మొక్కజొన్న రైతులను ముంచిన సర్కార్‌ | - | Sakshi
Sakshi News home page

మొక్కజొన్న రైతులను ముంచిన సర్కార్‌

Apr 18 2026 7:41 AM | Updated on Apr 18 2026 7:41 AM

పంటకు మద్దతు ధర కల్పించడంలో చంద్రబాబు ప్రభుత్వం ఘోర వైఫల్యం అటకెక్కిన బాబు హామీలు రైతులకు అన్నీ కష్టాలే...

మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు తక్షణమే ఏర్పాటు చేయాలని డిమాండ్‌ కాసు బ్రహ్మానందరెడ్డి ఎక్స్‌ప్రెస్‌ హైవేపై రొంపిచర్ల వద్ద రహదారి దిగ్బంధం చేసిన వైఎస్సార్‌సీపీ రైతు ధర్నాలో పాల్గొన్న పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ డాక్టర్‌ గోపిరెడ్డి, కాసు మహేష్‌రెడ్డి, డాక్టర్‌ గజ్జల

పట్టించుకునే వారే లేరు..

అన్నదాతలపై బాబుకు జాలే లేదు..

పంటకు మద్దతు ధర కల్పించడంలో చంద్రబాబు ప్రభుత్వం ఘోర వైఫల్యం
అటకెక్కిన బాబు హామీలు

నరసరావుపేట, రొంపిచర్ల: పంటలకు గిట్టుబాటు ధరలు కల్పించకుండా, కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకుండా రైతులను చంద్రబాబు సర్కారు నట్టేట ముంచుతోందని వైఎస్సార్‌సీపీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మొక్కజొన్న పంటకు మద్దతు ధర కల్పించాలని, కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని కోరుతూ వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో నాయకులు, రైతులు కాసు బ్రహ్మానందరెడ్డి ఎక్స్‌ప్రెస్‌ హైవేపై రొంపిచర్ల మార్కెట్‌ యార్డు వద్ద రైతు ధర్నా నిర్వహించారు. రాస్తారోకో చేసి రోడ్డును దిగ్బంధనం చేశారు. దీనిలో జిల్లా కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే డాక్టర్‌ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, గురజాల మాజీ శాసనసభ్యుడు కాసు మహేష్‌రెడ్డి, సత్తెనపల్లి నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్‌ గజ్జల సుధీర్‌ భార్గవరెడ్డి, గురజాల నియోజకవర్గ పరిశీలకుడు పడాల శివారెడ్డి, వందల మంది నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. వెంటనే మొక్కజొన్న పంటకు రూ.2,400 గిట్టుబాటు ధర కల్పించాలని, కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని డిమాండ్‌ చేశారు.

ఈ సందర్భంగా డాక్టర్‌ గోపిరెడ్డి మాట్లాడుతూ.. పల్నాడు జిల్లాలో దాదాపు రెండు లక్షల ఎకరాల్లో మొక్కజొన్న పంట పండించారన్నారు. వరి వేసుకోవద్దు, ఇతర పంటలకు మళ్లాలని చంద్రబాబు నాయుడు చెప్పిన తర్వాత రైతులు మొక్కజొన్న పండించారన్నారు. పల్నాడు జిల్లాతోపాటు యావత్‌ రాష్ట్రంలో 30 లక్షల టన్నుల మొక్కజొన్న ఉత్పత్తి వచ్చిందన్నారు. మొక్కజొన్న పండించడానికి, రైతుకు ఎకరానికి పెట్టుబడి రూ.50 వేలు అవుతుందని చెప్పారు. కౌలుకు మరొక రూ.20 వేలు కలిపి మొత్తం రూ.70 వేలు ఖర్చు అవుతోందన్నారు. దళారులు క్వింటాకు రూ.1700 చొప్పున కొనుగోలు చేస్తే రూ.68 వేలు మాత్రమే వస్తుందన్నారు. అంటే ఎకరానికి రైతు ఇంకా రూ.2 వేలు నష్టపోతున్నాడని పేర్కొన్నారు. ఏడాది అంతా కష్టపడి, ఎండనక వాననక రైతు పొలంలో పండించిన పంటకు గిట్టుబాటు ధర కల్పించడంలో చంద్రబాబు ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. ఇప్పటికే రూ.లక్షల కోట్లు అప్పుచేసి రాజధాని నీళ్లలో పోస్తోందని పేర్కొన్నారు. వాటిలో కనీసం రూ.3 వేల కోట్లు ఖర్చు పెడితే రాష్ట్రవ్యాప్తంగా రైతు పంట కొనుగోలు చేయవచ్చునని చెప్పారు. ఆరోగ్యశ్రీకి డబ్బులు చెల్లించకపోవటంతో పేదలు ఇబ్బంది పడుతున్నారని పేర్కొన్నారు. రైతులకు గిట్టుబాటు ధర ఇవ్వలేరుగానీ... రాజధానిలో ఒక్కో కాంట్రాక్టర్‌కు మొబిలైజేషన్‌ అడ్వాన్సుల కింద రూ.3 వేల కోట్లు, రూ.4 వేల కోట్లు ఇచ్చే కార్యక్రమం చేస్తున్నారన్నారు. ఇంత దారుణంగా రైతు నష్టపోతుండగా, వారిని ఆదుకునే వారే కరువయ్యారని తెలిపారు. చంద్రబాబు నాయుడు, ఇక్కడి ఎమ్మెల్యేలు వారి సొంత లాభాలు, దందాల కోసం వ్యవహరిస్తున్నారేగానీ ఎక్కడా పరిపాలన సాగట్లేదన్నారు. పల్నాడు జిల్లా రైతులందరూ పెద్ద ఎత్తున డిమాండ్‌ చేస్తున్నారని, కలెక్టర్‌ వెంటనే స్పందించి ప్రతి మార్కెట్‌ యార్డులో రైతు కొనుగోలు కేంద్రాలు ప్రారంభించాలని కోరారు. మద్దతు ధర రూ.2400 ప్రకారం కొనుగోలు చేయాలని పార్టీ తరఫున డిమాండ్‌ చేస్తున్నామన్నారు. స్థానిక ఎంపీ, ఎమ్మెల్యేలు కూడా సీఎం చంద్రబాబును అడుగుతారో, కేంద్రాన్ని అడుగుతారో అది వారిష్టమన్నారు. ప్రకటించిన రేటుకు కొంటామంటేనే రైతులు మొక్కజొన్న సాగు చేశారని, ఇప్పుడు కొనుగోలు చేయకపోవడం వల్లే దళారులు తక్కువ రేటుకు కొంటున్నారన్నారు. ఒక్కసారి కొనుగోలు కేంద్రాలు తెరిచి రేటు ఫిక్స్‌ చేస్తే, దళారులు కూడా రేటు పెంచే అవకాశం ఉంటుందని తెలిపారు. స్థానిక ఎమ్మెల్యే బాత్‌రూమ్‌లో 10 గంటలు కూర్చునే బదులు కలెక్టర్‌, వ్యవసాయాధికారి దగ్గరో 10 గంటలు ధర్నా చేసేందుకు సిద్ధం కావాలని సూచించారు.

డాక్టర్‌ గజ్జల సుధీర్‌ భార్గవరెడ్డి మాట్లాడుతూ గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో రైతులకు పంట ధరల స్థిర నిధి కింద రూ.3 వేల కోట్లు కేటాయించారన్నారు. తుపాను వలన నష్టపోయిన రైతులకు నష్టపరిహారం వెంటనే చెల్లించారని పేర్కొన్నారు. రైతు భరోసా కేంద్రాల ద్వారా పంటను కొనుగోలు చేసి ప్రతి రైతులకు అండగా నిలిచిందన్నారు. నేడు చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తుపాను వలన నష్టపోయిన రైతులకు నష్టపరిహారం చెల్లించలేదని పేర్కొన్నారు. రైతులకు ఎరువులు అందించడంలో విఫలమైందన్నారు. అధిక పెట్టుబడులతో రైతన్న ఇబ్బందులకు గురవుతున్నారని తెలిపారు. నేడు పంట కొనుగోలు చేయడంలో కూడా చంద్రబాబు ప్రభుత్వం విఫలమైందన్నారు. రైతన్నకు న్యాయం జరిగేలా వెంటనే కొనుగోలు కేంద్రాలను ప్రారంభించి పంటను మద్దతు ధరలు కొనాలని డిమాండ్‌ చేశారు. లేనిపక్షంలో రైతులకు అండగా వైఎస్సార్‌సీపీ పోరాడుతుందని స్పష్టం చేశారు. రైతు, విద్యార్థి, ఎస్‌సీ సెల్‌ విభాగాల జిల్లా అధ్యక్షులు అన్నెం పున్నారెడ్డి, గుజ్జర్లపూడి ఆకాష్‌కుమార్‌, కొమ్ము చంద్రశేఖర్‌, రొంపిచర్ల, నకరికల్లు, నరసరావుపేట మండలాల కన్వీనర్లు కురుగుంట్ల శ్రీనివాసరెడ్డి, భవనం రాఘవరెడ్డి, తన్నీరు శ్రీనివాసరావు, పంచాయతీరాజ్‌ విభాగ రాష్ట్ర కార్యదర్శి పడాల చక్రారెడ్డి, జెడ్పీటీసీ సభ్యుడు పదముత్తం చిట్టిబాబు, జెడ్పీటీసీ మాజీ సభ్యుడు గెల్లి బ్రహ్మారెడ్డి, మండల ఉపాధ్యక్షుడు పొనుగోటి వెంకటరావు, మండల యువజన విభాగ అధ్యక్షుడు మోతుకూరి వెంకటేష్‌, నాయకులు పచ్చవ రవీంద్రబాబు, ముండ్రు హరినారాయణ, గాడిపర్తి సీతయ్య, షేక్‌ కరిముల్లా, చపారపు సంజీవరెడ్డి, గుండా వెంకటేష్‌, పల్లకి అంజనారెడ్డి, బొల్లు బుజ్జి, పొనుగోటి నాసరరావు, మానుకొండ వాసుదేవరెడ్డి, కోడూరి వెంకటేశ్వరరెడ్డి, కంచేటి రామారావు, పల్లపు అంజయ్య తదితర ఎస్‌సీ, ఎస్‌టీ, బీసీ, మైనార్టీ నాయకులు, రైతులు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు.

కాసు మహేష్‌రెడ్డి మాట్లాడుతూ పల్నాడు చాలా వెనుకబడిన ప్రాంతమని, జొన్న, పెసరు ఎక్కువగా పండిస్తారన్నారు. కాసు బ్రహ్మానందరెడ్డి ముఖ్యమంత్రిగా నాగార్జునసాగర్‌ నిర్మించిన తర్వాత ఈ ప్రాంత రైతులు కష్టపడి వరి, పత్తి, మిరప, అపరాలు పండించి విదేశాలకు ఎగుమతి చేస్తున్నారన్నారు. వైఎస్‌ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా సాగర్‌ ఆధునికీకరణకు రూ. వేల కోట్లు ఖర్చుచేసి చివరి భూములకు సైతం నీరు అందేలా కాలువలను తీర్చిదిద్దారన్నారు. అద్దంకి–నార్కెట్‌పల్లి హైవే ఆధునికీకరించటం వలన రైతులు పండించిన పంట ఈ రోజు ఎక్కడికై నా తీసుకెళ్లే అవకాశం దక్కిందన్నారు. నరసరావుపేట మార్కెట్‌ యార్డును విభజించి రొంపిచర్ల మార్కెట్‌ యార్డును ఏర్పాటు చేశారన్నారు. వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి ముఖ్యమంత్రిగా రైతులకు ఇన్‌పుట్‌ సబ్సిడీ, స్థిరీకరణ నిధి, రైతు భరోసా, ప్రత్యేక రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేసి వ్యవసాయం పండగ చేశారన్నారు. చంద్రబాబు వస్తే మళ్లీ వ్యవసాయం దండగ చేస్తారని చెప్పామని, అయితే అరచేతిలో వైకుంఠం చూపించి మహిళలకు నెలకు రూ.1500, మూడు సిలిండర్లు, నిరుద్యోగ భృతి వంటి హామీలిచ్చి అధికారాన్ని చేజిక్కించుకున్నారని తెలిపారు. ఇప్పుడు చేసిన వాగ్దానాలు తుంగలో తొక్కుతున్నారని ఆరోపించారు. రైతులకు కనీసం గిట్టుబాటు ధర కూడా కల్పించలేని స్థితిలో ఉన్నారని పేర్కొన్నారు.

అన్నదాత సుఖీభవ కింద సాయం అందక పలువురు రైతులు నష్టపోయారన్నారు. ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకే మొక్కజొన్న వేసినా గిట్టుబాటు ధర కల్పించలేదన్నారు. వైఎస్‌ జగన్‌ ముఖ్యమంత్రిగా ఉండి ఉంటే గిట్టుబాటు ధర కల్పించేవారని పేర్కొన్నారు. టీడీపీ తరఫున ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఉన్నా ప్రయోజనం లేదని అన్నారు. వారు ఏసీ గదులలో కూర్చొని దందాలు చేస్తున్నారన్నారు. రైతులను పట్టించుకునే వారే కరువయ్యారని తెలిపారు. మండుటెండలోనూ రైతుల కోసం బాధ్యతగా వైఎస్సార్‌సీపీ పోరాడుతుందన్నారు. చంద్రబాబు కళ్లు తెరిపించి వ్యవసాయాన్ని పండగ చేస్తామని ప్రకటించారు.

Advertisement
 
Advertisement
Advertisement