వైఎస్సార్‌సీపీ ఎస్సీ విభాగం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కొమ్మూరి కనకారావు తాడేపల్లి పోలీస్‌స్టేషన్‌లో గోరంట్లపై ఫిర్యాదు
తాడేపల్లిరూరల్: వైఎస్సార్‌సీపీ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్‌రెడ్డిపై టీడీపీ ఎమ్మెల్యే బుచ్చయ్యచౌదరి ప్రజలను నమ్మించే విధంగా దుష్పచారం చేస్తున్నారని వైఎస్సార్ సీపీ ఎస్సీ విభాగం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కొమ్మూరి కనకారావు అన్నారు. సోమవారం తాడేపల్లి పోలీస్‌స్టేషన్‌లో సీఐ వీరేంద్రకు బుచ్చయ్య చౌదరిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ ఫిర్యాదు చేశారు. ఆయన మాట్లాడుతూ రాజమహేంద్రవరం రూరల్ టీడీపీ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్యచౌదరి ‘మాకు అధికారం ఉంది, మేం తల్చుకుంటే నరికేయగలం’ అంటూ మాట్లాడారని, అది ప్రసార మాధ్యమాలు, సోషల్‌మీడియాలో ప్రచారమైందని అన్నారు. బుచ్చయ్యచౌదరి చేసిన వ్యాఖ్యలు ప్రత్యక్ష హింసను ప్రేరేపించేలా ఉన్నాయని, ప్రజల్లో భయాందోళనలు పెంచేలా ఉన్నాయని అన్నారు. బుచ్చయ్యచౌదరిపై కేసు నమోదు చేసి చట్టపరంగా చర్యలు తీసుకోవాలని సీఐ వీరేంద్రకు ఫిర్యాదు చేశామని పేర్కొన్నారు. కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ ఎస్సీ విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షులు ముదిగొండ ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు.


