గురజాల మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్‌రెడ్డి
నరసరావుపేట: అభివృద్ధిలో పోటీపడలేని టీడీపీ నాయకులు అమాయకులైన దివ్యాంగులపైనా దాడులు చేస్తూ అరాచకానికి పాల్పడుతున్నారని గురజాల మాజీ శాసనసభ్యులు కాసు మహేష్‌రెడ్డి విమర్శించారు. శుక్రవారం స్థానిక క్యాంపు కార్యాలయంలో దివ్యాంగుడు సైదారెడ్డితో కలిసి మీడియాతో మాట్లాడారు. గురజాల నియోజకవర్గంలోని తాళ్లచెరువు గ్రామానికి చెందిన దివ్యాంగుడు సైదారెడ్డి బతుకుదెరువు కోసం గ్రామంలో చిన్న బడ్డీ బంకు పెట్టుకొని 30 ఏళ్లుగా తన కుటుంబాన్ని పోషించుకుంటుండగా టీడీపీ నాయకులు ఆ బడ్డీ బంకుతోపాటు మరో దివ్యాంగురాలు జాన్‌బీ షాపును సైతం ధ్వంసం చేశారన్నారు. గ్రామంలో తాగునీటి సరఫరా, రోడ్ల బాగోగులు పట్టించుకోని వారు అమాయకులైన దివ్యాంగులు సైదారెడ్డి, జాన్‌బీలపై దాడిచేయటం దుర్మార్గం అన్నారు. వారి కుటుంబాలకు ఆధారమైన కొట్టును ధ్వంసం చేసిన వారికి బుద్దీ, జ్ఞానం ఉండాలన్నారు. తమ పార్టీ అధికారంలోకి రాగానే రెండుమూడురోజుల వ్యవధిలోనే తన నియోజకవర్గంలో మొదటిగా వారికే న్యాయం చేస్తామన్నారు. చేతనైతే తమతో అభివృద్ధిలో పోటీ పడాలని టీడీపీ నాయకులకు సూచించారు. తాము రెండు, మూడు కోట్ల రూపాయలతో రోడ్లు వేసి ఇళ్ల పట్టాలు అందజేశామని, సచివాలయాలు కట్టామని, తాగునీటి పథకాన్ని తీసుకొచ్చామన్నారు. చేతనైతే వాటిని పూర్తిచేయాలని టీడీపీ నాయకులకు సూచించారు.


