ఏపీటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి మక్కెన శ్రీనివాసరావు
నరసరావుపేట ఈస్ట్: చంద్రబాబునాయుడు ప్రతిపక్షంలో ఉండగా ఉద్యోగులు, ఉపాధ్యాయులకు మెరుగైన పీఆర్సీ, పెండింగ్ బకాయిల చెల్లింపు, డీఏ విడుదలపై హామీలు గుప్పించారని, అధికారంలోకి వచ్చిన తరువాత వాటిని అమలు చేయటంలో విఫలమయ్యారని ఏపీటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి మక్కెన శ్రీనివాసరావు విమర్శించారు. ఉపాధ్యాయ, విద్యారంగ సమస్యల పరిష్కారం కోరుతూ ఏపీటీఎఫ్ రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా శనివారం స్టేషన్‌రోడ్డులోని ధర్నా చౌక్ వద్ద ధర్నా నిర్వహించారు. ఏపీటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు కేఎస్‌కే షరీఫా అధ్యక్షత నిర్వహించిన ధర్నాలో శ్రీనివాసరావు మాట్లాడుతూ కనీసం పీఆర్సీ కమిషన్ నియమించకుండా కూటమి ప్రభుత్వం మొండివైఖరి అవలంబిస్తోందని, వెంటనే పీఆర్సీ కమిషన్ నియామకంతోపాటు 30 శాతం మధ్యంతర భృతి ప్రకటించాలని డిమాండ్ చేశారు. సీపీఎస్ రద్దుపై ప్రతిపక్ష నాయకుడిగా ఆమోదయోగ్యమైన పరిష్కారం చూపుతామన్న చంద్రబాబు అధికారంలోకి వచ్చి రెండేళ్లు గడుస్తున్నా మాట్లాడకపోవటం సీపీఎస్ ఉద్యోగులను దగా చేయటమే అవుతుందన్నారు. ఏపీటీఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి బాళ్ల శ్రీనివాసరావు మాట్లాడుతూ, ఉపాధ్యాయులకు యాప్‌ల భారాన్ని తగ్గించి బోధనకు పరిమితం చేయాలని కోరారు. ధర్నా అనంతరం జిల్లా కలెక్టరేట్‌లో 43 డిమాండ్లతో కూడిన వినతి పత్రం అందచేశారు. కార్యక్రమంలో ఏపీటీఎఫ్ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు సయ్యద్ కరిముల్లా, రాష్ట్ర కౌన్సిలర్లు వి.వి.రవికుమార్, సువర్ణ, జిల్లా సబ్‌కమిటీ సభ్యులు కృష్ణారావు, ఇబ్రహీమ్, ప్రజామూర్తి తదితరులు పాల్గొన్నారు.


