చిలకలూరిపేటటౌన్: బస్సును తప్పించబోయి లారీ బోల్తా పడిన ఘటన మండలంలోని కావూరు ప్రాంతంలో జరిగింది. సేకరించిన వివరాల ఇలా ఉన్నాయి. ప్రకాశం జిల్లా టంగుటూరు నుంచి పొగాకు లోడుతో నరసరావుపేట వెళ్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఎదురుగా వస్తున్న ఆర్టీసీ బస్సు డ్రైవర్ తీవ్ర నిర్లక్ష్యంగా, వేగంగా వాహనాన్ని నడపడం వల్లే దానిని తప్పించబోయి అదుపుతప్పి తమవాహనం బోల్తా పడిందని లారీ డ్రైవర్ ఆవేదన వ్యక్తం చేశాడు. ఈ ప్రమాదంలో లారీ పాక్షికంగా ధ్వంసం కాగా, పరిస్థితి గమనించి డ్రైవర్ పక్కకు దూకాడు. లారీ డ్రైవర్‌కు ఎలాంటి గాయాలు కాకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. స్థానికుల నుంచి సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
మాచవరం: ప్రమాదవశాత్తూ నేల బావిలో పడి వ్యక్తి మృతి చెందిన సంఘటన మండలంలోని పిన్నెల్లి గ్రామంలో శుక్రవారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం నల్లగొండ జిల్లా త్రిపురారం మండలం నీలయ్యపాలెం గ్రామానికి చెందిన కొరడాల విశ్వనాథం (45) రెండేళ్ల కిందట రోడ్డు ప్రమాదంలో గాయపడి మతిస్థిమితం కోల్పోయాడు. కొంతకాలంగా గ్రామాన్ని విడిచి పలు గ్రామాల్లో సంచరిస్తున్నాడు. శుక్రవారం తెల్లవారుజామున గొర్రెల కాపరులు నేల బావిలో మతదేహాన్ని గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పరిశీలించారు. మృతుని చొక్కా జేబులో ఉన్న ఆధార్ కార్డు ఆధారంగా మృతుని వివరాలు గుర్తించి, కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. పోస్టుమార్టం నిమిత్తం గురజాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతుని సోదరుడు వెంకటేశ్వర్లు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.
ఏఎన్‌యూ(పెదకాకాని): ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో నిర్వహించే రెండు సంంత్సరాలు కాలపరిమితి గల బీపీఈడీ, డీపీఈడీ కోర్సులలో ప్రవేశానికి ఏపీ పీసెట్–2026 ద్వారా దరఖాస్తు చేసుకోవాలని ఏపీ పీసెట్ కన్వీనర్ ప్రొఫెసర్ పాల్‌కుమార్ శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈనెల 13 నుంచి 15వ తేదీ వరకూ ఎటువంటి అపరాధ రుసుం లేకుండా దరఖాస్తు చేసుకోవచ్చన్నారు.
ఏఎన్‌యూలో 2026–2027 విద్యా సంవత్సరంలో ప్రవేశానికి రూ.1000 అపరాధ రుసుంతో 20వ తేదీ వరకూ, రూ.2000 అపరాధ రుసుంతో మే 25వ తేదీ వరకూ దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. దరఖాస్తు చేసిన వారు తమ తప్పులను 24 నుంచి 26వ తేదీలోగా సరిదిద్దుకోవచ్చన్నారు. అభ్యర్థులు తమ హాల్ టికెట్‌లను మే 28 నుంచి వెబ్‌సైట్ ద్వారా డౌన్‌లోడ్ చేసుకోవచ్చన్నారు. అభ్యర్థులు హాల్ టికెట్‌లోని తేది, సమయం ప్రకారం పరీక్షకు హాజరు కావాలన్నారు. ఏపీ పీసెట్ 2026 దేహదారుఢ్య పరీక్ష, క్రీడానైపుణ్య పరీక్షలు జూన్ 3వ తేదీన ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం క్యాంపస్‌లో ప్రారంభమవుతాయని తెలిపారు. పూర్తి వివరాలు వెబ్‌సైట్ ద్వారా తెలుసుకోవచ్చన్నారు.
గుంటూరు ఎడ్యుకేషన్: స్టూడెంట్ యూనియన్ ఫర్ నేషన్ (సన్), కేవీఆర్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈనెల 18 నుంచి 27వ తేదీ వరకు ఐఏఎస్ ఫౌండేషన్ తరగతులు నిర్వహిస్తున్నట్లు జన విజ్ఞాన వేదిక రాష్ట్ర అధ్యక్షుడు కేఎస్ లక్ష్మణరావు, సన్ వ్యవస్ధాపకుడు కె.యశ్వంత్ తెలిపారు. శుక్రవారం బ్రాడీపేటలోని యూటీఎఫ్ కార్యాలయంలో శిక్షణ తరగతుల పోస్టర్లు ఆవిష్కరించారు. కేఎస్ లక్ష్మణరావు మాట్లాడుతూ అమరావతిరోడ్డులోని హిందూ ఇంజినీరింగ్ కళాశాలలో జరగనున్న శిక్షణ తరగతుల్లో 8వ తరగతి నుంచి డిగ్రీ వరకు చదువుతున్న విద్యార్థులు హాజరు కావచ్చునని తెలిపారు. ఐఏఎస్, సివిల్ సర్వీస్ పరీక్షలపై విద్యార్థి స్థాయి నుంచి అవగాహన కల్పించడం లక్ష్యంగా పరీక్షల విధానం, సన్నద్ధత వంటి అంశాలపై అవగాహన కల్పిస్తామని పేర్కొన్నారు. కె.యశ్వంత్ మాట్లాడుతూ 12 ఏళ్లుగా ఐఏఎస్ ఫౌండేషన్ తరగతులు నిర్వహిస్తున్నామని, విద్యార్థులు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని సూచించారు. ఆసక్తి గల విద్యార్థులు 94913 36996, 79895 70755, 93469 84938 నంబర్లలో సంప్రదించాలని కోరారు. కార్యక్రమంలో ట్రైనీ ఐపీఎస్ అధికారి అశ్విన్ మణిదీప్, సన్ వలంటీర్లు పాల్గొన్నారు.


