గుంటూరు వెస్ట్ (క్రీడలు): అథ్లెటిక్ అసోసియేషన్ ఆఫ్ గుంటూరు జిల్లా ఆధ్వర్యంలో ఈ నెల 23న స్థానిక బీఆర్ స్టేడియంలో జిల్లా సీనియర్ (పురుషులు, మహిళలు) అథ్లెటిక్ జట్ల ఎంపిక నిర్వహించనున్నట్లు సంఘం కార్యదర్శి జీవీఎస్ ప్రసాద్ ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఎంపికైన వారు ఏపీ స్టేట్ సీనియర్ అథ్లెటిక్ పోటీల్లో పాల్గొంటారని తెలిపారు. ఎంపికల్లో 18 సంవత్సరాలు దాటిన వారందరూ పాల్గొనటానికి అర్హులన్నారు. ఆసక్తి గల క్రీడాకారులు 23వ తేదీ 9 గంటలకు బీఆర్ స్టేడియంలో తమ వయసు ధ్రువీకరణ పత్రంతోపాటు, ఆధార్ కార్డు జిరాక్స్ తీసుకొని రిపోర్ట్ చేయాలని కోరారు.
అంతర్జాతీయ హంగులతో సూర్యలంక తీరం అభివృద్ధి
బాపట్ల: సూర్యలంక సముద్ర తీరాన్ని అంతర్జాతీయ ప్రమాణాలతో అభివృద్ధి చేస్తున్నట్లు రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ చైర్మన్ డాక్టర్ నూకసాని బాలాజీ తెలిపారు. కేంద్ర ప్రభుత్వ ‘స్వదేశీ దర్శన్ 2.0’ పథకం కింద రూ.97.52 కోట్లతో చేపడుతున్న అభివృద్ధి పనులను ఆదివారం ఆయన పరిశీలించారు. సూర్యలంక తీర ప్రాంతంలోని కాటేజీలు, పర్యాటకులు సేదతీరే ప్రదేశాలు, మౌలిక వసతులను స్వయంగా పరిశీలించిన ఆయన, ఏపీటీడీసీ ఆధ్వర్యంలో నడుస్తున్న హరిత రిసార్డ్స్‌ను సందర్శించారు. గదుల లభ్యత, సేవల నాణ్యత, రెస్టారెంట్ ఆహార ప్రమాణాలపై ఆరా తీశారు. బీచ్ పరిసరాల్లో పరిశుభ్రత నిర్వహణకు ప్రాధాన్యత ఇవ్వాలని సిబ్బందికి సూచించారు.పర్యాటకుల భద్రత విషయంలో ఎలాంటి నిర్లక్ష్యం ఉండరాదని, సముద్ర స్నానాలకు వచ్చే సందర్శకుల రక్షణ కోసం లైఫ్ గార్డులు, హెచ్చరిక బోర్డులు, నిఘా వ్య వస్థను మరింత పటిష్టం చేయాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో డీవీఎం చైతన్య, మేనేజర్లు సతీష్, నాగభూషణం, వర్క్ ఇన్‌్‌స్పెక్టర్ శ్రీధర్, కాంట్రాక్టర్ సతీష్, డివిజన్ కార్యాలయ సిబ్బంది, యూనిట్ సిబ్బంది పాల్గొన్నారు.
ఇంకొల్లు(చినగంజాం): రాష్ట్రస్థాయి బేస్ బాల్ పోటీల్లో రాణిస్తే క్రీడాకారులకు మంచి భవిష్యత్ ఉంటుందని ఆంధ్రప్రదేశ్ బేస్‌బాల్ జాయింట్ కార్యదర్శి వేమారెడ్డి అన్నారు. మండలంలోని డీవీఆర్ సైనిక్ స్కూల్ క్రీడా మైదానంలో ఆదివారం బాపట్ల జిల్లా సబ్ జూనియర్ బాలబాలికల బేస్‌బాల్ ఎంపిక పోటీలు నిర్వహించారు. ముఖ్య అతిథులుగా రాష్ట్ర బేస్ బాల్ జాయింట్ కార్యదర్శి వేమారెడ్డితో పాటు డీవీఆర్ సైనిక్ స్కూల్ డైరెక్టర్ గోరంట్ల సుబ్బారావులు హాజరై జిల్లా జట్టు ఎంపిక పోటీలను ప్రారంభించారు. ఈ సందర్భంగా వేమారెడ్డి మాట్లాడుతూ జిల్లా జట్టులో ఎంపికై న క్రీడాకారులు మే నెల 5 నుంచి 7 వరకు కర్నూలు జిల్లాలోని గోనెగండ్ల జెడ్పీ హైస్కూల్‌లో నిర్వహించే సబ్ జూనియర్ రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొంటారని తెలిపారు.


