టీడీపీలో ఉన్న వారికే మళ్లీ కండువాలు కప్పిన ఎమ్మెల్యే యరపతినేని
రెండున్నరేళ్లుగా టీడీపీలో కొనసాగుతున్న నగర పంచాయతీ చైర్మన్, కౌన్సిలర్లు
వైఎస్సార్‌సీపీ నుంచి చేరుతున్నట్లుగా దుష్పచారం
వైఎస్సార్‌సీపీకి దూరంగా ఉంటున్న బడేజానీ, ఇతర కౌన్సిలర్లు
సాక్షి టాస్క్‌ఫోర్స్: కొత్త సీసాలో పాత నీరు అనే చందంగా మారింది టీడీపీ పరిస్థితి. రెండున్నరేళ్లుగా టీడీపీలో కొనసాగుతూ..ఎమ్మెల్యేతో పాటుగా టీడీపీ సభలు, సమావేశాల్లో పాల్గొంటున్న ప్రజాప్రతినిధులకు టీడీపీ కండువాలు కప్పి అభాసుపాలైంది. వైఎస్సార్ సీపీ తరపున నగర పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేసి గెలిచిన వ్యక్తులు టీడీపీ అధికారంలోకి రాగానే పదవుల కోసం ప్రజాతీర్పును పక్కనపెట్టి ఆ పార్టీ పంచనా చేరారు. రెండున్నరేళ్లుగా టీడీపీలోనే కొనసాగుతూ ఆ పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు. తాజాగా వారేదో వైఎస్సార్ సీపీ నుంచి వెళ్లినట్లుగా కటింగ్‌లు ఇచ్చి గురజాల నగర పంచాయతీ చైర్మన్ షేక్ బడేజానీతో పాటుగా మరికొంత మందికి ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు టీడీపీ కండువాలను కప్పారు. ఈ విషయం నియోజకవర్గంలో హాట్ టాపిక్‌గా మారింది.
టీడీపీ వైఫల్యాలతో వైఎస్సార్‌సీపీలో చేరికలు
టీడీపీ అధికారంలోకి వచ్చిన తరువాత ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చకపోవటంతో ఆ పార్టీ నేతలతోపాటుగా ప్రజలకు ప్రభుత్వంపై వ్యతిరేకత వచ్చింది. దీంతో టీడీపీ చేస్తున్న మోసపూరితమైన పాలనా చూసి తట్టుకోలేక..ఆ పార్టీలో ఇమడలేక వైఎస్సార్‌సీపీలో చేరుతున్నారు. తాజాగా దాచేపల్లి నగర పంచాయతీ పరిధిలోని 20వ వార్డు కౌన్సిలర్ ముశ్యం సీతారామయ్య కుమారుడు, టీడీపీ బీసీ విభాగం రాష్ట్ర అధికార ప్రతినిధి ముశ్యం శ్రీనివాసరావు గురజాల మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్‌రెడ్డి సమక్షంలో వైఎస్సార్ సీపీలో చేరారు. బీసీలలో బలమైన నాయకుడిగా పేరొందిన శ్రీనివాసరావు టీడీపీ చేస్తున్న మోసాలను చూసి ఉండలేక, టీడీపీ సిద్ధాంతాలు నచ్చక వైఎస్సార్ సీపీలో చేరాడు. గురజాల నియోజకవర్గ వ్యాప్తంగా మరికొంతమంది టీడీపీ ముఖ్యనేతలు వైఎస్సార్ సీపీలో చేరేందుకు ఆ పార్టీ సమన్వయకర్త కాసు మహేష్‌రెడ్డితో టచ్‌లో ఉన్నాట్లు సమాచారం. మరికొద్ది రోజుల్లోనే నియోజకవర్గ వ్యాప్తంగా టీడీపీ నుంచి భారీ చేరికలు ఉంటాయని వైఎస్సార్ సీపీ నేతలు భావిస్తున్నారు.
నవ్విపోదురు గాక
గురజాల నియోజకవర్గంలోని గురజాల నగర పంచాయతీ చైర్మన్ షేక్ బడేజానీతో పాటుగా ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు టీడీపీ కండువాలు కప్పిన వారంతా వైఎస్సార్ సీపీ ఇచ్చిన బీఫాం ద్వారానే పోటీ చేసి గెలిచారు. 2024లో వైఎస్సార్ సీపీ ఓటమి తరువాత బడేజానీ పార్టీకి దూరంగా ఉంటూ టీడీపీ నాయకులతో చెట్టపట్టాలేసుకుని తిరుగుతున్నాడు. గురజాల ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు గురజాలలో పాల్గోనే ప్రతి కార్యక్రమంలో బడే జానీ పాల్గొన్నారు. రెండున్నరేళ్లపాటు అధికారంలో ఉన్న టీడీపీలోనే కొనసాగుతున్న నగర పంచాయతీ చైర్మన్ బడేజానీతోపాటుగా మరికొంతమంది కౌన్సిలర్లకు ఎమ్మెల్యే యరపతినేని టీడీపీ కండువాలు కప్పి టీడీపీలోకి ఆహ్వానిస్తున్నట్లుగా మంగళవారం ప్రకటించారు. ఈ విషయం నియోజకవర్గంలో వైరల్‌గా మారటంతో సామాజిక మాధ్యమాల్లో టీడీపీ తీరు, ఎమ్మెల్యే యరపతినేని, నగర పంచాయతీ చైర్మన్ బడేజానీ వ్యవహారంపై వ్యంగ్యంగా వైరల్ చేస్తున్నారు. బడేజానీ టీడీపీ సభల్లో, సమావేశాల్లో పాల్గొని మాట్లాడుతున్న వీడియోలను సామాజిక మాధ్యమాల్లో పోస్ట్‌లు చేసి వైరల్ చేస్తున్నారు. టీడీపీలోనే కొనసాగుతున్న బడేజానీతో పాటుగా ఇతర కౌన్సిలర్లకు మళ్లీ టీడీపీ కండువాలు వేయటం ఏమిటని నవ్వుకుంటున్నారు.


