పిడుగురాళ్ల: చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి వైఎస్సార్ సీపీ శ్రేణులపై అక్రమ కేసులు బనాయించి వేధింపులకు గురి చేస్తోందని వైఎస్సార్ సీపీ పల్నాడు జిల్లా యువజన విభాగం ఉపాధ్యక్షుడు సయ్యద్ జబీర్ అన్నారు. పట్టణంలోని వైఎస్సార్ సీపీ కార్యాలయంలో బుధవారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ... వైఎస్సార్ సీపీ కర్నూలు పట్టణ యూత్ అధ్యక్షుడు బాలుపై అక్రమ కేసులు పెట్టి, వేధించి ఆత్మహత్య చేసుకునేలా చంద్రబాబు ప్రభుత్వం ఇబ్బందులకు గురి చేసిందన్నారు. అణిచివేతల వలన వైఎస్సార్ సీపీ యూత్ విభాగం ఆగదని, మీరు ఎంతగా ఇబ్బందులకు గురి చేస్తే అంత రెట్టించిన ఉత్సాహంతో శ్రేణులు పనిచేస్తారని తెలిపారు. ప్రతిపక్షపార్టీగా వివిధ మార్గాల ద్వారా ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నారో వారిని ఇబ్బందులకు గురి చేయటం తగదన్నారు. ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, ముస్లీం మైనార్టీ యువకులను టీడీపీ నేతలు టార్గెట్ చేసి అణిచివేయాలని చూస్తున్నారని, వాటి ఆటలు సాగవని హెచ్చరించారు. దాడులను నిరశిస్తూ నల్ల బ్యాడ్జీలు ధరించారు. పార్టీ గురజాల నియోజకవర్గ యువజన విభాగం అధ్యక్షుడు సాంబశివరావు మాట్లాడారు. నియోజకవర్గ యువజన విభాగం అధక్షుడు బి. సాంబశివరావు, పిడుగురాళ్ల మండల యువజన విభాగం అధ్యక్షుడు ప్రసన్న, మాచవరం మండల అధ్యక్షుడు చిన్న రామాంజనేయులు, పల్నాడు జిల్లా విద్యార్థి విభాగం ప్రధాన కార్యదర్శి షేక్ అబిద్, సయ్యద్ ఇమ్రాన్, కె.రమేష్, జిలానీ అబ్దుల్ మాజిద్ తదితరులు ఉన్నారు.
వైఎస్సార్ సీపీ యువజన విభాగం
జిల్లా ఉపాధ్యక్షుడు సయ్యద్ జబీర్


