వాటాల పంపకంలో టీడీపీ నేతల మధ్య వివాదం
బొల్లవరం(ముప్పాళ్ల): మట్టిపై కన్నేసిన అక్రమ దారులకు ఏకంగా లక్షల రూపాయల విలువ చేసే చేపలు దొరికాయి. వాటాలు పంచుకునే విషయంలో టీడీపీ నాయకుల మధ్య వివాదం తలెత్తింది. ఈ సంఘటన మండలంలోని చాగంటివారిపాలెం రెవెన్యూ పరిధిలోని బొల్లవరం గ్రామంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. బొల్లవరం గ్రామానికి సమీపంలో ఏడు ఎకరాల భూమిలో గత టీడీపీ ప్రభుత్వ హయాంలో అప్పటి ఎమ్మెల్యే, మాజీ స్పీకర్ డాక్టర్ కోడెల శివప్రసాదరావు ఆదేశాల మేరకు చేపల చెరువును తవ్వించేందుకు శ్రీకారం చుట్టి పనులు చేపట్టారు. పనుల్లో భాగంగా కొంత మట్టిని అమ్ముకోగా, మరికొంత మట్టిని కట్టలు వేయించారు. తర్వాత ఎన్నికలు రావటంతో చెరువు పనులు నిలిచిపోయాయి. వర్షాలకు, కాల్వల ద్వారా తవ్విన చెరువులోకి నీరు చేరింది. కాల్వల ద్వారా వచ్చిన చేపలు చెరువులో ఉండటంతో పెరిగి పెద్దయ్యాయి. ప్రస్తుతం టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి రావటంతో మట్టిని అమ్ముకునేందుకు గాను ఇంజిన్‌లతో నీటిని వెల్లబెట్టే ప్రయత్నం చేస్తుండగా లక్షల విలువ చేసే చేపలు బయటపడ్డాయి. ఒక్కో చేప మూడు నుంచి నాలుగు కేజీల వరకు కూడా ఉందని స్థానికులు చెబుతున్నారు. చెరువులో లభించిన చేపల విలువ సుమారు రూ. 2 నుంచి రూ.3 లక్షల వరకు ఉంటుందని స్థానికులు చెబుతున్నారు. మట్టికోసం వస్తే చేపలు దొరకడంతో అక్రమార్కుల ఆనందానికి అవధులు లేకుండా పోయింది. విషయం తెలుసుకున్న కూటమిలోని మరో వర్గం చేపల ఆదాయంలో మాకు వాటా ఇవ్వాల్సిందేనని పట్టుబడుతుంది. ఇరు వర్గాల వారు వాదోపవాదాలు చేసుకుంటున్నారు. ఈ విషయం నియోజకవర్గ నేత వద్దే తేల్చుకుంటామని ఎవరికి వారే భీిష్మించుకుంటున్నారు.


