద్దకు వేణు దంపతులు వచ్చారు. కక్షపెంచుకున్న సాయి తన వద్ద ఉన్న కత్తితో గోపాల్‌పై దాడి చేశాడు. దీంతో గాయాలైన గోపాల్‌ను పోలీసులు పట్టణంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. దాడి చేసిన సాయి నాదెండ్ల పోలీస్‌స్టేషన్‌లో లొంగిపోయినట్లు ఎస్‌ఐ ఆర్‌.వెంకటేశ్వరరావు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement