నా స్థలం వేరొకరికి రిజిస్ట్రేషన్‌ చేశారు | - | Sakshi
Sakshi News home page

నా స్థలం వేరొకరికి రిజిస్ట్రేషన్‌ చేశారు

Apr 21 2026 4:26 AM | Updated on Apr 21 2026 4:26 AM

ప్రభుత్వ ఉపాధ్యాయుడిపై ఎస్పీకి ఫిర్యాదు లోకేష్‌ వద్దకెళ్లినా న్యాయం జరగదని బెదిరింపులు టీడీపీ మహిళా కార్యకర్త ఆవేదన

సాక్షి టాస్క్‌ఫోర్స్‌: ప్లాట్‌ను మరొకరికి రిజిస్ట్రేషన్‌ చేసి, వచ్చిన సొమ్ములో సగభాగం చెల్లించకుండా ఓ ప్రభుత్వ ఉపాధ్యాయుడు మోసగించాడని టీడీపీ మహిళా కార్యకర్త మీడియా ఎదుట బోరున విలపించింది. మాకు న్యాయం చేయాలని కోరుతూ సోమవారం గుంటూరు జిల్లా పోలీస్‌ కార్యాలయ (డీపీఓ) ఆవరణలో జరిగిన పీజీఆర్‌ఎస్‌లో బాధితురాలు ఫిర్యాదు చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. మంగళగిరి బేతపూడి గ్రామం బాపూజీనగర్‌లో నివాసం ఉంటున్నట్లు బొక్కా సుధారాణి తెలిపింది. ప్రస్తుతం పూల విక్రయిస్తూ జీవిస్తున్నట్లు పేర్కొంది. 2017 కురగల్లు గ్రామ పరిధిలో 150 గజాల స్థలాన్ని నూతక్కిలో విధులు నిర్వర్తించే ఓ ప్రభుత్వ ఉపాధ్యాయుడి వద్ద కొనుగోలు చేశానని తెలిపింది. 2021లో ప్లాట్‌గా మారడంతో ఆ ఉపాధ్యాయుడు స్వాధీన అగ్రిమెంట్‌ రాసిచ్చాడని పేర్కొంది. ఈ ఏడాది జనవరిలో తమకు తెలియకుండానే నా 150 గజాల స్థలంతోపాటు అందులోని మిగతా స్థలం కలిపి ఉపాధ్యాయుడు వేరొకరికి విక్రయించి రిజిస్ట్రేషన్‌ చేయించాడని వాపోయింది. దీనికిగాను నా 150 గజాల స్థలానికి రూ.50 లక్షలు ఉపాధ్యాయుడు చెల్లించాల్సి ఉందని తెలిపింది. డబ్బుల విషయమై అతన్ని పలుమార్లు అడిగినా సరైన సమాధానం లేదని వాపోయింది. దీనిపై మంగళగిరి గ్రామీణ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసినా పట్టించుకోవడంలేదు. టీడీపీలో కార్యకర్తగా పనిచేస్తున్న తమకు న్యాయం జరగడంలేదని వాపోయింది. లోకేష్‌తోపాటు ఎవరూ వద్దకెళ్లినా న్యాయం జరగదని అవతల వారు బెదిరిస్తున్నారని రోదించింది. ఇక మరణమే తనకు దిక్కు అని సుధారాణి మీడియా ఎదుట కన్నీటిపర్యంతమైంది.

Advertisement
 
Advertisement
Advertisement