తల, చేతులకు గాయాలు ప్రభుత్వాసుపత్రిలో పరామర్శించిన డాక్టర్ గోపిరెడ్డి, రోళ్ల మాధవి
నరసరావుపేట: వైఎస్సార్‌సీపీ సోషల్ మీడియా పట్టణ అధ్యక్షుడు హన్నూపై సోమవారం రాత్రి దాడి జరిగింది. ద్విచక్రవాహనంపై వస్తుండగా గుర్తుతెలియని వ్యక్తులు రెండు ద్విచక్రవాహనాలపై వచ్చి రాడ్లు, కర్రలతో దాడిచేశారు. దాడిలో హన్ను తల, చేతులకు తీవ్రగాయమైంది. వారి నుంచి తప్పించుకొని గాయాలతో ప్రభుత్వాసుపత్రిలో చేరారు. విషయం తెలుసుకున్న మాజీ ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి వైద్యశాలకు వచ్చి హన్నూకు తగిలిన గాయాలను సెల్‌ఫోన్ లైటు సహాయంతో పరిశీలించారు. తాను వ్యక్తిగత పనిపై లింగంగుంట్ల గ్రామం వెళ్లి వస్తుండగా జై టీడీపీ, బాస్ అని రాసి ఉన్న నంబర్ ప్లేటు కలిగి ఉన్న బుల్లెట్ బండిపై వచ్చిన వ్యక్తులు తనపై రాడ్లు, కర్రలతో దాడిచేశారని బాధితుడు హన్ను విలేకర్లకు తెలిపారు. దీనిపై డాక్టర్ గోపిరెడ్డి మాట్లాడుతూ దాడిని తీవ్రంగా ఖండించారు. సుమారు ఆరుగురు టీడీపీ గూండాలు దాడిచేశారని, తలకు, చేతులకు గాయాలయ్యాయన్నారు. రెడ్‌బుక్ రాజ్యాంగం అమలులో భాగంగానే ఈ దాడి జరిగిందన్నారు. పోస్టులు పెట్టే వారిపై దాడిచేసి గొంతు నొక్కే కార్యక్రమంలో భాగంగానే ఈ దాడి జరిగిందన్నారు. స్థానిక శాసనసభ్యులు, ఆయన కుమారుడు ఒక పథకం ప్రకరం జాబితా తయారుచేసి దాడులకు పాల్పడుతున్నారన్నారు. 24వ వార్డుకు చెందిన బాధితుడిని వెంబడించి దాడిచేశారన్నారు. వచ్చే తమ ప్రభుత్వంలో తాము జాబితా తయారుచేస్తామన్నారు. ఎవరు దాడిచేసింది, ఎవరు ప్రేరేపించారనేది తమ వద్ద సమాచారం ఉందన్నారు. గత ప్రభుత్వంలో తమపై అనేక పోస్టులు పెట్టినా తాము దాడులు చేయలేదని చెప్పారు. దాడికి పాల్పడిన వ్యక్తికి చెందిన బుల్లెట్ బండిపై స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడతో కూడిన వీడియోను డాక్టర్ గోపిరెడ్డి విలేకర్లకు చూపించారు. తమ కార్యకర్తలపై దాడిచేయాలనే ముందస్తు ప్లాన్‌తో టీడీపీ నాయకులు వ్యవహరిస్తున్నారన్నారు. దాడికి పాల్పడిన వ్యక్తులపై వెంటనే కేసు నమోదుచేసి అరెస్టు చేయాలని, ఇటువంటి చర్యలు పునరావృతం గాకుండా జిల్లా ఎస్పీ వెంటనే చర్యలు తీసుకోవాలని కోరారు. జిల్లా లీగల్ సెల్ అధ్యక్షురాలు రోళ్ల మాధవి, రాష్ట్ర కార్యదర్శి పడాల శివారెడ్డి, పట్టణ అధ్యక్షుడు షేక్ కరిముల్లా, వరవకట్ట పెద్దబుజ్జి తదితర నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.


