జవాబు కాదు
విమర్శలకు దాడి
నగరంపాలెం (గుంటూరు వెస్ట్)/ నెహ్రూనగర్ (గుంటూరు ఈస్ట్): గుంటూరు సిద్ధార్థనగర్‌లో మాజీ మంత్రి, వైఎస్సార్‌సీపీ గుంటూరు జిల్లా అధ్యక్షుడు అంబటి రాంబాబును బుధవారం వైఎస్సార్‌సీపీ రాష్ట్ర పీఏసీ సభ్యులు సాకే శైలజానాఽథ్, పార్టీనేత వంగవీటి నరేంద్ర, ఎమ్మెల్సీలు పాలవలస విక్రాంత్, పీవీవీ సూర్యనారాయణ, అనంతబాబు, రేపల్లె సమన్వయకర్త ఈవూరు గణేష్, సినీ నటుడు జోగినాయుడు పరామర్శించారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడారు.
● సాకే శైలజానాఽథ్ మాట్లాడుతూ, రాజకీయాలలో విమర్శలు, ప్రతి విమర్శలు ఉండాలి కానీ, దాడులు చేయడం మంచి విధానం కాదని అన్నారు. పోలీసుల సమక్షంలో ఏడు గంటలకు పైగా అంబటి ఇల్లు, కార్యాలయంపై దాడి జరగడం బాధాకరమని చెప్పారు. అన్యాయాన్ని ఎదురించేందుకు ఉన్నానని అంబటి వ్యాఖ్యానించడం మంచి మాటగా భావిస్తున్నానని పేర్కొన్నారు. అసెంబ్లీలో చంద్రబాబు నోట్‌ఫైల్ ప్రకారం పచ్చి అబద్ధాలు మాట్లాడారని మండిపడ్డారు. లడ్డూలో అసలు కల్తీలేదని, అయినప్పటికి దుర్మార్గంగా మాట్లాడేందుకు ప్రయత్నించారని ఆరోపించారు.
● వైఎస్సార్ సీపీ నేత వంగవీటి నరేంద్ర మాట్లాడుతూ ఒక అన్యాయాన్ని ప్రశ్నిస్తే టీడీపీ ప్రభుత్వం అడ్డగోలు అరెస్ట్‌లు, శిక్షలు జరుగుతాయనేది స్పష్టంగా తెలుస్తుందని అన్నారు. అయినా మేమంతా కలిసి కట్టుగా ఉన్నామని, టీడీపీ చేసిన తప్పులను, అక్రమాలను ప్రజలకు తెలియజేస్తామని చెప్పారు.
● మాజీ మంత్రి అంబటి రాంబాబు మాట్లాడుతూ ఇల్లు, కార్యాలయంపై దాడి గురించి చెప్పేందుకు రాష్ట్ర డీజీపీ, ఏడీజీపీ, గుంటూరు జిల్లా ఎస్పీకి ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ అనేకసార్లు ఫోన్ చేసినా ఎవరూ ఫోన్ లిఫ్ట్ చేయలేదన్నారు. దాడికి పాల్పడిన వారు క్రిమినల్స్ కాదని, చంద్రబాబు, లోకేష్, డీజీపీ, ఐజీ, గుంటూరు జిల్లా ఎస్పీ క్రిమినల్స్ అని మండిపడ్డారు. ఆ రోజు మా ఇంటి దగ్గర వరకు జిల్లా ఎస్పీ వచ్చి వెనక్కి వెళ్లారని అన్నారు. చంద్రబాబుకి టచ్‌లో ఉండే పనిలో జిల్లా ఎస్పీ ఉన్నారని ఆరోపించారు. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ ఫెయిల్ అయిందని ఆరోపించారు.
● రేపల్లె సమన్వయకర్త ఈవూరు గణేష్ మాట్లాడుతూ తిరుపతి లడ్డూ అంశాన్ని డైవర్ట్ చేయడానికే చంద్రబాబు ప్రభుత్వం అంబటి రాంబాబుపై దాడి చేయించారనీ, ఇది కేవలం డైవర్షన్ పాలిటిక్స్ మాత్రమేనని, ప్రజలు దీనిని గమనించాలన్నారు.


