మెట్ల పూజ మార్గంలో జారిపడిన శ్లాబు పెచ్చులు | - | Sakshi
Sakshi News home page

మెట్ల పూజ మార్గంలో జారిపడిన శ్లాబు పెచ్చులు

May 16 2026 3:07 AM | Updated on May 16 2026 3:07 AM

బాలిక తలకు గాయం

ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): అమ్మవారి పాత మెట్ల మార్గంలో శ్లాబ్‌ పెచ్చులు ఊడిపడి ఓ బాలిక తలకు గాయమైంది. ఈ ఘటన శుక్రవారం ఇంద్రకీలాద్రిపై చోటు చేసుకుంది. గుంటూరుకు చెందిన పద్మావతి తన కుమార్తె స్నేహతో కలిసి అమ్మవారి దర్శనానికి విచ్చేసింది. పద్మావతి మెట్ల పూజ చేసుకుంటూ కొండపైకి వెళ్తోంది. మహామండపం పక్కనే ఉన్న పాత మెట్ల మార్గంలో మెట్ల పూజ చేసుకుంటూ కొండపైకి చేరుకుంటుండగా, మెట్ల మార్గంలోని పాత స్టోర్‌ రూమ్‌ సమీపంలో కుళాయి వద్దకు వచ్చేసరికి బాలిక స్నేహ నిల్చున చోట పై నుంచి పెద్ద పెచ్చు ఊడిపడింది. ఆ పెచ్చు బాలిక తలపై పడటంతో గాయం అయి తీవ్ర రక్తస్రావం అయింది. ఆలయ ప్రాంగణంలోని రాజగోపురం వద్ద ఉన్న దేవస్థాన ఆరోగ్య కేంద్రానికి బాలికను తీసుకొచ్చారు. అయితే అక్కడ వైద్యుడు అందుబాటులో లేకపోవడంతో నర్సు వైద్యం అందించింది. గాయం నుంచి రక్తస్రావం తగ్గడంతో వెంటనే దేవస్థాన అంబులెన్స్‌లో విజయవాడ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. బాలికకు వైద్యం చేసిన వైద్యులు ఐదు కుట్లు వేసినట్లు ఆలయ సిబ్బంది తెలిపారు. ప్రమాదం గురించి తెలుసుకున్న ఆలయ ఈవో శీనానాయక్‌ ప్రమాద స్థలాన్ని పరిశీలించారు. అమ్మవారి దర్శనానికి విచ్చేసే భక్తులకు అవసరమైన వైద్య సేవలు అందించేందుకు దేవస్థానం ఇద్దరు వైద్యులను నియమించింది. అయితే శుక్రవారం రద్దీ వేళ ఒక్క వైద్యుడు కూడా అందుబాటులో లేకపోవడంపై భక్తులు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఇదే అంశాన్ని భక్తులు ఆలయ ఈవో శీనానాయక్‌ దృష్టికి తీసుకెళ్లారు.

Advertisement
 
Advertisement
Advertisement