● పంక్చర్ దుకాణం పనుల్లో వివాహిత
● సమస్యల పరిష్కారంలో
దంపతుల ప్రయాణం
● విమర్శలు ఎదురైనా
వెనుదిరగని షంషున్
సంప్రదాయాలను పక్కన పెట్టిన ఆమె.. తన జీవిత భాగస్వామికి తోడై నిలిచారు. అప్పుల్లో కూరుకుపోయిన కుటుంబాన్ని ఒడ్డెక్కించేందుకు ఏకంగా పంక్చర్ దుకాణంలో పనులు నేర్చుకున్నారు. భర్తకు చేదోడుగా ఉంటూ చాలావరకు అప్పులు తీర్చారు. ఆమే షంషున్. ద్విచక్ర వాహనాల నుంచి భారీ లారీల వరకు చిటికెలో పంక్చర్ వేసి.. చకచకా టైరు బిగిస్తూ జీవితమనే వాహనం సక్రమంగా సాగేలా కష్టపడుతున్నారు.
యడ్లపాడు: ముసుగు దాటని ముచ్చట్లు, ఇంటి గడప దాటని అడుగులు.. సగటు ముస్లిం గృహిణి గురించి సమాజం రాసుకున్న నిర్వచనమిది. కానీ యడ్లపాడు మండలం బోయపాలెం దగ్గర జాతీయ రహదారిపై వెళ్తుంటే భారీ టిప్పర్ల టైర్లను అవలీలగా విప్పుతూ, ఇనుప రాడ్లతో తిరిగే ఓ మహిళ సగర్వంగా కనిపిస్తుంది. బురఖా ముసుగును పక్కన పెట్టి, టైర్ల మధ్య తన జీవిత చక్రం ఆగిపోకుండా పోరాడుతున్న ఆ వనిత పేరు ‘షంషున్’. వివరాలు ఆమె మాటల్లోనే...
‘నా పేరు షేక్ షంషున్. మస్తాన్‌వలి, రంజాన్‌బీ దంపతులకు మేం ముగ్గురం ఆడపిల్లలం. మాది ఫిరంగిపురం స్వస్థలం. ఐదో తరగతి వరకు చదువుకున్న. పన్నెండేళ్ల కిందట యడ్లపాడు మండలం బోయపాలెంకు చెందిన దరియాతో వివాహం చేశారు. భర్త చిన్నప్పటి నుంచే పంక్చర్ల పని నేర్చుకుని, బోయపాలెం పెట్రోల్ బంక్ వద్ద దుకాణం పెట్టారు. తొలుత అప్పు చేసి లారీ కొన్నాం. విధి వెక్కిరించింది. భారీ నష్టాలు వచ్చి రూ.పది లక్షల అప్పు మిగిలింది. ఇచ్చిన వారు అడుగుతుంటే , మా గురించి ఆలోచించే వారే లేకుండాపోయారు. నీళ్లు తాగి కడుపు నింపుకొన్నాం. ఆకలితో పిల్లలు ఏడుస్తుంటే కన్నీళ్లు ఆగలేదు. ఆ కన్నీళ్లే నా జీవితాన్ని మార్చేశాయి.’’
‘‘నేను పని మొదలుపెట్టిన కొత్తలో చాలామంది వింతగా చూశారు. ‘ఆడపిల్లవి ఇదేం పని?’ అని నన్ను, నా భర్తను ఎద్దేవా చేశారు. నేను పట్టించుకోలేదు. సొంతంగా కష్టపడుతున్నామనే తృప్తి మాకుంది. కష్టంలోనూ పైసా వృథా కాకుండా పొదుపు చేస్తూ అప్పులు తీరుస్తున్నాం. ఇప్పటికే సగానికి పైగా బాకీలు తీరిపోయాయి. నిఖా సమయంలో ‘భార్యాభర్తలు సమానం’ అని చెబుతారు. ఆ మాటను నేను చేతల్లో చూపిస్తున్నాను. మా పిల్లలు మా తల్లిదండ్రుల దగ్గర చదువుకుంటున్నారు. భర్తకు సహచరిగా, బిడ్డలకు ఆసరాగా నిలబడటంలో ఉన్న సంతృప్తి కంటే పెద్ద విజయం ఇంకేముంటుంది? ఒక మహిళ అనుకుంటే సాధ్యం కానిది ఏదీ లేదు.’’
నీతి లేని పోలీసుల రీతి


