తాడేపల్లిరూరల్: తాడేపల్లి పట్టణ పరిధిలోని సీతానగరం విజయకీల్రాదిపై వేంచేసి ఉన్న 27 అడుగుల ఏకశిల విఘ్న విమోచక హనుమంతునికి మండలాభిషేక మహోత్సవాలు సోమవారం ఘనంగా ప్రారంభమయ్యాయి. జీయర్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ మేనేజర్ పురాణం వెంకటాచార్యులు మాట్లాడుతూ త్రిదండి చిన్న శ్రీమన్నారాయణ రామానుజ జీయర్ స్వామి స్వీయ పర్యవేక్షణలో ఉదయం 9 గంటలకు 108 కలశాలతో అభిషేక మహోత్సవం, అనంతరం విశేష అర్చనలు, తీర్థ ప్రసాద గోష్ఠి అంగరంగ వైభవంగా నిర్వహించామని తెలిపారు. కార్యక్రమంలో మైహోమ్ గ్రూప్స్ అధినేత జూపల్లి రామేశ్వరరావు, కుమారి దంపతులు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్ని స్వామివారిని దర్శించుకుని తీర్ధ ప్రసాదాలు స్వీకరించారని తెలిపారు.
బాపట్ల: న్యూఢిల్లీలో ఈనెల 21న జరిగే 18వ సివిల్ సర్వీసెస్ డే వేడుకల్లో భాగంగా నిర్వహించే జాతీయ స్థాయి ఐఏఎస్ అధికారుల వర్క్‌షాప్‌నకు బాపట్ల జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ ఎంపికయ్యారు. కేంద్ర పరిపాలనా సంస్కరణలు, ప్రజా ఫిర్యాదుల విభాగం ఆధ్వర్యంలో జరిగే ఈ వర్క్‌షాప్‌లో దేశవ్యాప్తంగా అమలవుతున్న ఉత్తమ పరిపాలనా విధానాలు, వినూత్న కార్యక్రమాలపై చర్చించనున్నారు. రాష్ట్రం తరఫున ఎంపికై న అధికారుల జాబితాలో బాపట్ల కలెక్టర్‌కు చోటు దక్కడం విశేషం. కలెక్టర్ ఢిల్లీ పర్యటనకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతి మంజూరు చేసి, ఆ కాలాన్ని ఆన్ డ్యూటీగా పరిగణించింది.
నరసరావుపేట రూరల్: మే నెలలో జిల్లా వ్యాప్తంగా కిసాన్ మేళాలు నిర్వహించాలని జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా వ్యవసాయ అధికారులకు సూచించారు. కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో కిసాన్ మేళా, అభ్యుదయం కార్యక్రమాలపై సోమవారం జిల్లా కలెక్టర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ వ్యవసాయంలో అధునాతన పద్ధతులు, ప్రకృతి వ్యవసాయం, యాంత్రీకరణ, బ్యాంక్ సబ్సిడీ రుణాలపై రైతులకు అవగాహన కల్పిస్తూ కిసాన్ మేళాలను నియోజకవర్గ, మండల స్థాయిలో నిర్వహించాలని తెలిపారు. మండలానికో ఒక ఉత్పత్తిని ప్రోత్సహిస్తూ క్లస్టర్ అభివృద్ధి చేసి ఎఫ్‌పీవోలతో అనుసంధానం చేసే ప్రక్రియ పూర్తి చేయాలని తెలిపారు. ఒక్కో క్లస్టర్‌కు రూ.3కోట్లు వరకు, సబ్సిడీతో రూ.5కోట్లు వరకు రుణాలు మంజూరు చేస్తామని తెలిపారు.
ఉచిత ప్రసాద వితరణకు విరాళం
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): దుర్గమ్మ సన్నిధిలో జరుగుతున్న ఉచిత ప్రసాద వితరణకు విజయవాడ మాచవరానికి చెందిన గోవి పాండురంగారావు, కోటేశ్వరి రూ. 1,01,116 విరాళాన్ని అందజేశారు. దాతలకు ఆలయ మర్యాదలతో అమ్మవారి దర్శనం కల్పించారు. వేద పండితుల ఆశీర్వచనం అనంతరం దాతలకు ఆలయ అధికారి అమ్మవారి చిత్రపటం, ప్రసాదాలు, శేషవస్త్రాలను బహూకరించారు.
విజయపురిసౌత్: నాగార్జునసాగర్ జలాశయ నీటిమట్టం సోమవారం 526.30 అడుగులకు చేరింది. ఇది 161.0148 టీఎంసీలకు సమానం. సాగర్ జలాశయం నుంచి ఎస్‌ఎల్‌బీసీకి 450 క్యూసెక్కులు విడుదలవుతోంది. సాగర్ జలాశయం నుంచి మొత్తం ఔట్‌ఫ్లోగా 450 క్యూసెక్కులు విడుదలవుతోంది. శ్రీశైలం నుంచి సాగర్ జలాశయానికి 450 క్యూసెక్కులు వచ్చి చేరుతోంది.


