చిలకలూరిపేట టౌన్: రోడ్డు దాటే క్రమంలో ప్రమాదవశాత్తూ ట్రాక్టర్ ఢీకొని వ్యక్తి మృతి చెందిన సంఘటన పట్టణంలో జరిగింది. సుభానినగర్‌కు చెందిన వెంకట నారాయణ (40) సోమవారం వేకువజామున కాలనీకి సమీపాన ఉన్న ఓగేరు పాత అయ్యప్ప గుడి వద్ద రోడ్డు దాటుతున్న క్రమంలో వరి పొట్టు లోడు ట్రాక్టర్ ఢీకొంది. ఈ ప్రమాదంలో వెంకటరమణ కు తీవ్ర గాయాలు ఘటనాస్థలిలోనే మృతి చెందాడు. స్థానికుల సమాచారంతో అర్బన్ పోలీసులు ఘటనా స్థలం సందర్శించి మృతదేహాన్ని చిలకలూరిపేట ప్రభుత్వ ఆసుపత్రికి పోస్టుమార్టం నిమిత్తం తరలించారు.కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు.
తెనాలిరూరల్: గంజాయి కేసులో పరారీలో ఉన్న నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. తెనాలి రూరల్ సర్కిల్ కార్యాలయంలో సోమవారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో సీఐ నాయబ్ రసూల్ వివరాలు వెల్లడించారు. జనవరి 30న మండలంలోని పెదరావూరు గ్రామ శివారులో గంజాయి తాగుతున్నారన్న సమాచారంతో రూరల్ పోలీసులు ఆకస్మిక దాడులు నిర్వహించారు. ఎనిమిది మందిని అదుపులోకి తీసుకుని వారి వద్ద నుంచి 1600 గ్రాముల గంజాయిని స్వాధీనపర్చుకున్నారు. వీరిలో బాపట్ల మండలం స్టువర్టుపురానికి చెందిన వల్లాగి విజయ్, తెనాలి నాజరుపేటకు చెందిన వడ్లమూడి గోపికిరణ్, మండలంలోని జగ్గడిగుంటపాలెంకు చెందిన దేవరకొండ మనుశివశంకర్(గతంలో రెండు గంజాయి కేసుల్లో నిందితుడు), తెనాలి నందులపేట మండా వారి వీధికి చెందిన దేవిశెట్టి బసవేశ్వరరావు(గతంలో రెండు గంజాయి కేసుల్లో నిందితుడు), మారిస్‌పేటకు చెందిన షేక్ జాకీర్ హుస్సేన్ గంజాయి విక్రయిస్తున్నట్టు పోలీసులు గర్తించారు. పట్టణ చెంచుపేటకు చెందిన మైనేని రోహిత్ చౌదరి, నందులపేటకు చెందిన తుమ్మలపెంట లక్ష్మీసూర్యప్రకాష్, మారిస్‌పేట రెండు గేట్ల ప్రాంతానికి చెందిన గంపల వెంకట శివనాగమణికంఠ కొనుగోలు చేసి సేవిస్తున్నట్టు పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. అప్పట్లో వీరిని అరెస్ట్ చేయగా, ఇదే కేసులో నిందితులైన పట్టణ మారిస్‌పేట మఠం బజారుకు చెందిన షేక్ ఫిరోజ్, నందులపేటకు చెందిన కోటిసాయి మంజునాథ్ పరారీలో ఉన్నారు. వారిని సోమవారం అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరుస్తున్నట్టు సీఐ తెలిపారు. గంజాయి వినియోగంపై డయల్ 100/112 ద్వారా పోలీసులకు సమాచారం ఇవ్వొచ్చని, సమాచారం ఇచ్చిన వారి వివరాలను గోప్యంగా ఉంచుతామని సీఐ చెప్పారు
నరసరావుపేట ఈస్ట్: కేంద్ర ప్రభుత్వం గణతంత్ర దినోత్సవం–2027 సందర్భంగా ప్రకటించే పద్మ అవార్డులకు అర్హులైన క్రీడాకారులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని జిల్లా క్రీడాభివృద్ధి అధికారి పి.నరసింహారెడ్డి సోమవారం తెలిపారు. రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ వైస్ ఛైర్మన్ ఎస్.భరణి ఉత్తర్వులు జారీ చేసినట్టు వివరించారు. అర్హులైన క్రీడాకారులు తమ నామినేషన్, సిఫారసులను httpr://awardr.gov.in వెబ్‌సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని స్పష్టం చేశారు. తమ దరఖాస్తులను మే 15వ తేదీ సాయంత్రం 5గంటల లోపు rportrinap@ bmai.com, dranrtpanadudirtrict@fmai.com పంపాలని తెలిపారు. వివరాలకు జిల్లా క్రీడాభివృద్ధి కార్యాలయంలో సంప్రదించాలని కోరారు.
తాడికొండ: రాజధాని అమరావతి ప్రాంత యువత, నిరుద్యోగులకు విస్తృతంగా ఉపాధి కల్పించాలనే సదుద్దేశంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నైపుణ్యాభివృద్ధి–శిక్షణ శాఖ, ఏపీ స్టేట్ స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్, సీఆర్‌డీఏ సోషల్ డెవలప్‌మెంట్ అధికారుల సౌజన్యంతో జాబ్ మేళాలు నిర్వహించనున్నట్లు సీఆర్డీయే అధికారులు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఏపీఎస్‌ఎస్‌డీసీ సమన్వయంతో ఈనెల 25న ఉదయం 10 గంటల నుంచి తుళ్లూరులోని ఏపీ సీఆర్డీయే స్కిల్ హబ్ కార్యాలయంలో జరుగుతుందని తెలిపారు. 10వ తరగతి, ఐటీఐ, డిప్లమో, ఇంటర్, డిగ్రీ, బీటెక్, ఎంటెక్, ఎంబీఏ పూర్తిచేసి 18 నుంచి 40 ఏళ్లలోపు వయస్సు ఉన్న అభ్యర్థులు ఈ జాబ్‌మేళాలో పాల్గొనవచ్చని, ఫ్రెషర్స్ – ఉద్యోగ అనుభవం ఉన్నవారికి సైతం ఉద్యోగ అవకాశాలు ఉన్నాయని తెలిపారు. ఆసక్తి ఉన్న అభ్యర్థులు htt pr://naipunyam.ap.gov.in వెబ్‌సైట్‌లో నమోదు చేసుకుని, విద్యార్హతల సర్టిఫికెట్లు, ఆధార్ తదితర గుర్తింపు పత్రాలు, బయోడేటాతో హాజరు కావాలన్నారు. పూర్తి వివరాల కోసం రాజధాని గ్రామాలలోని సీఆర్డీయే ఫెసిలిటేటర్‌ను సంప్రదించవచ్చని, లేకుంటే శ్రీకర్ 9963425999 నంబర్‌కు కాల్ చేయవచ్చని తెలిపారు.


