బైక్‌ను ఢీకొన్న కోళ్ల వ్యాన్‌ | - | Sakshi
Sakshi News home page

బైక్‌ను ఢీకొన్న కోళ్ల వ్యాన్‌

Apr 21 2026 4:26 AM | Updated on Apr 21 2026 4:26 AM

ఇద్దరు యువకుల మృతి దైవ దర్శనానికి వెళ్లి వస్తుండగా సంఘటన..

కారెంపూడి: కోళ్ల వ్యాన్‌ బైక్‌ను ఢీకొనడంతో బైక్‌పై ప్రయాణిస్తున్న ఇద్దరూ అక్కడికక్కడే మృతి చెందగా మరొకరు తీవ్రంగా గాయపడిన దుర్ఘటన మండలంలోని పేటసన్నెగండ్ల బ్రిడ్జి వద్ద సోమవారం సాయంత్రం చోటుచేసుకుంది. అడిగొప్పల అమ్మవారి దర్శనానికి వెళ్లి తిరిగి బైక్‌పై ఇంటికి వెళ్తున్న వీరిని ఎదురుగా వచ్చిన వ్యాన్‌ వేగంగా ఢీకొంది. ప్రమాదంలో బైక్‌పై ప్రయాణిస్తున్న పిడుగురాళ్లకు చెందిన చెవుల దాసు (25), మేకల శివాజీ (30) అక్కడికక్కడే మృతి చెందారు. సాంబశివరావు అనే వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. ఆయన కాళ్లకు బలమైన గాయాలయ్యాయి. వీరు ముగ్గురు అడిగొప్పల సమీపంలోని శ్రీనిదానంపాటి శ్రీలక్ష్మీ అమ్మవారిని దర్శించుకుని తిరిగి స్వగ్రామం వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. పేటసన్నెగండ్ల శివారులో ఉన్న సాగర్‌ కాల్వ బ్రిడ్జి సమీపంలో ఉన్న రోడ్డు డౌన్‌లో ఈ రోడ్డు ప్రమాదం జరిగింది. పిడుగురాళ్ల వైపు నుంచి అతి వేగంగా వస్తున్న కోళ్లు రవాణా చేసే బొలోరో వాహనం వీరు ప్రయాణిస్తున్న బైక్‌ను ఎదురుగా అతి వేగంగా ఢీకొన్నట్లు తెలుస్తోంది. దీంతో ద్విచక్ర వాహనంపై ప్రయాణిస్తున్న ముగ్గురిలో ఇద్దరు వాహనం టైర్ల కింద పడి నలిగిపోయారు. ఇద్దరూ తీవ్రగాయాలై రక్తపు మడుగులో అక్కడికక్కడే మృతి చెందారు. తీవ్రంగా గాయపడిన వ్యక్తిని నర్సరావుపేట హాస్పటల్‌కు తరలించారు. ఘటనా స్థలాన్ని సీఐ శరత్‌బాబు, ఎస్‌ఐ వాసులు పరిశీలించి విచారిస్తున్నారు. పోలీసులు తగిన సహాయక చర్యలు తీసుకుంటున్నారు. బంధువులకు సమాచారం అందించేందుకు చర్యలు తీసుకుంటున్నారు. వ్యాన్‌ మండలంలోని ఒప్పిచర్ల గ్రామంలోని కోళ్లఫారం యజమానిదిగా తెలుస్తోంది.

Advertisement
 
Advertisement
Advertisement