రూ.10 వేలు కొట్టు.. రూ.10 కోట్లు పట్టు | - | Sakshi
Sakshi News home page

రూ.10 వేలు కొట్టు.. రూ.10 కోట్లు పట్టు

May 17 2026 7:08 AM | Updated on May 17 2026 7:08 AM

రూ.10 వేలు కొట్టు.. రూ.10 కోట్లు పట్టు

గిఫ్ట్‌ మనీ పేరుతో నయా మోసం

నరసరావుపేటలో

కార్యాలయం ప్రారంభం

స్థ్ధానికుల సమాచారంతో

రంగంలోకి దిగిన పోలీసులు

పోలీసుల విచారణతో

వెలుగుచూసిన భారీ స్కాం

పోలీసుల అదుపులో నిర్వాహకుడు

వెంకట్రావు

పలు రాష్ట్రాల్లో ఇదే తరహా మోసాలు

నరసరావుపేట రూరల్‌: పది వేలు చెల్లిస్తే పది కోట్లు ఇస్తామంటూ స్కీమ్‌ను ప్రారంభించి అమాయక ప్రజలను మోసగించేందుకు ప్రయత్నిస్తున్న వ్యక్తిని నరసరావుపేట రూరల్‌ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పట్టణ శివారు ప్రాంతమైన కేసానుపల్లి పంచాయతీ పరిధిలోని ఎల్‌టీ నగర్‌లో రెండు రోజుల క్రితం చిలకలూరిపేట మండలం గొట్టిపాడుకు చెందిన నాగండ్ల వెంకట్రావు కార్యాలయాన్ని ప్రారంభించాడు. వెంకట్రావు కోకోనట్‌ మర్చంట్‌ పేరుతో ప్రారంభించిన కార్యాలయానికి ప్రజలు పెద్ద సంఖ్యలో ప్రజలు వస్తుండటంతో స్థానికులు అనుమానంతో పోలీసులకు సమాచారం అందించారు. రూరల్‌ సీఐ ఎంవీ సుబ్బారావు సిబ్బందితో కార్యాలయానికి చేరుకుని విచారణ చేపట్టడంతో విషయం వెలుగు చూసింది. పోలీసుల విచారణలో స్కీమ్‌లో సభ్యుల నుంచి నిర్వాహకులు ఈకేవైసీ తీసుకుంటున్నట్టు సేకరిస్తున్నట్టు గుర్తించారు.

గిఫ్ట్‌ మనీ పేరుతో టోకరా..

రాకేట్‌ ల్యాబ్‌ పేరుతో వెంకట్రావు గత కొంతకాలంగా ఏపీ, తెలంగాణ రాష్ట్రాలలో గిఫ్ట్‌ మనీ స్కీమ్‌ను నిర్వహిస్తున్నాడు. స్కీమ్‌లో చేరిన సభ్యులు మొదటగా రూ.10 వేలు చెల్లిస్తే రూ.10 కోట్లు వరకు లబ్ధిపొందవచ్చని నమ్మబలుకుతున్నాడు. తక్కువ సమయంలో పెద్ద మొత్తంలో డబ్బులు వస్తాయనే ఆశతో అధిక సంఖ్యలో స్కీమ్‌లో సభ్యులుగా చేరుతున్నారు. ఇందుకోసం 500 మంది వరకు ఏజెంట్లు ఈ స్కీమ్‌లో పనిచేస్తున్నారు. వీరంతా కలిసి దాదాపు నాలుగు వేల మందిని స్కీమ్‌లో సభ్యులుగా చేర్చినట్టు తెలుస్తుంది. స్కీమ్‌లో చేరి రూ.10 వేలు చెల్లించిన నాలుగు రోజుల తరువాత సింగపూర్‌లో వారి పేరుపై అకౌంట్‌ ప్రారంభించి రూ.3 లక్షలు జమ చేసినట్టు నమ్మించేందుకు నకిలీ సందేశాలు పంపుతారు. నెల రోజుల తరువాత రూ.10 కోట్లు జమ చేస్తామని నమ్మబలికి ఇప్పటికే రూ.కోట్లులో వసూలు చేసినట్టు సమాచారం.

బ్లాక్‌ మనీనీ వైట్‌గా మార్చే పేరుతో....

పిడుగుపాటు వలన ఏర్పడే ఖోగోళిక పదార్థం అమ్మడం వలన లక్షల కోట్లు వచ్చాయని, బ్లాక్‌ మనీనీ వైట్‌ చేసే క్రమంలో పేదలకు సాయం చేస్తున్నట్టు వెంకట్రావు తెలపడంతో పోలీసులు విస్తుపోయారు. సభ్యులుగా చేరిన వారి అకౌంట్‌లో రూ.10 కోట్లు జమ చేసి అందులో సగం తాము తీసుకోవడం ద్వారా వైట్‌మనీగా మార్చుతున్నట్టు వివరించాడు. ఇందుకోసం సింగపూర్‌లో అకౌంట్‌ తెరిచేందుకు సభ్యుల నుంచి రూ.10 వేలు వసూలు చేస్తున్నట్టు తెలిపాడు. ఈ స్కీమ్‌ వెనుక పెద్దల ప్రేమేయం ఉందని నిర్వాహకుడు చెప్పుకొస్తున్నాడు. కేంద్ర ప్రభుత్వంలోని కీలక వ్యక్తులతో పాటు రెవెన్యూ, పోలీసు, న్యాయాధికారులు తమకు అండగా ఉన్నారంటూ పోలీసులను బెదిరించాడు. వెంకట్రావు మాటలపై అనుమానంతో అదుపులోకి తీసుకుని పోలీసులు విచారణ చేపట్టారు. ఇదంతా బోగస్‌గా పోలీసులు ప్రాథమిక అంచనాకు వచ్చారు. స్కీమ్‌ నిర్వాహకుల్లో ఒకరు కేరళలో ఉన్నారని, ఆతన్ని కూడా విచారించిన తరువాత చర్యలు తీసుకుంటామని సీఐ సుబ్బారావు తెలిపాడు. చిలకలూరిపేటతో పాటు పలు చోట్లు వెంకట్రావు మోసాలపై ఇప్పటికే కేసులు నమోదు అయ్యాయి.

Advertisement
 
Advertisement
Advertisement