మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్
గుంటూరు వెస్ట్: జిల్లాలో యువతకు ఉపాధి అవకాశాలు పెంచే దిశగా కృషి చేస్తున్నామని కేంద్ర గ్రామీణాభివృద్ధి, కమ్యూనికేషన్‌న్స్ శాఖ సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. స్థానిక కలెక్టరేట్‌లోని వీడియో సమావేశ మందిరలో జిల్లా కలెక్టర్ సీఎం సాయి కాంత్ వర్మ, జీఎంసీ కమిషనర్ కె.మయూర్ అశోక్, శాసన మండలి సభ్యులు ఆలపాటి రాజేంద్రప్రసాద్, శాసనసభ్యులు గళ్లా మాధవి, నసీర్ అహ్మద్‌లతో కలసి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పెమ్మసాని మాట్లాడుతూ ప్రస్తుతం గుంటూరు ప్రాంతంలో సంవత్సరానికి సుమారు 6,500 మందికి శిక్షణ ఇచ్చే సామర్థ్యం ఉందన్నారు. దీనిని అదనంగా 9 వేల మేర పెంచి మొత్తం 17 వేల మందికి శిక్షణ అందించేలా ప్రణాళికలు రూపొందిస్తున్నామని పేర్కొన్నారు. శిక్షణ కేంద్రాల కొరతను అధిగమించేందుకు మూతపడిన ఇంజినీరింగ్ కళాశాలలను వినియోగంలోకి తీసుకురావడంపై చర్చిస్తున్నామని చెప్పారు. తెనాలి బుర్రిపాలెంలో యువతకు శిక్షణ ఇచ్చి ఉద్యోగాలు కల్పించిన విధానం మంచి ఫలితాలు ఇచ్చిందని పేర్కొన్నారు. ఇలాంటి కార్యక్రమాలను మరింత విస్తరించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. యువత ఉద్యోగం వచ్చిన వెంటనే కనీసం 20 శాతం పొదుపు చేయడం అలవాటు చేసుకోవాలని కోరారు. కనీసం ఆరు నెలల జీతానికి సమానమైన ఎమర్జెన్సీ ఫండ్ ప్రతి ఒక్కరి దగ్గర ఉండాలని తెలిపారు. తక్కువ ఖర్చుతో లభించే ప్రమాద బీమా, ఆరోగ్య భద్రత పథకాలపై కూడా యువత అవగాహన పెంచుకోవాలని సూచించారు. సమావేశంలో జిల్లా రెవెన్యూ అధికారి షేక్ ఖాజావలి, నైపుణ్య అభివృద్ధి అధికారి సంజీవరావు, జిల్లా పరిశ్రమల అధికారి జయలక్ష్మి, స్వయం ఉపాధి శిక్షణ కేంద్రం డైరెక్టర్ సందీప్, లీడ్ బ్యాంక్ మేనేజర్ మహేంద్ర పాల్ రెడ్డి, డీఆర్డీఏ ప్రాజెక్ట్ డైరెక్టర్ విజయలక్ష్మి పాల్గొన్నారు.


