శావల్యాపురం: సాగర్ జలాలతో మంచినీటి చెరువులను నూరుశాతం నింపాలని జిల్లా ఎన్‌ఎస్‌పీ ఈఈ తమ్మిశెట్టి చంద్రశేఖర్ కోరారు. బుధవారం మండలంలోని పోట్లూరు, శానంపూడి గ్రామాల్లోని తాగునీటి చెరువులను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈసందర్భంగా ఈఈ మాట్లాడుతూ జిల్లాలో రక్షిత తాగునీటి చెరువులు 132 ఉన్నాయని, ప్రజల తాగునీటి అవసరాల నిమిత్తం సాగర్ జలాలు విడుదల చేసినట్లు తెలిపారు. చెరువులు, నీటి కుంటలు పూర్తిస్థాయిలో నిండేలా పంచాయతీ, ఆర్‌డబ్యూఎస్, ఎన్నెస్పీ అధికారులు సమన్వయంతో నింపటానికి శక్తివంచన లేకుండా చేయాలన్నారు. పోట్లూరు గ్రామంలో ఉన్న మంచినీటి చెరువుకి ఫిల్టర్‌బెడ్స్ ఏర్పాటుకు ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంకు సౌజన్యంతో రూ.17 లక్షలు నిధులు మంజూరు చేసినట్లు వెల్లడించారు. మంచినీటి చెరువులో చేపల పెంపకంపై అసహనం వ్యక్తం చేశారు. గ్రామస్తులు తాగునీటి కోసం తీవ్రస్థాయిలో ఇబ్బందులు పడుతున్నట్లు అధికారులకు ఫిర్యాదు చేశారు. శానంపూడిలో జలజీవన్ మిషన్ నిధులు రూ.50 లక్షలతో జరుగుతున్న పైపు నిర్మాణ పనులు తుది దశకు చేరాయని త్వరలో మంచినీరు సరఫరా అయ్యేలా చర్యలు తీసుకుంటామన్నారు. ఆయనతో పాటు డీఈ ఆర్.కుమార్‌రాజా, ఏఈ రత్నబాబు ఉన్నారు.
ఎన్‌ఎస్‌పీ ఈఈ చంద్రశేఖర్


