ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): శ్రీదుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానానికి భక్తుల తాకిడి పెరిగింది. వేసవి సెలవుల నేపథ్యంలో ఉభయ తెలుగు రాష్ట్రాలకు చెందిన భక్తులతో పాటు యాత్రికులు ఇంద్రకీలాద్రికి తరలివవచ్చి అమ్మవారిని దర్శించుకుని మొక్కుబడులు చెల్లించుకున్నారు. తెల్లవారుజాము నుంచే ఆలయ ప్రాంగణంలో రద్దీ కనిపించింది. వేకువజామున నిర్వహించిన పలు ఆర్జిత సేవలతో పాటు ఉదయం 7 గంటల తర్వాత ప్రారంభమయ్యే శ్రీచక్రనవార్చన, చండీహోమం, లక్ష కుంకుమార్చన, శాంతి కళ్యాణంలో ఉభయదాతలు విశేషంగా పాల్గొన్నారు. ఉదయం 9 గంటల తర్వాత భక్తుల రద్దీ మరింత పెరగడంతో అంతరాలయ దర్శనాన్ని ఆలయ అధికారులు రద్దు చేశారు. వీఐపీలకు, ప్రముఖులతో పాటు రూ.300 టికెట్ కలిగిన భక్తులకు బంగారు వాకిలి దర్శనం కల్పించారు. ఘాట్‌రోడ్డు, మహా మండపం లిప్టు, మెట్ల మార్గం ద్వారా విచ్చేసిన భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలుగకుండా ఆలయ ప్రాంగణంలో చల్లటి తాగునీటితో పాటు మజ్జిగ ప్యాకెట్లను పంపిణీ చేశారు. చిన్న పిల్లలకు బిస్కెట్ ప్యాకెట్లను దేవస్థానం అందజేసింది.
సూర్యోపాసన సేవ
లోక కళ్యాణార్థం, సర్వ మానవాళికి సంపూర్ణ ఆరోగ్యాన్ని కాంక్షిస్తూ ఆలయ ప్రాంగణంలో ఆదివారం సూర్యోపాసన సేవ నిర్వహించారు. అమ్మవారి ఆలయ ప్రాంగణంలోని లక్ష కుంకుమార్చన వేదిక వద్ద సూర్యభగవానుడి విగ్రహానికి ఆలయ అర్చకులు పూజా కార్యక్రమాలను నిర్వహించారు. అనంతరం సూర్య నమస్కారాలు, సూర్యోపాసన సేవ నిర్వహించగా పలువురు ఉభయదాతలు పూజలో పాల్గొన్నారు. పూజ అనంతరం ఉభయదాతలకు ప్రత్యేక క్యూలైన్ మార్గం ద్వారా అమ్మవారి దర్శనానికి అనుమతించారు.


